వినాయక చవితి సందడి.. పార్టీల ఓట్ల వేట!
హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైపోయింది. ఎక్కడ చూసినా భారీ గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయం కూడా సరికొత్త రంగు పులుముకుంది. రానున్న కొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో, నగరంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ వినాయక నవరాత్రులను ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రధాన వేదికగా ఎంచుకుంటున్నాయి. దేవుడి భక్తికి రాజకీయ యుక్తి తోడై, నగర గల్లీల్లో పండగ సందడి పరోక్ష ఎన్నికల ప్రచారంగా మారుతోంది.
ఇప్పటివరకు హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర మాత్రమే భారీ ఎత్తున జరిగేది. కానీ ఈసారి మహారాష్ట్ర తరహాలో విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందు నిర్వహించే స్వాగత ఊరేగింపులు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. నిమజ్జనంతో సమానంగా వేలాది మంది ప్రజలు ఈ ఆగమన్ ర్యాలీల్లో పాల్గొంటుండటం వెనుక రాజకీయ పార్టీల హస్తం, ప్రోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కొద్ది రోజులుగా అన్ని పార్టీల శాసనసభ్యులు, కీలక నేతలు ఈ ఆగమన్ కార్యక్రమాలకు పోటెత్తుతున్నారు. రాంనగర్లో శనివారం ఇద్దరు ఎమ్మెల్యేల సమక్షంలో జరిగిన ఓ ఆగమన్ వేడుకకు దాదాపు 10వేల మంది తరలివచ్చారు. ఆ ప్రాంగణమంతా రాజకీయ నాయకుల భారీ ఫ్లెక్సీలతో నిండిపోవడం ఈ ట్రెండ్‌కు నిదర్శనం. కొత్త ప్రాంతాల్లో మండపాల ఏర్పాటుకు నేతలు స్వయంగా భారీగా నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. యువతను, స్థానిక సంక్షేమ సంఘాలను ఆకట్టుకోవడానికి పార్టీలకు ఇంతకంటే సులువైన మార్గం మరొకటి కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి
నగరంలో గతేడాది దాదాపు 29వేల గణేశ్ మండపాలకు పోలీసులు అనుమతినిచ్చారు. ఈసారి రాబోయే ఎన్నికల నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ యంత్రాంగం అంచనా వేస్తోంది. అయితే ఈ ఆరోపణలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తోసిపుచ్చింది. మండపాల పెరుగుదలకు ఎన్నికలతో సంబంధం లేదని, పెరిగిన జనాభా, కొత్త కాలనీలు, అసోసియేషన్లు, యువత ఉత్సాహమే కారణమని పేర్కొంది. గతంలో కొద్దిమంది మాత్రమే నిర్వహించిన ఆగమన్ వేడుకలు, ఈసారి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయని వివరించింది.
మరోవైపు, పండుగ ముసుగులో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా హైదరాబాద్ పోలీస్ విభాగం తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసి, ప్రతి మండపానికి ప్రత్యేకంగా ఒక ‘యూనిక్ ఐడీ’ కేటాయిస్తోంది. బీట్ కానిస్టేబుళ్లు నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గణేశ్ చతుర్థి ముగిసిన మరుసటి రోజున తుది మండపాల సంఖ్య స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.
మొత్తానికి, సాధారణంగా ఎన్నికల ముందు నాయకులు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు, పాదయాత్రల స్థానాన్ని ఈసారి లడ్డూ వేలంపాటలు, మండపాల పోటాపోటీ ఏర్పాట్లు భర్తీ చేస్తున్నాయి. భక్తితో మొదలయ్యే ఈ నవరాత్రులు, అంతిమంగా రాబోయే స్థానిక సంస్థల పోరులో ఎవరికి రాజకీయ లబ్ధి చేకూరుస్తాయో వేచి చూడాలి.








