ఓటు వేయని వారిని కూడా మార్చుకుందాం: సీఎం చంద్రబాబు
మంగళగిరి వేదికగా జరుగుతున్న “టీడీపీ లీడర్షిప్ కాన్క్లేవ్” రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ‘సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన ముఖ్య చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొని ప్రసంగించారు. పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తూ.. కేవలం ఎన్నికల సమయాల్లోనే కాకుండా నిరంతరం ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ, గతంలో ఓటు వేసే అలవాటు లేని వారిని లేదా రాజకీయాలకు దూరంగా ఉండే వారిని కూడా చైతన్య పరిచి ఓటు వేసేలా మన వైపు తిప్పుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. విపక్షాల నుండి వచ్చే విమర్శలను చూసి వెనకడుగు వేయకుండా, వాటిని సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సాంకేతికత మరియు పారిశ్రామిక పురోగతిపై తన విజన్‌ను పంచుకుంటూ.. రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న అత్యాధునిక డేటా సెంటర్ల ద్వారా భవిష్యత్తులో లక్షలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
నాయకత్వంలోనూ, ప్రజల్లోనూ ఆలోచనా విధానం మారితే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రాంతాన్నీ సమానంగా అభివృద్ధి చేసుకోవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సుస్థిరమైన ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి అందరూ కలిసికట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రసంగం కాన్క్లేవ్కు హాజరైన ప్రతినిధులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.








