ఏఈ నూకరాజు కుటుంబం కేసులో కీలక పరిణామం..!
కాకినాడ(Kakinada) జిల్లాలో పెను సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) టిల్లపూడి నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య, అలాగే ఆయన అల్లుడు జగదీష్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని విచారించేందుకు కస్టడీ కోరగా.. దానికి స్పందించిన ప్రత్యేక మొబైల్ కోర్టు, సాదిక్ ఖాన్‌ను 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ జంట కేసులకు సంబంధించిన మరిన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తదుపరి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు సాదిక్ ఖాన్‌ను భారీ బందోబస్తు మధ్య కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏఈ నూకరాజు కుటుంబం రాసిన ఆత్మహత్య లేఖ ఆధారంగా ఇప్పటికే సాదిక్ ఖాన్‌పై తీవ్రమైన వేధింపులు, బెదిరింపులు మరియు బలవంతపు మతమార్పిడి వంటి పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసుల ప్రత్యేక విచారణ బృందం (SIT) సర్పవరం స్టేషన్లోనే నిందితుడిని సుదీర్ఘంగా ప్రశ్నించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
ఇవి కూడా చదవండి
అసలు ఈ కేసు తీవ్రతను గమనిస్తే.. కేవలం వేధింపుల వల్లే కాకుండా, నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మరణం వెనుక కూడా సాదిక్ ఖాన్ హస్తం ఉందంటూ జగదీష్ తండ్రి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు పూర్తిగా మలుపు తిరిగింది. సాదిక్ ఖానే ప్లాన్ ప్రకారం జగదీష్ రెడ్డికి విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడనే సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణలో ఆ హత్య ఎలా జరిగింది, నూకరాజు కుటుంబాన్ని ఎంతవరకు వేధించారు, ఈ కుట్రలో సాదిక్ ఖాన్‌తో పాటు ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో సర్పవరం పోలీసులు పక్కా ఆధారాలు సేకరించనున్నారు.








