‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ఒక అందమైన ప్రయాణం లాంటిది: ఆనంద్ దేవరకొండ
బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువతలో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం, సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
త్రివిక్రమ్ గారు చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తూ, ఈ సినిమా బలంగా ఉంటుందని మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు.
– త్రివిక్రమ్ గారు ఒక వేడుకలో చెప్పారు. మామూలు కథ చెప్పాలి.. కానీ, బలంగా చెప్పాలి. ట్విస్ట్ లు, రక్తపాతాలు లేకుండా ఒక మంచి కథ చెప్పాలి. అలా తీసిన ప్రేమ కథే ఎపిక్ సినిమా. వనపర్తికి చెందిన ఒక సాధారణ కుర్రాడు, తన ప్యాషన్ ను పక్కన పెట్టి, తల్లిదండ్రుల కోసం విదేశాలకు వెళ్తాడు. అక్కడ నుంచి అతను జీవితాన్ని చూసే కోణం ఎలా మారుతుంది? అక్కడ ఒకమ్మాయిని ప్రేమించి, లివిన్ రిలేషన్ లో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది సహజంగా చూపించాము. లివిన్ రిలేషన్ కాన్సెప్ట్ అయినప్పటికీ, కుటుంబ ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా దర్శకుడు ఆదిత్య ఎంతో అందంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు.
ఎపిక్ సినిమా ఎలా ఉండబోతుంది?
– ఎపిక్ సినిమాపై టీమ్ అంతా మొదటి నుంచి ఎంతో నమ్మకంగా ఉన్నాం. 80s, 90s, 2000s ఇలా అన్ని జనరేషన్ల వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారికి మాత్రమే కాకుండా, కుటుంబానికి దూరంగా ఉండే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఒక మధ్య తరగతి యువకుడి జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగం గురించి, ప్రేమ గురించి, కుటుంబ బాధ్యతల గురించి ఇలా ఎన్నో అంశాలను సహజంగా, అందంగా చూపించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి కథ.
– నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటలను మనం ఎదురుగా అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో ఎపిక్ సినిమా అలా ఉంటుంది. ప్రేమ, కుటుంబం, బాధ్యతలు ఇలా ఇందులో చూపించిన ప్రతి అంశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. ఒక అందమైన జర్నీలా ఉంటుంది.
ఆదిత్య పాత్రలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా?
– నూటికి నూరు శాతం చూసుకున్నాను. ఎపిక్ కథ వింటున్నప్పుడే ఇదేంటి నా కథ లాగే ఉంది అనుకున్నాను. నేను అమెరికాలో చదువుకున్నాను. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ అనే తేడా లేకుండా విదేశాల్లో చదువుకుంటున్న తెలుగువారంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. లైఫ్ లో సెటిల్ అవ్వాలని, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని కుటుంబాలకు దూరంగా విదేశాలకు వెళ్లేవారు చాలామంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.
ఆదిత్య పాత్ర ఎలా ఉండబోతుంది?
– నేను పోషించిన ఆదిత్య పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. ప్రతి విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాడు. లైఫ్ లో తనకి నచ్చింది చేయాలా? లేక పేరెంట్స్ కి నచ్చినట్టు బ్రతకాలా? అమ్మాయితో అసలు ప్రేమనా కాదా? తనను పెళ్లి చేసుకోవాలా లేదా? తనతో జీవితాంతం ఉండగలనా? ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తుంటాడు. ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ హత్తుకునేలా ఉంటాయి.
బేబీ ప్రభావం ఈ సినిమాపై ఎంతవరకు ఉంటుంది?
– బేబీ అంత పెద్ద విజయం సాధించింది కాబట్టి, నేను-వైష్ణవి కలిసి నటిస్తున్నప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడటం సహజమే. అయితే బేబీకి, ఎపిక్ సినిమాకి పోలిక లేదు. రెండూ దేనికవే ప్రత్యేకమైనవి. బేబీ ఒక సంచలనమైతే, ఇది ఒక అందమైన ప్రయాణం లాంటిది. నేను-వైష్ణవి కలిసి నటించినప్పటికీ బేబీ గురించి ఎంత మాట్లాడుతున్నారో.. 90s వెబ్ సిరీస్ గురించి, ఆదిత్య హాసన్ గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. అది సినిమాకి ప్లస్ అవుతుంది.
90s సిరీస్ కి కొనసాగింపుగా ఎపిక్ సినిమా ఉంటుందా?
– 90s సిరీస్ కి సీక్వెల్ కాదు. కానీ, ఆ ప్రపంచంలో నుంచి, ఆ పాత్రల నుంచి పుట్టిన కథే ఇది. చిన్న కొడుకు ఆదిత్య విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే కథగా ఇది ఉంటుంది. కథకు ఎంతవరకు అవసరమో, అంతవరకు తల్లిదండ్రుల పాత్రలను చూపించడం జరిగింది.
– 90s సిరీస్ అనేది ఒక ఫ్యామిలీ స్టోరీ అయితే, ఎపిక్ అనేది ఒక లవ్ స్టోరీ. అయితే లవ్ స్టోరీ అయినప్పటికీ 90sలో ఉన్నట్టుగానే సహజమైన హాస్యం, హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి.
వైష్ణవి చైతన్య పోషించిన కడలి పాత్ర ఎలా ఉండబోతుంది?
– కడలి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. ఒక అమ్మాయి పైకి నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన, తను సంతోషంగా ఉందని కాదు. ఆమె వెనుక ఎన్నో భయాలు, బాధ్యతలు ఉంటాయి. అలాంటి పాత్ర కడలి.
మీ వదిన రష్మిక గారితో సినిమాల గురించి చర్చిస్తూ ఉంటారా?
– సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోము. కానీ, ఎపిక్ ఎప్పుడు విడుదల చేయాలని రిలీజ్ డేట్ కోసం కొంచెం టెన్షన్ పడుతున్న సమయంలో.. వదిన నాకు మెంటల్ గా సపోర్ట్ గా నిలబడ్డారు.
తదుపరి చిత్రాలు?
– ‘తక్షకుడు’ సినిమా షూటింగ్ పూర్తయింది. అలాగే ఒక ఇండో-కొరియన్ మూవీ కూడా పూర్తి చేశాను.








