నోటి దురుసే బీఆర్ఎస్కు శాపంగా మారుతోందా?
తెలంగాణ రాజకీయాల్లో తిట్లు, వ్యంగ్యాస్త్రాలు కొత్త కాదు. కానీ, ఒకప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అదే భాష.. ఇప్పుడు బీఆర్ఎస్ మెడకే చుట్టుకుంటోందా? తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ వాడిన నాటు భాష, యాస ప్రజలను కదిలించి ఒక ఎమోషన్‌ను సృష్టించాయి. అధికారంలో ఉన్నన్నాళ్లూ మా భాషే ఇంత.. ఇది తెలంగాణ మట్టి వాసన అంటూ సమర్థించుకున్నారు. కానీ కాలం మారింది, పాత్రలు మారాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గులాబీ నేతలు వాడుతున్న ఆవేశపూరిత భాష, నియంత్రణ లేని మాటలు ఆ పార్టీకి శాపాలుగా మారుతున్నట్టు కనిపిస్తోంది.
ఉద్యమంలో ఆవేశానికి ఆదరణ దక్కింది. కానీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఆశిస్తారు. ఈ సున్నితమైన తేడాను బీఆర్ఎస్ విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను ఎండగట్టడానికి బీఆర్ఎస్ ఒక పక్కా చార్జ్‌షీట్‌తో సిద్ధమైంది. నల్ల చొక్కాలు ధరించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది కాస్తా నోటి దురుసు వల్ల దారితప్పింది.
అసెంబ్లీ గేట్ వద్ద నిరసన సందర్భంగా ఉద్రిక్తత, పోలీసుల తోపులాటల వరకు ప్రజల్లో సానుభూతి బీఆర్ఎస్ వైపే ఉంది. కానీ.. ఆ ఆవేశంలో ఎమ్మెల్సీ తాతా మధు, సభా స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం సీన్ ను మార్చేశాయి. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ దీనిని ఏకంగా దళిత ఆత్మగౌరవ సమస్యగా మార్చేసింది. సభలో స్పీకర్ భావోద్వేగానికి గురికావడం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై జరగాల్సిన చర్చ కాస్తా.. బీఆర్ఎస్ నేతల భాష, సభా మర్యాదల ఉల్లంఘన చుట్టూ తిరిగేలా అధికార పార్టీ పావులు కదిపింది.
ఇవి కూడా చదవండి
ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సంయమనం కోల్పోయారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా మీడియా, పోలీసుల సమక్షంలోనే ఆయన ఉపయోగించిన తీవ్రమైన పదజాలం విమర్శలకు తావిచ్చింది. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినప్పుడు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలబడాల్సింది పోయి.. అదే ఆవేశంతో ఎదురుదాడికి దిగడంతో కాంగ్రెస్ ట్రాప్ లో బీఆర్ఎస్ పడినట్లు కనిపిస్తోంది.
షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభా ప్రాంగణం బయట కేసీఆర్ చావు కోరుకుంటున్నామని, ఎర్రవల్లి నివాసానికి చావు డప్పు కొడతామని అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతిగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. అప్పటికే బీఆర్ఎస్ నేతల తిట్లు, వివాదాస్పద వ్యాఖ్యలే మీడియాలో, సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారడమే ఇందుకు కారణం. ప్రత్యర్థి చేసిన పెద్ద తప్పు కూడా, బీఆర్ఎస్ వాడిన భాష ముందు కొట్టుకుపోయింది.
ప్రభుత్వ వైఫల్యాలు, రైతు సమస్యలు, గ్యారెంటీలను గట్టిగా నిలదీసి ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన సమయంలో.. తమ నేతల అరెస్టులు, బెయిళ్లు, కేసులపై వివరణలు ఇచ్చుకోవడానికే బీఆర్ఎస్ కు సమయం సరిపోతోంది. ఎదురుదాడి చేసే క్రమంలో సంస్కారం, హుందాతనం కోల్పోతే ప్రజల్లో సానుభూతి కాస్తా అసహ్యంగా మారుతుందన్న ప్రాథమిక సూత్రాన్ని ఆ పార్టీ విస్మరిస్తోంది.








