ఏపీ టూరిజం నెక్ట్స్ లెవెల్, ‘సీప్లేన్’ సేవలకు క్లియరెన్స్..!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. రాష్ట్రంలో వినూత్నంగా ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రతిష్టాత్మక ‘సీ ప్లేన్’ (Seaplane) ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ఏపీ జలాలపై ఈ విమానాలను నడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ‘మే హెయిర్’, ‘స్కైహోప్’ వంటి ప్రముఖ దేశీయ విమానయాన సంస్థలు సమర్పించిన నివేదికలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. పర్యాటక ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, టూరిస్టులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.
ఈ ప్రాజెక్టు సజావుగా సాగడానికి కీలకమైన ‘వాటర్ డ్రోమ్’ అంటే నీటిపై రన్వేలు, మౌలిక వసతుల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటి నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ పనుల కోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక అంచనా ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది కీలక పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలను గుర్తిస్తూ, సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ వాటర్ డ్రోమ్ నెట్‌వర్క్‌ను డెవలప్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ ఉద్దీపన పథకం మద్దతు కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగా కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. తొలి విడతలో భాగంగా.. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ (పున్నమి ఘాట్), విశాఖ సాగరం, మరియు శ్రీశైలం కృష్ణా నది పరివాహక ప్రాంతాల మధ్య ఈ సీ ప్లేన్లు రాకపోకలు సాగించనున్నాయి. వీటితో పాటు కాకినాడ, సూర్యలంక బీచ్, గండికోట గిరి లోయలు, తిరుపతి రాయలచెరువు, అరకు సమీపంలోని జోలాపుట్ మరియు లంబసింగి తాజంగి జలాశయాలను కూడా ఈ రూట్ మ్యాప్‌లో చేర్చారు. ఈ వినూత్న సేవలు అందుబాటులోకి వస్తే.. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విహారయాత్ర స్థలాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా, ఏపీ టూరిజం గ్లోబల్ మ్యాప్‌లో మరింత ప్రత్యేకంగా నిలవనుంది.








