లైంగిక నేరస్దులపై ఇక ‘కెమికల్ కాస్ట్రేషన్’ ప్రయోగం?!
ఒక మనిషి లైంగిక నేరం చేశాడు.
అతడికి శిక్ష పడింది. ఏళ్ల తరబడి జైలులో ఉన్నాడు.
కొంతకాలానికి శిక్ష పూర్తయింది. ఇప్పుడు అతడు బయటకు జన జీవన స్రవంతిలోకి రావచ్చు.ఏ దేశ చట్టం అయినా చెప్పేది అదే. అయితే సమాజం మాత్రం ఓ ప్రశ్న అడుగుతుంది. అతడు నిజంగానే మారిపోయాడా? లేకపోతే… అవకాశం దొరికితే మళ్లీ అదే నేరం చేస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియనప్పుడు ఒక ప్రభుత్వం ఏం చేయాలి? మరో నేరం జరిగే వరకు వేచి చూడాలా? లేక అది జరగకముందే అతడిని ఆపాలా?
ఆపాలంటే మార్గం ఏమిటి? కంటిన్యూగా నిఘా ఉంచాలా? భయపెట్టాలా, లేక…అతడి శరీరంలోని కోరికలను కంట్రోలు చేయాలా? ఇప్పుడు సింగపూర్లో జరుగుతున్న చర్చ ఇదే.
లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తులు మళ్లీ అదే నేరానికి పాల్పడకుండా అడ్డుకునేందుకు ‘కెమికల్ కాస్ట్రేషన్’ అనే వివాదాస్పద విధానాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.
కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది. ఈ విధానం నిజంగా నేరాలను తగ్గిస్తుందని ఇప్పటివరకు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అదే సమయంలో నేరం చేసిన వ్యక్తిని శిక్షించే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ అతడు మళ్లీ నేరం చేయకుండా ఉండేందుకు అతడి కోరికలను నియంత్రించే హక్కు కూడా ఉందా?
ఇది శిక్ష కాదు… కానీ శిక్ష కంటే తక్కువా?
‘కెమికల్ కాస్ట్రేషన్’ అనే పదం వినగానే చాలామందికి ఒక భయంకరమైన విజువల్ ఒకటి మెదుడులోకి వస్తుంది. శరీరంపై శాశ్వతమైన మార్పు. శస్త్రచికిత్స. జీవితం మొత్తం మారిపోయే శిక్ష. అయితే ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతున్నది దాని గురించి కాదు.
ఇక్కడ చర్చలో ఉన్నది మందుల గురించి. కొన్ని రకాల మందుల ద్వారా శరీరంలోని లైంగిక హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించడం. ముఖ్యంగా లైంగిక వాంఛలను నియంత్రించే ప్రయత్నం చేయడం. దీన్ని వైద్యపరంగా ఫార్మకలాజికల్ యాంటీ-ఆండ్రోజెన్ చికిత్సగా పేర్కొంటారు. సాధారణంగా ప్రజలు దీనినే కెమికల్ కాస్ట్రేషన్ అంటారు.
జైలు ఉంది… కొరడా శిక్ష ఉంది… అయినా ఎందుకు కొత్త మార్గం?
సింగపూర్లో లైంగిక నేరాలపై చట్టాలు ఇప్పటికే చాలా కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై జరిగే తీవ్రమైన లైంగిక నేరాలను అక్కడ అత్యంత తీవ్రంగా పరిగణిస్తారు. 14 సంవత్సరాల లోపు మైనర్పై అత్యాచారం లేదా తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడితే కనీసం ఎనిమిది సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. దీనికి తోడు కనీసం 12 కొరడా దెబ్బలు కూడా ఉంటాయి. కాబట్టి శిక్షలు తక్కువగా ఉన్నాయని అనుకోవాల్సిన పనిలేదు.
ఇవి కూడా చదవండి
భయం వల్ల నేరం ఆగుతుందా?
శిక్ష పడుతుందని తెలిసినా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే… శిక్షను మరింత పెంచడం మాత్రమే పరిష్కారమా? లేక నేరం చేయాలనే ప్రవర్తన వెనుక ఉన్న కారణాలపైనే దృష్టి పెట్టాలా? సింగపూర్ ఇప్పుడు రెండో విషయం గురించి ఆలోచిస్తోంది.
అసలు భయం జైలు ముందు కాదు… జైలు తర్వాత
ఒక నేరస్తుడికి పదేళ్ల శిక్ష పడింది అనుకుందాం. అతడు పదేళ్లు జైలులో ఉన్నాడు. చట్టం చెప్పిన శిక్షను పూర్తిగా అనుభవించాడు. ఆ తర్వాత? అతడు బయటకు వస్తాడు. అయితే బాధితుడి కుటుంబం అడిగే ప్రశ్న మాత్రం చాలా సింపుల్. “మళ్లీ క్రైమ్ చేస్తే?”. ఈ ఒక్క ప్రశ్నే ప్రభుత్వాలను కొత్త చట్టాలు తీసుకురావడానికి, కొత్త విధానాలను పరిశీలించడానికి కారణమవుతోంది.
సింగపూర్ ఇటీవలే తీవ్రమైన హింసాత్మక, లైంగిక నేరస్తుల కోసం మరింత కఠినమైన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని పేరు… Sentence for Enhanced Public Protection — SEPP. పేరు కొంచెం పొడవుగా ఉండొచ్చు. అయితే దాని వెనుక ఉన్న ఆలోచన చాలా సూటిగా ఉంది. శిక్ష పూర్తయిందని చెప్పి, సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తిని ఆటోమేటిక్గా విడుదల చేయకూడదు.
తీవ్రమైన నేరానికి పాల్పడి, మళ్లీ నేరం చేసే ప్రమాదం ఉందని భావించిన వ్యక్తిని కనీసం ఐదు నుంచి 20 సంవత్సరాల వరకు నిర్బంధంలో ఉంచవచ్చు. ఆ తర్వాత కూడా అతడు సమాజానికి ప్రమాదం కాదని నిర్ధారించిన తర్వాతే విడుదల చేసే అవకాశం ఉంటుంది.
అంటే సింగపూర్ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసింది. నేరం చేసినందుకు శిక్షించడం ఒకటి. మళ్లీ నేరం జరగకుండా చూడటం ఇంకోటి.
అయితే కెమికల్ కాస్ట్రేషన్ ఎందుకు?
మామూలుగా జైలు ఒక వ్యక్తిని సమాజం నుంచి దూరం చేస్తుంది. నిఘా అతడి కదలికలపై కన్ను వేస్తుంది. కానీ కెమికల్ కాస్ట్రేషన్? అది నేరం జరగడానికి కారణమవుతుందని భావిస్తున్న శరీరంలోని ఒక అంశంపైనే ప్రభావం చూపించే ప్రయత్నం.
అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది.
లైంగిక నేరం కేవలం లైంగిక వాంఛ వల్లే జరుగుతుందా? అధికారం?, హింస?, మానసిక సమస్యలు?, ఇతర ప్రవర్తనా కారణాలు? ఇవన్నీ పక్కన పెట్టి కేవలం హార్మోన్లను నియంత్రించడం ద్వారా నేరాన్ని ఆపగలమా? సింగపూర్ ప్రభుత్వానికి కూడా ఇదే సందేహం ఉంది.
అందుకే ఇప్పుడే ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. ముందు ఒకటే విషయం తేలాలి. ఇది నిజంగా పనిచేస్తుందా? ‘పనిచేస్తుంది’ అని నిరూపిస్తేనే ముందుకు
సింగపూర్ సీనియర్ మంత్రి కే. షణ్ముగం చెప్పిన మాటల్లో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనిపించింది. కెమికల్ కాస్ట్రేషన్ వంటి చికిత్సలు నేరాల సంఖ్యను, ముఖ్యంగా నేరాల పునరావృతాన్ని తగ్గించడంలో నిజంగా ప్రభావవంతంగా పనిచేస్తాయని స్పష్టమైన ఆధారాలు ఉంటే వాటిని పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాలు మాత్రం తుది నిర్ణయం తీసుకునేంత స్పష్టంగా లేవు.
అలాగే లైంగిక నేరస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలా? అనేది మరో చర్చ. ప్రజలకు తెలియాలి. పిల్లలను కాపాడుకోవాలి. అనే వాదన ఒకవైపు ఉంది. కానీ సింగపూర్లో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యేక Sex Offender Register లేదు.
అయితే లైంగిక నేరాలతో సహా తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల వివరాలను పోలీసులు తమ వద్ద ఉంచుతారు. పిల్లలు, యువతతో నిరంతరం పనిచేసే ఉద్యోగాలకు ఎవరైనా దరఖాస్తు చేస్తే, వారి నేపథ్యాన్ని పరిశీలించే సమయంలో ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అంటే…ప్రజలందరికీ పేరు చెప్పరు.కానీ పిల్లల దగ్గరకు వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది పరిశీలిస్తారు.
ఏదైమైనా
సింగపూర్ ముందుకు వచ్చిన ప్రశ్న మాత్రం అప్పుడే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఒక నేరానికి శిక్ష ఎప్పుడు పూర్తవుతుంది?
జైలు శిక్ష పూర్తయినప్పుడు?
లేక…
మరో నేరం జరగదని సమాజం నమ్మగలిగినప్పుడు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల








