స్థానిక సమరానికి జనసేన సైన్యం రెడీ..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) కూటమి విజయకేతనం ఎగరేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ (Janasena Party) తన పొలిటికల్ గేర్‌ను మార్చింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ఎన్నికల వ్యూహాలపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్ హాలులో జనసేన పార్టీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాబోయే పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలతో క్షేత్రస్థాయిలో ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
ఈ అత్యంత కీలకమైన సమావేశానికి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సిద్ధాంతాలను, కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎక్కడా సమన్వయ లోపం లేకుండా అడుగులు వేయాలని నాదెండ్ల మనోహర్ క్యాడర్‌కు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ అవగాహన సదస్సులో జనసేన పార్టీకి చెందిన అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల కన్వీనర్లు, రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు, మరియు కీలక నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న గ్రౌండ్ రిపోర్టులను, స్థానిక సమీకరణాలను ఈ సందర్భంగా నేతలు పీఏసీ చైర్మన్‌కు వివరించారు. ఈ సమావేశంతో జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొనగా, స్థానిక సంస్థల సమరానికి జనసైన్యం పూర్తిస్థాయిలో సమరశంఖం పూరించినట్లయింది.








