వినాయక చవితి వేళ ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్..!
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి(Vinayaka Chathurdhi) పండుగ వేడుకలను మరింత వైభవంగా, ఉత్సాహంగా జరుపుకునేలా కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వీధివీధినా వెలిసే గణేష్ పండళ్లకు (ఉత్సవ కమిటీలకు) ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఐటీ, పర్యాటక శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అధికారికంగా ప్రకటించారు. పండుగ రోజుల్లో విద్యుత్ ఛార్జీల భారం లేకుండా భక్తులు, నిర్వాహకులు అందరూ ఎంతో సంతోషంగా పండుగను జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ భారీ పండుగ కానుకను ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. “రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించే అన్ని గణేష్ పండళ్లకు మా ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్ అందించబోతున్నామని ప్రకటించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పండుగ రోజుల్లో స్థానిక కమ్యూనిటీలకు పూర్తి మద్దతుగా నిలిచేందుకు మరియు వేడుకలను మరింత ఉల్లాసంగా, వైభవంగా మార్చేందుకు మా ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రధాన పండుగ చొరవ ఇది” అని లోకేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో వెలిసే ఉత్సవ కమిటీలకు భారీ ఉపశమనం లభించనుంది. సాధారణంగా పండుగ రోజుల్లో లైటింగ్, డీజేలు, మైక్ సెట్ల కోసం భారీగా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుండటంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండుగ కానుకను ప్రకటిస్తూ.. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు, విజయం కలగాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.








