ఎలర్ట్ : వేల కోట్లు ఖర్చు పెట్టి మరీ మన ఆలోచనలపై దాడి!
ప్రపంచంలోని అత్యంత తెలివైన మనుషులు అంటే బాగా డబ్బుకన్న మనుష్యులు అంతా ఒక గదిలో కూర్చున్నారు.
ఆ గది పెద్దది. టేబుల్ ఇంకా పెద్దది. టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ల సంపదను కలిపితే కొన్ని చిన్న దేశాల బడ్జెట్లు కూడా చిన్నవిగా కనిపిస్తాయి.
కానీ ఆ రోజు ఆ గదిలో ఎవరూ సంతోషంగా లేరు. ఒకరు తల పట్టుకున్నారు. మరొకరు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. ఇంకొకరు టేబుల్‌పై వేళ్లతో టక్… టక్… టక్… అని కొడుతున్నారు.
అందరి మనుస్సులో ఒకే ప్రశ్న తిరుగుతోంది. “ఇప్పుడు ఏం చేయాలి?”.. ఎందుకంటే అది సాధారణ సమస్య కాదు. వాళ్ల ముందు ప్రపంచంలోని అత్యంత పెద్ద సమస్య ఉంది. అదేమీ డబ్బు లేదు అన్న సమస్య కాదు. డబ్బు చాలా ఉంది. టెక్నాలజీ లేదు అన్న సమస్య కాదు. అది కూడా చాలా ఉంది.
కంప్యూటర్లు లేవా? ఉన్నాయి. ఇంజినీర్లు లేరా? ఉన్నారు. వీటిలో ఏది లేకపోయినా క్షణాల్లో సమకూర్చుకోగలుగుతారు. అయితే వాళ్లను నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది ఒకటే ..జనాభిప్రాయం. హఠాత్తుగా జనాలకు చాలా దూరంగా ఉండే వీళ్లకు జనాలతో పనేమొచ్చింది అంటారా… వాళ్లు ఈ మధ్యన ఓ అభిప్రాయం ఏర్పరుచుకున్నారు. అది వాళ్ల వ్యాపారానికి అడ్డుపడుతోంది. అదేమిటంటే…తమ ఊళ్లో, తమ ఇళ్ల మధ్య డేటా సెంటర్లు కట్టవద్దని వారు గోల చేస్తున్నారు.
AI ని వాళ్లు వాడతారు కానీ డేటా సెంటర్లు పెట్టవద్దంటారు..ఇదేం పద్దతి ఒకాయన నిరశనగా అన్నాడు. వీళ్లకు AI అందకుండా చేస్తే తిక్క కుదురుతుంది అన్నాడు. అదీ పనిచేయదు..మన వ్యాపారమే అందులో ఉంది అన్నాడు మరొకాయన. పోనీ సలహా AI నే అడిగితే పోలా అన్నాడు. అదీ చేతులెత్తేసింది అన్నాడు మరొక మిలియనీర్.
జనాలు అన్నాక ప్రతీ దానికి గోల చేస్తారు. దానికి తగ్గ కాంపన్షేషన్ ఇస్తే సర్దుమణుగుతారు అని అంతకు ముందు మీటింగ్ అనుకున్నారు. కానీ ఆ ట్రిక్ కూడా ఈ సారి పనిచేయటం లేదని అర్దమయ్యే ఈ కొత్త మీటింగ్. పోనీ జనం తో మీటింగ్ పెట్టి ఒప్పిస్తే అన్నాడు మరొకాయన. జనం నోట్లో నోరు పెట్టడం అంతటి బుద్ధి తక్కువ పని లేదు అని తేల్చాసారు.
ఎందుకు అంటే.. వాళ్లను కదిపితే రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. డేటా సెంటర్లు ఎంత కరెంట్ తీసుకుంటాయి? ఎంత నీరు వాడతాయి? మా ఊరికి నిజంగా ఏం కలిసి వస్తుంది?అయినా ఈ భారీ భవనం మా ఇంటి పక్కనే ఎందుకు? చాలా ప్రశ్నలు.వీటికి సమాధానం చెప్పటం AI వల్ల కూడా కాదు.
ఒక ప్రశ్నకు సమాధానం చెబితే ఇంకో ప్రశ్న వస్తుంది. ఇలా ప్రజలను వదిలేస్తే వాళ్లు ఆలోచిస్తూనే ఉంటారు.
అప్పుడు గదిలోని అత్యంత తెలివైన వ్యక్తుల్లో ఒకరికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.
అతను నెమ్మదిగా లేచాడు. “ఒక్క నిమిషం.” అందరూ అతని వైపు చూశారు.
“మనం ఏఐని ఎలా ట్రైన్ చేశాం?”
ఎవరో సమాధానం చెప్పారు. “ అవును దానికి డేటా ఇచ్చాం.”, మళ్లీ అవసరమైతే “చాలా డేటా ఇచ్చాం.”, “మళ్లీ మళ్లీ ఇచ్చాం.” అతను తల ఊపాడు.
“సరిగ్గా అదే.”
మిగతావాళ్లు అర్థం కాక అతని వైపు చూశారు.
“ఏఐకి ట్రైనింగ్ ఇచ్చినట్లే… మనుషులకు కూడా ఇస్తే?” ఒకరు వెంటనే అభ్యంతరం చెప్పారు.
“కానీ మనుషులు ఏఐలు కాదు కదా!”
ఆ బిలియనీర్ కాసేపు ఆలోచించాడు. తర్వాత చిరునవ్వు నవ్వాడు. “అందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది?”…“ఏఐకి, మనిషికి పెద్ద తేడా ఏముంది?”
ఇంకొకరు ఏదో చెప్పబోయారు. అతను చేయి ఎత్తి ఆపేశాడు. నిజానికి ఏఐ కంటే మనుషులని ఒప్పించటమే సులభం. గదిలో అందరూ ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు.
“ఏఐని ఒక విషయం నమ్మించడానికి ఎంత డేటా ఇవ్వాలో తెలుసా? ఎంత కంప్యూటింగ్ పవర్ కావాలో తెలుసా?” అతను కాసేపు ఆగాడు.
ఇవి కూడా చదవండి
“అదే మనిషికి?”
“రోజుకు మూడు ప్రకటనలు.”
గదిలో మొదటిసారి నవ్వులు వినిపించాయి. అవును ..“మనుషులను ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు.”
అతను తన కాఫీ కప్పు కింద పెట్టాడు.
“మనుషులు తమకు నచ్చినట్టు ఆలోచించనివ్వండి.” అందరూ ఆసక్తిగా చూసారు ఏం చెప్తాడా అని.. “వాళ్ల ఆలోచనలను ట్రైన్ చేద్దాం. మన ప్రకటనలతో ట్యూన్ చేద్దాం”
అక్కడే సమావేశం పూర్తయింది.
అందరూ లేచారు. చేతులు కలిపారు. కొంతమంది ఆనందంగా నవ్వారు. ప్రపంచంలోని అత్యంత పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది.
ప్రజలు డేటా సెంటర్లను ఇష్టపడటం లేదు. అయితే డేటా సెంటర్లను మార్చాల్సిన అవసరం లేదు. ప్రజలను మార్చాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లు ఆలోచించే విధానాన్ని మార్చితే సరిపోతుంది.
ఏఐకి డేటా ఇస్తారు.
ప్రజలకు ప్రకటనలు ఇస్తారు.
ఏఐ నేర్చుకుంటుంది.
ప్రజలు నమ్ముతారు. పెద్ద తేడా ఏముంది?
అలా అమెరికాలో ఒక కొత్త రకం ట్రైనింగ్ కార్యక్రమం మొదలైంది.
ఇదంతా నిజమేనా?
నిజమే..అమెరికాలో Build American AI అనే సంస్థ ఇప్పుడు భారీ ప్రకటనల ప్రచారానికి సిద్ధమవుతోంది. కాన్సాస్. ఒహాయో. విస్కాన్సిన్. డేటా సెంటర్లపై ప్రజల అసంతృప్తి రాజకీయ సమస్యగా మారుతున్న రాష్ట్రాలు. అక్కడ ఇప్పుడు ప్రకటనలు కనిపించబోతున్నాయి. చాలా ప్రకటనలు. ఈ ప్రచారం వెనుక టెక్ ప్రపంచంలోని భారీ పేర్లు ఉన్నాయి. Marc Andreessen. Ben Horowitz. OpenAI అధ్యక్షుడు Greg Brockmanతో అనుబంధం ఉన్న రాజకీయ నిధుల నెట్వర్క్.
ప్రకటనల కోసం ఖర్చు?
మిలియన్ల డాలర్లు.
ఎందుకు?
ప్రజలకు ఒక విషయం అర్థం చేయడానికి. డేటా సెంటర్లు మంచివని చెప్పటానికి.
ప్రకటనలో ఇలా ఉండచ్చు.
“మీ ఊరి పక్కన త్వరలో ప్రపంచ స్థాయి ఏఐ డేటా సెంటర్ వస్తోంది!”
తెరపై పచ్చటి పొలాలు.
దూరంలో పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఒక రైతు చిరునవ్వుతో కెమెరా వైపు చూస్తున్నాడు. అతని వెనుక మూడు అంతస్తుల ఎత్తున కిటికీలు లేని ఒక మహా భవనం.
బ్యాక్‌గ్రౌండ్‌లో మృదువైన సంగీతం.
“ఇది కేవలం డేటా సెంటర్ కాదు. మీ పిల్లల భవిష్యత్తు.”
తర్వాత ఒక యువతి కనిపిస్తుంది.
“ఉద్యోగాలు వస్తాయి.”
మరో వ్యక్తి.
“అభివృద్ధి వస్తుంది.”
మరో వృద్ధుడు.
“అమెరికా ప్రపంచంలో ముందుంటుంది.”
ఈ యాడ్ చూసాక…
ఇప్పుడు మీరు నీటి గురించి అడగండి. మీ పిల్లల భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఉన్నట్టవుతుంది.
విద్యుత్ గురించి అడగండి. దేశ పురోగతిని అడ్డుకుంటున్నట్టవుతుంది.
“మా ఊర్లో వద్దు” అనండి. మీరు అభివృద్ధికి వ్యతిరేకి అయిపోతారు.
ఇదే ప్రకటనల అందం.
ఇప్పుడు జరగబోతోంది అదే..త్వరలో మీరు డేటా సెంటర్లు అద్బుతమైనంటూ ప్రకటనలు చూడబోతున్నారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








