ప్రస్తుతానికి సస్పెన్షన్.. తర్వాత సభ్యత్వాలు రద్దు!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా మారాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఈ సమావేశాలు మరింత అగ్గి రాజేశాయి. సభ్యులు ఎవరైనా హద్దు మీరితే సహజంగా సస్పెన్షన్లు వేయడం సహజం. అయితే ఈ సమావేశాలు మరింత ముందుకెళ్లి, ఏకంగా సభ్యత్వాలు రద్దు చేసే దిశగా పరిణామాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై తాజా సమావేశాల నుంచి సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సభా మర్యాదలు, నియమావళి ఉల్లంఘనల పేరుతో వీరి శాసనమండలి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలపై అధికార కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఆవరణలో తొలిరోజు చోటుచేసుకున్న పరిణామాలపై ఉదాసీనంగా ఉంటే భవిష్యత్తులో అది చట్టసభల పనితీరుకు విఘాతం కలిగిస్తుందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వంపై విరుచుకుపడే విపక్ష సభ్యుల దూకుడుకు చెక్ పెట్టేందుకు క్రమశిక్షణ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా వీరి వ్యవహారాన్ని మండలి క్రమశిక్షణ కమిటీకి అప్పగించి, పూర్తి విచారణ జరిపించనుంది. ఆ తర్వాత సభా హక్కుల ఉల్లంఘన కింద సభ్యత్వ రద్దుకు సిఫార్సు చేయించే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే అసెంబ్లీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. ఆయనపై కూడా సభ్యత్వ రద్దు దిశగా నిర్ణయం రావచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మండలిలో తాతా మధు, నవీన్ కుమార్ల పేర్లు కూడా తెరపైకి రావడం కలకలం రేపుతోంది. ఒకేసారి ఉభయ సభల్లో కీలక నేతలపై ఈ స్థాయి చర్యలు తీసుకునే ప్రయత్నం తెలంగాణ రాజకీయాల్లో అరుదైన పరిణామంగా మారనుంది.
ఒకవేళ చట్టపరమైన నిబంధనల ఆధారంగా వీరి సభ్యత్వాలు రద్దయితే, అది బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బే అవుతుంది. సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు తగినంత సంఖ్యాబలం కోల్పోతుంది. ఖాళీ అయ్యే స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ను ఢీకొనడం ప్రతిపక్షానికి పెద్ద సవాల్ గా మారుతుంది. అసెంబ్లీలో, మండలిలో దూకుడుగా వ్యవహరించే నేతల సభ్యత్వాలు రద్దయితే, మిగిలిన సభ్యులు కూడా దూకుడు ప్రదర్శించేందుకు సాహసం చేయకపోవచ్చు.
ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే రిస్క్ ఎక్కువగానే కనిపిస్తోంది. సభ్యత్వాల రద్దు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక రాజకీయ కక్షసాధింపుతో చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. చట్టసభల నిబంధనలను పక్కాగా అనుసరిస్తూ, రూల్ బుక్ ప్రకారం చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా, బాధితులు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. న్యాయస్థానాల్లో స్టేలు లేదా ప్రతికూల తీర్పులు వస్తే అది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాకుండా, ప్రజల్లో ప్రతిపక్షంపై సానుభూతి పెరిగే ప్రమాదం కూడా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి.








