మన డేటాతోనే Paytm కొత్త బిజినెస్! అందులో మనకు వాటా ఉందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రపంచం మారిపోయింది. బిజినెస్‌లు కూడా మారిపోయాయి.
మనం ఒక కంపెనీ ఏం చేస్తుందో చూస్తూ… అదే దాని అసలు బిజినెస్ అనుకుంటాం. కానీ మనకు కనిపించేది ఒకటి. వాళ్లు లోపల చేసేది ఇంకొకటి. అయితే వాళ్లు ఏ బిజినెస్ చేసినా మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే మన డేటాతోనే వాళ్లు కొత్త బిజినెస్ మొదలుపెడితే మాత్రం… కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది.
ఎందుకంటే మనం మనకు ఏమేరకు ఉపయోగపడుతున్నామో లేదో తెలియదు కానీ… మన గురించి మనకంటే ఎక్కువ తెలుసుకున్నవాళ్లకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నామేమో! ఇది అలాంటి కథే.
అసలేం జరుగుతోంది?
మనం ఇన్నాళ్లూ పీటీఎం వాడి పేమెంట్ చేశాం. డబ్బులు పంపాం. బిల్లు కట్టాం. మన పని అయిపోయిందనుకున్నాం. కానీ మన పని అక్కడితో అయిపోలేదట. మనం చేసిన ఆ పేమెంట్ల నుంచి వచ్చిన డేటానే ఇప్పుడు పేటీఎంకు కొత్త బిజినెస్‌కు ఇంధనంగా మారుతోంది.
పేటీఎం అసలు బిజినెస్ ఇప్పుడు ఏంటి?
ఇన్నాళ్లూ పేటీఎం అంటే మనకు గుర్తొచ్చేది పేమెంట్స్. మొబైల్ రీచార్జ్ చేయాలి… పేటీఎం. బిల్లు కట్టాలి… పేటీఎం. ఎవరికైనా డబ్బులు పంపాలి… పేటీఎం. అయితే దాన్ని మనం పేటీఎంను పేమెంట్ యాప్‌గా చూస్తున్న సమయంలో… పేటీఎం మాత్రం తనను తాను వేరే విధంగా నిర్వచించుకుంటోంది. మరో విలువైన వస్తువును కూడబెట్టుకుంటూ వచ్చింది. అదే మన డేటా.
మన లావాదేవీలు, మన ఆర్థిక ప్రవర్తన, మనం ఎలాంటి సేవలను ఉపయోగిస్తున్నాం, ఎలాంటి చెల్లింపులు చేస్తున్నాం వంటి సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా కస్టమర్ల ప్రవర్తనపై ఒక పెద్ద డేటా ఆధారం ఏర్పడింది. ఇప్పుడు ఆ డేటా నుంచి వచ్చిన అవగాహనను AIతో కలిపి కొత్త వ్యాపారంగా మార్చాలని పేటీఎం చూస్తోంది.
మన డేటాతో నేర్చుకుని… ఇప్పుడు AIని అమ్ముతుంది
పేటీఎం తీసుకొస్తున్న కొత్త సేవ పేరు Paytm Intelligence, సంక్షిప్తంగా Pi. ఇది మన కోసం మరో పేమెంట్ ఫీచర్ కాదు. ఇతర కంపెనీల కోసం పనిచేసే AI ఏజెంట్ల వ్యాపారం. సేల్స్ చేయాలి. కస్టమర్లకు సేవలు అందించాలి. కొత్త కస్టమర్లను గుర్తించాలి. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు మరో ఉత్పత్తిని అమ్మాలి. వ్యాపార ప్రచారాలను నిర్వహించాలి. ఇలాంటి పనుల్లో AI ఏజెంట్లను ఉపయోగించేలా Piని రూపొందిస్తోంది.
అంటే ఇన్నాళ్లూ మనం పేటీఎంకు “డబ్బులు పంపించే కస్టమర్లు” అయితే… ఇక పేటీఎం ఇతర కంపెనీలకు “AI ఉద్యోగులను పంపించే సంస్థ” కావాలనుకుంటోంది.
ఆ AIకి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది?
ఇక్కడే మన డేటా అసలు కథలోకి వస్తుంది. పేటీఎం దాదాపు రెండేళ్లుగా ఆర్థిక సేవలకు సంబంధించిన ప్రత్యేక AI మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. సంవత్సరాలుగా జరిగిన భారీ స్థాయి డిజిటల్ లావాదేవీలు, కస్టమర్ ప్రవర్తనపై వచ్చిన అనుభవం వంటి అంశాలు ఈ టెక్నాలజీకి ఒక ముఖ్యమైన పునాది.
ఈ AI మోడల్ ద్వారా మోసపూరిత లావాదేవీలను గుర్తించడం, రుణం తీసుకునే వ్యక్తి విశ్వసనీయతను అంచనా వేయడం, బీమా క్లెయిమ్‌పై నమ్మకాన్ని పరిశీలించడం వంటి పనులు చేయగల సామర్థ్యాన్ని పేటీఎం అభివృద్ధి చేస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే…
మనం చేసిన కోట్లాది పేమెంట్లు పేటీఎంకు కేవలం డబ్బుల లావాదేవీలు కాదు. వాటి నుంచి ఆర్థిక ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక పెద్ద డేటా పాఠశాల తయారైంది. ఇప్పుడు ఆ పాఠశాలలో నేర్చుకున్నదాన్నే AIగా మార్చి మార్కెట్లోకి తీసుకెళ్తోంది.
మొదట బ్యాంకులే కస్టమర్లు
పేటీఎం ఈ కొత్త AI వ్యాపారాన్ని మొదటగా బ్యాంకులు, చిన్న రుణ సంస్థలు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల వద్దకు తీసుకెళ్లాలని చూస్తోంది. ఎందుకంటే ఈ సంస్థలకు కస్టమర్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఎవరికి ఏ రుణం ఇవ్వాలి?, ఎవరికి ఏ ఆర్థిక ఉత్పత్తి సరిపోతుంది?, ఎక్కడ మోసం జరిగే అవకాశం ఉంది?, ఎవరికి ఏ సేవను ఎప్పుడు సూచించాలి?. ఇలాంటి నిర్ణయాల్లో AI ఉపయోగపడితే సంస్థల ఖర్చు తగ్గొచ్చు. వేగం పెరగొచ్చు. కస్టమర్లకు వ్యక్తిగతంగా సరిపోయే సేవలను అందించొచ్చు.
అందుకే పేటీఎం తన AI ఏజెంట్లను ఒక రకంగా “డిజిటల్ ఉద్యోగులు” గా విక్రయించబోతోంది. పేమెంట్స్‌తో వచ్చిన డేటా… ఇప్పుడు పేమెంట్స్ దాటి వెళ్తోంది. ఇక్కడే పేటీఎం వ్యాపారంలో అసలు మార్పు కనిపిస్తుంది.
ఒకప్పుడు పేటీఎంకు మన పేమెంట్ ముఖ్యం. ఇప్పుడు ఆ పేమెంట్ నుంచి అర్థం చేసుకున్న మన ఆర్థిక ప్రవర్తన మరింత విలువైనదిగా మారుతోంది. ఇది పేటీఎంకే పరిమితమైన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫిన్‌టెక్ కంపెనీలు తమ వద్ద ఉన్న డేటా, టెక్నాలజీ, AI సామర్థ్యాలను కొత్త ఆదాయ మార్గాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఎందుకంటే సాధారణ పేమెంట్స్‌లో పోటీ పెరిగిపోయింది. ఒక లావాదేవీపై వచ్చే ఆదాయం పరిమితంగా ఉండొచ్చు. కానీ అదే వ్యవస్థతో తయారైన టెక్నాలజీని ఇతర కంపెనీలకు సేవగా విక్రయిస్తే… కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. పేటీఎం ఇప్పుడు అదే చేయబోతోంది.
మరి మన సంగతి?
ఇక్కడే కాస్త ఆలోచించాల్సిన విషయం ఉంది. మనం పేటీఎం ఉపయోగించాం. పేమెంట్లు చేశాం. ఆ సేవకు బదులుగా మనకు సౌకర్యం వచ్చింది. పేమెంట్ సులభమైంది. సమయం ఆదా అయింది.
కానీ అదే సమయంలో మన లావాదేవీల నుంచి ఏర్పడిన డేటా, దాన్ని విశ్లేషించడం ద్వారా వచ్చిన తెలివి… ఒక కంపెనీకి భవిష్యత్తులో కోట్ల రూపాయల వ్యాపారానికి ఉపయోగపడితే?
ఆ విలువలో మన వాటా ఎంత?
ఇది పేటీఎం మన వ్యక్తిగత డేటాను నేరుగా ఎవరికైనా అమ్మేస్తోందని చెప్పడం కాదు. డేటా వినియోగానికి గోప్యత, అనుమతులు, నియంత్రణలు వర్తిస్తాయి. అయితే ఇక్కడో పెద్ద సందేహం మాత్రం మిగిలే ఉంటుంది. డేటా ఆర్థిక వ్యవస్థలో కొత్త బంగారంగా మారుతున్నప్పుడు… ఆ బంగారాన్ని సృష్టించడంలో భాగమైన వినియోగదారుడికి ఏమి దక్కాలి?
రేపటి బిజినెస్ ఇదే కావచ్చు
ఇకపై కంపెనీల మధ్య పోటీ కేవలం కస్టమర్లు ఎవరి దగ్గర ఎక్కువ అన్నదానిపై ఉండకపోవచ్చు. ఎవరి దగ్గర మంచి డేటా ఉంది.ఎవరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు?
ఎవరు ఆ డేటాతో ఉపయోగకరమైన AI తయారు చేయగలరు? ఎవరు ఆ AIని కొత్త బిజినెస్‌గా మార్చగలరు? అన్నదే అసలు పోటీ కావచ్చు. పేటీఎం ఇప్పుడు ఆ రేసులోకి దిగుతోంది.
మన పేమెంట్స్‌తో ఏర్పడిన అనుభవం, ఆర్థిక డేటా ఆధారంగా అభివృద్ధి చేసిన AI మోడళ్లు, వాయిస్ టెక్నాలజీ, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ వీటన్నింటినీ కలిపి Piని పెద్ద వ్యాపారంగా మార్చాలన్నది పేటీఎం ఆలోచన.
ఇది సక్సెస్ అయితే పేటీఎం కథ మరోసారి మారిపోతుంది.
పేమెంట్ యాప్‌గా మొదలై… డేటాను సేకరించి… ఆ డేటా నుంచి తెలివిని తయారు చేసి… ఇప్పుడు ఆ తెలివినే ఇతర కంపెనీలకు అమ్మే దశకు చేరుతుంది.
మరి ఇందులో మనం?
మనమే డేటా ఇచ్చాం. మన లావాదేవీలే ఆ డేటాను పెంచాయి. మన ప్రవర్తనే ఆ AIకి నేర్చుకునే అవకాశం ఇచ్చింది. అందుకే చివరికి ఒక చిన్న కోరిక మాత్రం ఉండొచ్చు.
మన డేటాతో బిజినెస్ చేసుకోవద్దని కాదు… చేసుకోండి. కానీ ఆ బిజినెస్‌లో మన డేటాకు కూడా విలువ ఉందని గుర్తించి, అందులో కొంత లాభం మాకు కూడా ఇస్తే బాగుంటుంది కదా!
ఎందుకంటే పేటీఎం కొత్త బిజినెస్‌కు మన డేటా ఇంధనం అయితే…ఆ ఇంధనం పోసిన వాళ్లం మనమే కదా! మన వాదనలో న్యాయం ఉంది కదా.








