రాజ్ కపూర్ తీసిన రూ.2,000 కోట్ల సినిమా!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఈ రోజుల్లో ఓ ఇండియన్ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసిందంటే అదె పెద్ద గొప్ప విషయంగా మాట్లాడుకుంటున్నాం. రూ.500 కోట్లు దాటితే ఇంక చెప్పక్కర్లేదు. పెద్ద రికార్డు. ఇక రూ.1,000 కోట్లు కొడితే ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయిందని సంబరపడుతున్నాం.
కానీ… 75 ఏళ్ల క్రితమే ఒక భారతీయ సినిమా నేటి విలువలో దాదాపు రూ.2,000 కోట్ల స్థాయి వసూళ్లు సాధించిందంటే? అది కూడా పాన్-ఇండియా మార్కెట్ లేని రోజుల్లో అంటే మామూలు విషయం కాదు.అప్పట్లో మల్టీప్లెక్సులు లేవు. ఓటీటీ లేదు. సోషల్ మీడియా అసలే లేదు. భారీ ప్రమోషన్లు లేవు.
అయినా ఆ సినిమా కోట్లు కలెక్ట్ చేసి భారత్ ని దాటి ప్రపంచాన్ని చుట్టేసింది. గ్లోబుల్ మార్కెట్ ని అప్పట్లోనే పట్టుకుంది. ఏమా సినిమా? ఏంటా కథ.
ఆ అద్బుతమే ‘ఆవారా’.
1951లో కేవలం 26 ఏళ్ల వయసులో రాజ్ కపూర్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన సినిమా ఇది. అంతేకాదు, ఆయన అప్పటికే స్టూడియో అధిపతిగానూ ఉన్నారు. ఇది ఆయన మూడో సినిమా.
అసలు ‘ఆవారా’ కథ ఏంటి?
కథలో రాజు అనే యువకుడు నేరానికి పాల్పడి కోర్టు ముందు నిలబడతాడు. అతని కేసును విచారించే జడ్జి రఘునాథ్. కానీ ఒక విచిత్రమైన విషయం ఉంది. ఆ జడ్జి మరెవరో కాదు రాజు తండ్రే. జడ్జి రఘునాథ్‌కు ఒక గట్టి నమ్మకం ఉంటుంది. అది..నేరస్థుడి కొడుకు నేరస్థుడిగానే మారతాడు.
ఆ నమ్మకంతోనే అతను తన భార్య లీలను దూరం చేసుకుంటాడు. ఆమె గర్భంలో ఉన్న రాజు తండ్రి ప్రేమకు దూరంగా, పేదరికంలో పెరుగుతాడు. పరిస్థితులు అతన్ని నేర ప్రపంచంలోకి నెడతాయి. ఇక్కడే ‘ఆవారా’ అనే పాత్ర పుడుతుంది. మనిషి పుట్టుకతోనే మంచివాడా, చెడ్డవాడా? లేక… అతను పెరిగిన పరిస్థితులే అతన్ని అలా తయారు చేస్తాయా?. ఇదే ఈ సినిమాలో కాంప్లిక్ట్. పుట్టుకా? పెంపకమా? అనే ఈ సంఘర్షణను పేదరికం, నిరుద్యోగం, అవినీతి, వర్గ విభజనలతో కలిపి రాజ్ కపూర్ తెరపై పెట్టాడు.
ఎందుకింత పెద్ద హిట్
‘ఆవారా’ విజయం కేవలం రాజ్ కపూర్ స్టార్డమ్ వల్ల రాలేదు. కథలోని రాజు సాధారణ ప్రేక్షకుడికి దగ్గరగా ఉన్నాడు. అతను సూపర్ హీరో కాదు. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడు కాదు. పేదరికం, అవమానం, ఆకలి మధ్య పెరిగిన సాధారణ యువకుడు.అందుకే ప్రేక్షకుడు అతన్ని చూసి “ఇతను నేరస్థుడు” అనుకోలేదు.తనలాంటివాడే అనుకున్నాడు. ఓన్ చేసుకున్నాడు. ఆ తర్వాత “ఇతను ఇలా ఎందుకు అయ్యాడు?” అని ఆలోచించాడు. అదే సినిమా బలం.
దానికి అద్బుతమైన ప్రేమకథను జోడించారు. రాజ్ కపూర్‌కు నర్గిస్ జోడీ. ఆమె పోషించిన రీటా పాత్ర రాజును అర్థం చేసుకునే వ్యక్తిగా, న్యాయవాదిగా కథలో కీలకంగా ఉంటుంది. అంటే ఒకే సినిమాలో సామాజిక సమస్య, ప్రేమ, నేరం, కుటుంబ సంఘర్షణ, కోర్టు డ్రామా, పాటలు, భారీ విజువల్స్ అన్నీ కలిశాయి.ఇక్కడే రాజ్ కపూర్ తెలివి కనపడుతుంది. సందేశాన్ని ఉపన్యాసంగా చెప్పలేదు. వినోదంగా చెప్పాడు.
ఇంకా ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే రఘునాథ్ పాత్రను రాజ్ కపూర్ నిజ జీవిత తండ్రి పృథ్వీరాజ్ కపూర్ పోషించారు.
రూ.2,000 కోట్ల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది?
‘ఆవారా’ అప్పట్లో భారతదేశంలోనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సినిమా. అంతర్జాతీయంగానూ భారీ విజయం సాధించింది. TCM దీన్ని ఆ కాలంలో భారతీయ సినిమాకు “breakthrough hit”గా పేర్కొంటూ, దేశంలోని బాక్సాఫీస్ రికార్డులను అధిగమించిందని చెబుతోంది.
1951లో ‘ఆవారా’ నేరుగా రూ.2,000 కోట్లు వసూలు చేయలేదు.అప్పట్లో భారత్‌లో రూ.2.1 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి లెక్కలు ప్రకారం రెండు వేల కోట్లు. అప్పట్లోనే దేశంలోనే అత్యధిక వసూళ్లు.1954లో సోవియట్ యూనియన్‌లో 6.4 కోట్ల ప్రేక్షకులు.అప్పటి సోవియట్ బాక్సాఫీస్ రికార్డు. రీ-రన్స్‌తో అక్కడ దాదాపు 10 కోట్ల టికెట్ అడ్మిషన్లు.చైనాలో మరో 10 కోట్లకు చేరువైన ఫుట్‌ఫాల్స్. ఈ లెక్కలను పక్కన పెట్టినా, సినిమా సృష్టించిన ప్రభావం అసాధారణమే.
భారత్‌లో హిట్… సోవియట్‌లో ఏకంగా సంచలనం!
‘ఆవారా’ అసలు సక్సెస్ భారత్ దాటటంతో మొదలైంది. సోవియట్ యూనియన్‌లో ఈ సినిమా సంచలనంగా మారింది. 1954లో ఒక్క ఏడాదిలోనే సుమారు 6.4 కోట్ల మంది టికెట్లు కొనుగోలు చేసి సినిమా చూశారని Tuli Research Centre పేర్కొంటోంది. రీ-రన్స్‌ను కలిపితే అక్కడి మొత్తం ఈ సినిమా దాదాపు 10 కోట్ల స్థాయికి చేరినట్లు అంచనాలు ఉన్నాయి. రాజ్ కపూర్ అక్కడ కేవలం భారతీయ నటుడు కాదు. ఒక అంతర్జాతీయ స్టార్.
‘ఆవారా హూన్’ పాట అయితే భారత్‌కు వెలుపల కూడా రాజ్ కపూర్‌కు గుర్తింపుగా మారిపోయింది. సోవియట్ యూనియన్, చైనా, టర్కీ, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో ఆ పాట పెద్ద హిట్.
చైనాలోనూ అదే కథ
1955లో ‘ఆవారా’ చైనాలో విడుదలై అక్కడ కూడా భారీ ఆదరణ పొందింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రచురించిన India-China Cultural Contacts ఎన్సైక్లోపీడియా ప్రకారం, సినిమా చైనాలో ఇమ్మీడియట్ హిట్‌గా మారింది. చైనాలో కూడా రాజ్ కపూర్ పేరు విస్తృతంగా పరిచయమైంది. ఆవారా 2000లో వచ్చిన చైనీస్ సినిమా Platformలో కూడా ప్రస్తావించబడింది.
టర్కీ: ఒక సినిమా కాదు… ఒక ఫార్ములా
టర్కీలో ఆవారా కథను మళ్లీ మళ్లీ సినిమాలుగా తీశారు. సినిమా 1955లో టర్కీలో విడుదలైంది. అక్కడి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ రావడంతో, తరువాత ఎనిమిది సార్లు టర్కిష్ సినిమాగా రీమేక్/అడాప్ట్ చేసారు.
ఇరాన్‌లోనూ ప్రభావం
1967లో The Wheel of the Universe అనే ఇరానియన్ సినిమా వచ్చింది. ఇది ఆవారాకు రీమేక్‌గా చెప్తారు. అయితే ఇది రాజ్ కపూర్ ఒరిజినల్‌ను నేరుగా రీమేక్ చేసిందా, లేక టర్కిష్ Avareను ఆధారంగా చేసుకుందా అన్న విషయంలో క్లారిటీలేదు. అయినా ఇది రీమేకే.
మన దేశంలో ‘ఆవారా’ ప్రభావం
‘ఆవారా’ భారతీయ సినిమాపై చూపిన ప్రభావం ఒకే సినిమాను రీమేక్ చేయడంతో ఆగిపోలేదు. రాజ్ కపూర్ సృష్టించిన “పేదవాడైన, అమాయకమైన, పరిస్థితులతో పోరాడే హీరో” ఇమేజ్‌నే తర్వాతి హిందీ సినిమాలు పదే పదే ఉపయోగించాయి. అలాగే మన దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాని బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి.
“ప్రపంచం ‘ఆవారా’ను రీమేక్ చేసింది. కానీ రాజ్ కపూర్ కుటుంబమే దాన్ని మళ్లీ తీయడానికి భయపడింది. ఎందుకంటే కొన్ని సినిమాలు విజయవంతం కావు… ఒకసారి మాత్రమే జరుగుతాయి అని చెప్పారు”
ఫైనల్ గా..
ఈరోజు మనం ‘పాన్-ఇండియా సినిమా’ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. రాజ్ కపూర్ మాత్రం 1951లోనే భారతీయ సినిమాకు ప్రపంచ ప్రేక్షకుడిని వెతికి పట్టుకున్నాడు.అందుకే ‘ఆవారా’ గురించి మాట్లాడేటప్పుడు “ఎంత కలెక్ట్ చేసింది?” అని కాకుండా “అంత చిన్న వయసులో రాజ్ కపూర్ ఇంత పెద్దగా,గొప్పగా ఎలా ఆలోచించాడు?” అని చూడాలి. అదే ఈ సినిమాను ఇప్పటికీ ప్రత్యేకంగా నిలబెడుతోంది.








