నాటి చీకటి రోజులకు మూడేళ్లు: లోకేష్ ఎమోషనల్ పోస్ట్..!
నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ, పర్యాటక శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వాన్ని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 9న) చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని మండిపడ్డారు.
ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ, అక్రమ నిర్బంధాలపై న్యాయపోరాటం చేసి విజయం సాధించామని లోకేష్ పేర్కొన్నారు. నాడు చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుండి ఏకంగా 53 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని నారా లోకేష్ గుర్తు చేశారు. “నిజం గెలవాలి” అనే నినాదంతో విదేశాల్లోని ఎన్ఆర్ఐల నుండి పల్లెల్లోని సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని కొనియాడారు. ప్రజలందరూ చూపించిన ఆ అపారమైన ప్రేమే తమకు కొండంత అండగా నిలిచిందని, ఆ కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించడానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
చివరికి తాము నమ్మిన నిజమే గెలిచిందని, రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులన్నింటినీ న్యాయస్థానాలు సైతం కొట్టివేశాయని లోకేష్ స్పష్టం చేశారు. నిర్బంధాలు, కుట్రలను ఛేదించుకుని చంద్రబాబు నాయుడు సింహంలా బయటకు వచ్చారని, నేడు ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. నాడు చంద్రబాబుకు, తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రపంచవ్యాప్త తెలుగు సమాజానికి ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మరొకసారి ధన్యవాదాలు తెలిపారు.








