బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం తారస్థాయికి చేరింది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో ఏకంగా 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తం ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే జరిగిన ఈ నాటకీయ పరిణామం గులాబీ దళానికి కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బగా మారింది.
ఉదయం సభ మొదలవగానే వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ర్యాలీలు, ఆయనపై వచ్చిన అనుచిత బెదిరింపు వ్యాఖ్యలు, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలపై చర్చ జరగాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం గట్టిగా పట్టుబట్టింది. అయితే ఈ తీర్మానాన్ని తోసిపుచ్చడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు.
ప్రతిపక్ష సభ్యుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య సభ అని, గతంలో సాగిన దొరల పాలన కాదని కేటీఆర్‌తో పాటు ఇతర సభ్యులను ఘాటుగా హెచ్చరించారు. వెనక్కి వెళ్లి ఆసనాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే సూచించినా నిరసన ఆగలేదు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ తరఫున ప్రతిదాడికి దిగారు. సభను నడుపుతున్న ఒక దళిత స్పీకర్‌ను అవమానించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని, స్పీకర్ పీఠంపైకి దూసుకురావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో దళిత నాయకులు నిరసన చేస్తే పసుపు నీళ్లతో శుద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని, అలాంటి వారు ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణలో ఇకపై భూస్వామ్య, దొరతన పోకడలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
సభను నడవనీయకుండా పదేపదే అడ్డుపడుతున్నారన్న కారణంతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మొత్తం 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. స్పీకర్ తక్షణమే ఆమోదం తెలిపారు. అయితే సస్పెన్షన్ జాబితాలో అసలు సభలో లేని కొందరు సభ్యుల పేర్లను కూడా చేర్చారంటూ గులాబీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలును ఎండగట్టాలని భావించిన బీఆర్ఎస్కు తాజా సస్పెన్షన్ పెద్ద దెబ్బ. కేటీఆర్, హరీశ్ రావు వంటి ముఖ్యమైన గొంతుకలు సెషన్ మొత్తం సభకు దూరమవ్వడంతో అసెంబ్లీ లోపల ప్రభుత్వానికి ఎదురే లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమను సభ నుంచి తప్పించి ప్రజా సమస్యల చర్చను పక్కదారి పట్టిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, నిబంధనలను ఉల్లంఘించి సభను హైజాక్ చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది.








