‘Naked Wedding’ కాన్సెప్టు ఎందుకు పాపులర్ అవుతోంది? ఏమిటి దాని ప్రత్యేకత?
—-సూర్య ప్రకాష్ జోశ్యుల
“పెళ్లి అయిపోయింది.”
హాల్లో మంగళవాయిద్యాలు మెల్లిగా ఆగిపోయాయి. అతిథులు,ఆత్మీయలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. స్నేహితులు సైతం విషెష్ చెప్పి బయిలుదేరుతున్నారు. స్టేజ్‌పై పూలు అలాగే ఉన్నాయి. టేబుళ్లపై మిగిలిపోయిన భోజనం అలాగే ఉంది. ఫొటోగ్రాఫర్ చివరి షాట్ తీస్తున్నాడు.
కొత్త జంట ఒక మూలన కూర్చుంది.
ఆ రోజు కోసం నెలల తరబడి ప్లాన్ చేశారు. లక్షలు ఖర్చు చేశారు. వందల మందిని పిలిచారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఆ హడావుడి అంతా ముగిసిన తర్వాత వాళ్లకు ఒకటే అనిపించింది.
“తామిద్దరం ఒకటవ్వటానికి ఇంత హంగామా నిజంగా అవసరమా?”
పెళ్లి అంటే గ్రాండ్‌గా ఉండాలి.. వందల మంది అతిథులు రావాలి.. ఖరీదైన దుస్తులు, భారీ డెకరేషన్, ప్రత్యేక ఫొటోషూట్లు, రకరకాల ఫంక్షన్లు ఉండాలి. ఇలాంటివి అన్ని ఎన్నో ఏళ్లుగా పెళ్లిళ్లను ఒక భారీ ఈవెంట్‌గా మార్చేశాయి. తర్వాత కాలంలో ఇనిస్ట్రగ్రామ్ వీడియోలకు ఫోజుల్లా తయారు చేసాయి. కానీ ఇప్పుడు కొందరు యువ జంటలు ఈ లెక్కనే మార్చాలని చూస్తున్నారు. పెళ్లిని ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచాలని కొందరు జంటలు ఆలోచిస్తున్నారు.
అలా పెళ్లి నుంచి ఖర్చును, హంగును, సామాజిక ఒత్తిడిని ఒక్కొక్కటిగా తీసేస్తే చివరికి ఏం మిగులుతుంది? ఒక జంట. ఒక బంధం. ఒక కొత్త జీవితం. ఈ ఆలోచనకే ‘Naked Wedding’ అనే పేరు పెట్టుకున్నారు.
‘Naked Wedding’ అంటే..
పేరు వినగానే ఇదేదో బట్టలు లేకుండా చేసుకునే పెళ్లి అనుకునేరు.. పెళ్లి మీద మనమే వేసుకున్న అదనపు పొరలు లేకుండా చేసుకునే పెళ్లి అని అసలు అర్దం.
‘Naked Wedding’లో ఏం తీసేస్తారు?
ముందుగా ఈ పేరు గురించి ఉన్న అపార్థాన్ని పక్కన పెట్టాలి. ఇక్కడ ‘Naked’ అంటే నగ్నత్వం కాదు. పెళ్లి చుట్టూ అవసరం లేకుండా పెరిగిపోయిన హంగులు, ఖర్చులు, ఇతరుల కోసం చేసే ఏర్పాట్లను తొలగించడం.
ఒక జంటకు కోర్టులోనే పెళ్లి చేసుకోవడం సరిపోవచ్చు. మరో జంట ఇంట్లోనే కుటుంబ సభ్యులతో చిన్న వేడుక చేసుకోవచ్చు. ఇంకొకరు సంప్రదాయాలన్నీ పాటిస్తూనే అతిథుల సంఖ్యను తగ్గించుకోవచ్చు. మరొకరు కొత్త డిజైనర్ దుస్తులు కొనకుండా కుటుంబంలో తరతరాలుగా వస్తున్న చీర లేదా నగలను ఉపయోగించుకోవచ్చు.
అంటే Naked Weddingకు ఒకే రకమైన రూపం ఉండదు. “మా పెళ్లికి నిజంగా ఏం అవసరం?” అని జంట ఆలోచించి, మిగతావన్నీ పక్కన పెట్టడం ఈ కాన్సెప్ట్‌లో ప్రధానమైన విషయం.
అందుకే ఇందులో తక్కువ మంది అతిథులు ఉండొచ్చు, చిన్న వెన్యూ ఉండొచ్చు, మినిమల్ డెకరేషన్ ఉండొచ్చు, ఖరీదైన వెడ్డింగ్ ఎక్స్‌ట్రాలు లేకపోవచ్చు. కానీ దానికి బదులుగా కుటుంబంతో ఎక్కువ సమయం, జంటకు ఎక్కువ వ్యక్తిగత అనుభూతి ఉండొచ్చు.
అసలు ఈ ఆలోచన ఇప్పుడు ఎందుకు వినిపిస్తోంది?
మనం సాధారణంగా అన్ని పెళ్లిళ్లలోనూ “పెళ్లి ఖర్చు బాగా పెరిగిపోయింది” అనే మాట వింటూంటాం.అయితే వాళ్లు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకుటే , అదో సరదాగా, ఆనందిస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా తప్పదు ఇదో సంప్రదాయం అన్నట్లు తాహతుకు మించి ముందుకు వెళ్తేనే ఇబ్బంది.
“వాళ్ల పెళ్లి అంత గ్రాండ్‌గా జరిగింది, మనది కూడా అలాగే ఉండాలి”, “ఇంతమంది బంధువులను ఎలా పిలవకుండా ఉంటాం?”, “సంగీత్ లేకుండా పెళ్లేంటి?”, “ప్రీ-వెడ్డింగ్ షూట్ చేయకపోతే ఎలా, రేపు ఏం చూసుకుంటాం?”..ఇలాంటి ఆలోచనలు, మాటలే పెళ్లి బడ్జెట్ ని, పెళ్లి ప్లానింగ్ ని, చివరికి ఆ కుటుంబాలపై పడే ఆర్దిక ఒత్తిడిని పెంచేస్తున్నాయి.అయితే ఇన్నాళ్లూ పెళ్లి అంటే ఇవి తప్పవు అనే ఆలోచన మనది. కానీ ఇప్పుడు యువత ఖర్చుపై వేరే విధంగా ఆలోచిస్తోంది.
“పెళ్లి జీవితంలో ఒక్కసారే కదా.. ఎంతైనా ఖర్చు చేద్దాం” అనే ఆలోచలను కొట్టిపారేస్తున్నారు. పెళ్లి రోజు తర్వాత వచ్చే 20, 30 ఏళ్ల జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా? అప్పులు తీర్చుకుంటూ బ్రతకటం అవసరమా ” అంటున్నారు.
పెళ్లి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులో కొంత భాగాన్ని ఇల్లు కొనడానికి ఉపయోగించవచ్చు. కొంత తమ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టవచ్చు. కొంత అత్యవసర నిధిగా ఉంచుకోవచ్చు. పెళ్లి తర్వాత చేసే ప్రయాణాలు కోసం ఉపయోగించవచ్చు. లేదా అసలు ఏమీ చేయకుండా భవిష్యత్తు కోసం దాచుకోవచ్చు. అంటే పెళ్లి రోజు కోసం ఖర్చు చేసే డబ్బుని పెళ్లి తర్వాతి జీవితానికి ఉపయోగపడే విధంగా ఎలా మార్చుకోవచ్చు అనేది ప్రధానమైన ఆలోచన ఈ కాన్సెప్టులో.
సోషల్ మీడియా ఎఫెక్ట్
అన్నిటి కన్నా సోషల్ మీడియా.. పెళ్లిని ఓ జ్ఞాపకంగా కాకుండా ఓ ప్రదర్శనగా మార్చేస్తోంది. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్. ఆ తర్వాత మెహందీ రీల్. సంగీత్ వీడియో. వెడ్డింగ్ ఎంట్రీ. డ్రోన్ షాట్స్. కపుల్ పోర్ట్రెయిట్స్. రిసెప్షన్ రీల్. పెళ్లి పూర్తయ్యేలోపు ఒక చిన్న సినిమానే తయారవుతుంది. ఇదంతా చూసి ఒక్క క్షణం ఆలోచిస్తే…మన పెళ్లి మనకు గుర్తుండటానికి జరుగుతోందా? లేక ఇతరులకు చూపించడానికి కూడా జరుగుతోందా? అనిపిస్తుంది. అదే Naked Wedding పాపులర్ అవ్వటానికి మరో కారణం.
ఈ ఆలోచన అసలు ఎప్పుడొచ్చింది
ఈ ఆలోచనకు కోవిడ్ కాలం ఒక విచిత్రమైన మలుపు ఇచ్చింది. వందల మంది రావాల్సిన పెళ్లిళ్లు కొద్దిమందితో జరిగాయి. భారీ ఫంక్షన్ హాళ్లు మూతపడటంతో ఇళ్లలోనే వివాహాలు జరిగాయి. చాలా పెళ్లి తంతులు ఆటోమేటిక్‌గా తొలగిపోయాయి. పెళ్లి మాత్రం ఆగలేదు. జంటలు పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారు. కొద్దిమంది స్నేహితులు ఉన్నారు. పెద్ద డెకరేషన్ లేకపోయినా వేడుక జరిగింది.
అంతేకాదు,చాలా మందికి ఆ చిన్న పెళ్లి మరింత ఆత్మీయంగా అనిపించింది. అక్కడే ఒక విషయం అర్థమైంది. పెళ్లి గొప్పతనం మనుషుల సంఖ్యతో కొలవాల్సిన అవసరం లేదు. ఈ అనుభవమే తర్వాత “సింపుల్ వెడ్డింగ్” అనే ఆలోచనకు మరింత బలం ఇచ్చింది.దాన్నే Naked Wedding అని పిలుస్తున్నారు.
ఏదైమైనా
ఈ కాన్సెప్టు మరింత పాపులర్ అయితే …మధ్య తరగతిలో Big Fat Indian Weddingకు చెల్లు చీటి పాడేసినట్లే అంటన్నారు చాలా మంది. అయితే ఇది అంత ఈజీ కాదు. భారతదేశంలో భారీ పెళ్లిళ్లకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యం చాలా బలంగా ఉంది. కుటుంబం మొత్తం కలిసి వేడుక చేసుకోవడం, బంధువులను ఆహ్వానించడం, సంప్రదాయాలను ఘనంగా నిర్వహించడం.. ఇవన్నీ చాలామందికి ఎంతో ముఖ్యమైనవి. అందుకే Naked Weddingను Big Fat Indian Weddingకు ప్రత్యామ్నాయంగా చూడటం కంటే, మరో ఎంపికగా చూడటం సరైనది.








