‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..భారత్‌కు ముప్పు తప్పదా? వానలు, పంటలు, తుఫాన్లపై ఎఫెక్ట్ ఎంత?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
‘సూపర్ ఎల్ నినో’.. గత కొద్ది రోజులుగా ఈ పేరు మనం పదేపదే వింటున్నాం. అలాగే ‘సూపర్ ఎల్ నినో’ అనుకున్న దానికన్నా చాలా బలంగా మారుతోందని, రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో ఉందని తాజాగా గ్లోబుల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే మనకేంటి?
పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో సముద్రం వేడెక్కితే భారత్‌లో మన పరిస్థితుల్లో మార్పు వస్తుందా? వర్షాలు, రుతుపవనాలు, పంటలు, తుఫాన్లతో దానికి సంబంధమేంటి? అంతకంటే ముఖ్యంగా.. ఈ ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం మన రోజువారీ జీవితాన్ని ఏమైనా తాకుతుందా?
అసలు ‘సూపర్ ఎల్ నినో’ అంటే ఏమిటి?
ఎల్ నినో అంటే భూమధ్యరేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే సహజ వాతావరణ పరిణామం. ఈ వేడి అక్కడితో ఆగిపోదు. సముద్రం, వాతావరణం మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల గాలుల దిశలు, పీడన వ్యవస్థలు, తేమ ప్రవాహాల్లో మార్పులు వస్తాయి.
ఆ మార్పులు ప్రపంచంలోని చాలా ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాసం ఉంటుంది. ప్రస్తుతం ఏర్పడుతున్న ఎల్ నినో సాధారణ స్థాయిలో లేదు. తాజా వాతావరణ సూచికల ప్రకారం ఇది చాలా బలమైన స్థాయికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి భీబత్సంగా మారుతుందని అంటున్నారు. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోలలో ఒకటిగా మారే అవకాశం కూడా ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. అందుకే దీనికి అనధికారికంగా ‘సూపర్ ఎల్ నినో’ అనే పేరు వినిపిస్తోంది.
భారత్‌కు సమస్య ఏమిటి?
భారత్ వాతావరణాన్ని ఎల్ నినో ఎందుకు ఇంత ప్రభావితం చేస్తుందంటే.. మన జీవితం రుతుపవనాలతో బలంగా ముడిపడి ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే నైరుతి రుతుపవనాలు దేశానికి ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో 70 శాతానికి పైగా అందిస్తాయి.
ఈ వర్షాలు బాగుంటే పంటలకు నీరు, జలాశయాలకు నీరు, భూగర్భ జలాలకు ఊరట. వర్షాలు దెబ్బతింటే మాత్రం ప్రభావం ఒక్క రైతు పొలానికే పరిమితం కాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆహార సరఫరా…దానిపై డిపెండ్ అయ్యే మార్కెట్ ధరలు, మన ఇంటి బడ్జెట్ పై ప్రభావం చూపుతాయి. అలా ప్రభావం ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తుంది.
ఎల్ నినో బలపడితే వర్షాలు తగ్గుతాయా?
చరిత్రలో అనేక ఎల్ నినో సంవత్సరాల్లో భారత రుతుపవనాలు బలహీనంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఎల్ నినో సమయంలో భారత రుతుపవన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని పరిస్థితుల్లో వర్షాల రాక ఆలస్యం కావచ్చు. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా వర్షాల మధ్య పెద్ద గ్యాప్ లు రావచ్చు.
ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే వర్షాధార వ్యవసాయంపై ఒత్తిడి పెరుగుతుంది. వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటల దిగుబడులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
కంగారుపడద్దు
ఎల్ నినో వచ్చింది అంటే భారత్‌లో కరువు ఖాయం అని మాత్రం కాదు. భారత రుతుపవనాలను నిర్ణయించేది ఒక్క ఎల్ నినో కాదు. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల పరిస్థితులు, పీడన వ్యవస్థలు, ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి అనేక అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
పంటలపై ప్రభావం.. అక్కడి నుంచి ధరలపై?
వర్షాలు బలహీనంగా ఉంటే మొదటి ఆందోళన రైతుదే అనేది అందరికి తెలిసిందే. పంటలకు అవసరమైన సమయంలో తగినంత వర్షం పడకపోతే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో సరఫరాపై ఒత్తిడి ఏర్పడవచ్చు.
అక్కడి నుంచి బియ్యం, పప్పులు, నూనెగింజలు వంటి ఆహార పదార్థాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అంటే ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావాన్ని కేవలం వాతావరణ శాఖ మ్యాప్‌లో చూసే విషయం కాదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రైతు పొలం నుంచి మన వంటగది వరకు దాని ప్రభావం కనిపించొచ్చు.
అయితే ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని ఇప్పుడే చెప్పలేం. పంటల ఉత్పత్తితో పాటు ప్రభుత్వ విధానాలు, నిల్వలు, దిగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి అనేక అంశాలు ఆహార ధరలను నిర్ణయిస్తాయి.
బంగాళాఖాతంలో తుఫాన్ల సంగతేంటి?
తెలుగు రాష్ట్రాలు ఇది తెలుసుకోవాల్సిన విషయం. బంగాళాఖాతం తుఫానులకు అనుకూలమైన సముద్ర ప్రాంతం. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల వేగం, విండ్ షియర్ వంటి అంశాలు తుఫానుల ఏర్పాటులో కీలకంగా ఉంటాయి. ఎల్ నినో సమయంలో కొన్ని పరిస్థితుల్లో విండ్ షియర్ బలపడవచ్చు. దీంతో తీవ్రమైన తుఫానులు ఏర్పడటానికి అనుకూలత తగ్గే అవకాశం ఉంటుంది.
అలాగని “ఎల్ నినో వచ్చింది కాబట్టి బంగాళాఖాతంలో తుఫానులు రావు” అని మాత్రం అర్థం చేసుకోకూడదు. ఒక తుఫాను ఏర్పడటానికి అనేక వాతావరణ పరిస్థితులు కలిసి రావాలి. అందువల్ల ఈ ఏడాది ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ తీరాలకు ఎన్ని తుఫానులు వస్తాయో కేవలం ఎల్ నినో ఆధారంగా చెప్పడం సాధ్యం కాదు.కానీ ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనేది అంచనా.
భారత్‌ను కాపాడే మరో అంశం ఉందా?
ఉంది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). హిందూ మహాసముద్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య తేడాను IOD సూచిస్తుంది. ఇది పాజిటివ్‌గా ఉన్నప్పుడు భారత్ వైపు తేమ ప్రవాహాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. బలమైన పాజిటివ్ IOD ఉన్న సందర్భాల్లో ఎల్ నినో వల్ల రుతుపవనాలపై పడే ప్రతికూల ప్రభావం చాలావరకు తగ్గే అవకాశం ఉంది.
మరి లా నినా వస్తే?
ఎల్ నినోకు వ్యతిరేక దశే లా నినా. సాధారణంగా లా నినా సమయంలో భారత రుతుపవనాలు బలపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. దీంతో వర్షపాతం పెరగడానికి, వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
కానీ అధిక వర్షాలు మరో సమస్యను తెచ్చిపెట్టవచ్చు. అతివృష్టి, వరదల ప్రమాదం పెరగవచ్చు. అంటే ఎల్ నినో అయినా, లా నినా అయినా.. రెండింటికీ తమదైన ప్రభావాలు ఉంటాయి.
పరీక్ష సమయం
ఎల్ నినో సాధారణంగా శీతాకాలం సమయంలో గరిష్ఠ బలానికి చేరుతుంది. అదే సమయంలో దాని ప్రపంచవ్యాప్త ప్రభావాలు కూడా మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. భారత్ విషయానికి వస్తే.. రాబోయే రుతుపవనాలు ఎలా స్పందిస్తాయి? బంగాళాఖాతం పరిస్థితులు ఎలా మారతాయి? IOD ఏ దిశలో వెళ్తుంది? అనే అంశాలే కీలకం.
అందుకే ఇప్పుడు ‘సూపర్ ఎల్ నినో’ అనే పేరు విని భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.
ఏదైనా అంతా పసిఫిక్ సముద్రంలోనే ఉంది.








