మస్క్ ‘మార్స్’ ప్రయాణం.. మన ఇంట్లోంచే మొదలు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“రాకెట్ మార్స్ వైపు దూసుకెళ్లే ముందు.. దాని ప్రయాణం మీ ఇంట్లోనే మొదలవుతుంది.”
ఇది చదవగానే ఇదేదో టైమ్ ట్రావెల్ మేటర్ లాగ అనిపిస్తుందా..అలాంటిదేమీ లేదు.. ఇది ఎలాన్ మస్క్ వేసిన ఒక బిజినెస్ ప్లాన్. అవును ఎలన్ మస్క్ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఆయన ఎత్తుగడలు సామాన్యుడికి అర్దం కావు. అందుకే ఆయన ప్రపంచ కుబేరులులో స్ధానం సంపాదించగలిగారు.
ఇంతకీ అసలు మేటరేంటి
ప్రస్తుతం మస్క్ ఆలోచన ఏమిటి…మార్స్‌పై మనుషుల్ని తీసుకెళ్లటం. అక్కడికి తీసుకెళ్లి జనాలను దింపటం మామూలు విషయం కాదు. అందుకు వేల కోట్ల డాలర్లు కావాలి. ఆ డబ్బు ఎవరు ఇస్తారు.ఇప్పటికిప్పుడు మార్స్ కు ప్రయాణ టిక్కెట్లు అమ్మలేడు కదా. అందుకే ఆ డబ్బును సంపాదించడానికి మస్క్ మరో గ్రహాన్ని కాదు.. భూమినే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంటే మననే. అయితే మనం ఎందుకు డబ్బు ఇస్తాం.
అందుకోసం ముందుగా ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని పెంచాలి. ఆ డబ్బుతో రాకెట్లను తయారు చేయాలి. ఆ రాకెట్లతో మళ్లీ శాటిలైట్లను పంపాలి. ఆ శాటిలైట్లతో మరింత డబ్బు సంపాదించాలి. చివరికి ఆ డబ్బుతో మనిషిని భూమి నుంచి బయటకు పంపాలి.ఇదీ ఆయన లెక్క.
ఇదంతా వింటుంటే ఒక డౌట్ వస్తుంది. మస్క్ మనల్ని ఇంటర్నెట్లోకి తీసుకొస్తున్నాడా?
లేక మన డబ్బుతో తనను తాను మార్స్‌కు పంపే సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడా?
ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే..
స్పేస్ఎక్స్ వద్ద ఇప్పుడు స్టార్‌షిప్ అనే 407 అడుగుల భారీ రాకెట్ ఉంది. మస్క్ ఆలోచనలలో ఇది కేవలం రాకెట్ కాదు. భవిష్యత్తులో ఇదే రాకెట్‌తో చంద్రుడికి వెళ్లాలి. ఆ తర్వాత మార్స్‌కు మనుషులను పంపాలి. అంతరిక్షంలోనే భారీ AI డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించాలి. కానీ ఆ స్థాయికి వెళ్లే ముందు స్టార్‌షిప్ చేయాల్సిన ఏం చేయాలి
డబ్బు సంపాదించాలి. అందుకే మొదట స్టార్‌షిప్ మోసుకెళ్లేది మార్స్‌కు వెళ్లే మనుషులను కాదు.. స్టార్‌లింక్ శాటిలైట్లను. ఇదే మస్క్ ప్లాన్‌లో అసలు మెలిక. అంటే మార్స్ ప్రయాణానికి ఉపయోగించాల్సిన రాకెట్.. ముందుగా భూమి మీద ఇంటర్నెట్ వ్యాపారాన్ని పెంచడానికి ఉపయోగపడబోతోంది.
మన ఇంట్లో ఇంటర్నెట్.. మస్క్ మార్స్ కలకు ఇంధనమా?
స్టార్‌లింక్ పేరు ప్రపంచానికి కొత్తది కాదు. గత కొంతకాలంగా రోజు వింటున్నదే. భూమి చుట్టూ తిరిగే వేలాది శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందించాలన్నది దీని లక్ష్యం. కానీ మస్క్‌కు ఇది కేవలం ఇంటర్నెట్ వ్యాపారం కాదు. ఇది డబ్బు తెచ్చే యంత్రం.
2026 రెండో త్రైమాసికంలో స్పేస్ఎక్స్ మొత్తం ఆదాయంలో దాదాపు 55 శాతం స్టార్‌లింక్ నుంచే వచ్చింది. 2025లో స్టార్‌లింక్ శాటిలైట్ వ్యాపారం ఏకంగా 11.4 బిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగింది.
అంటే ఇక్కడ లెక్క ఒకటే. స్టార్‌లింక్ డబ్బు సంపాదిస్తుంది. స్పేస్ఎక్స్ ఆ డబ్బును రాకెట్లలో పెడుతుంది. ఆ రాకెట్లు మరిన్ని స్టార్‌లింక్ శాటిలైట్లను కక్ష్యలోకి పంపుతాయి. మరిన్ని శాటిలైట్లు మరింత ఆదాయం తెస్తాయి. ఒక పెద్ద సర్కిల్. ఆ సర్కిల్‌కు చివరి గమ్యం మాత్రం మార్స్. మస్క్ బిజినెస్ మాస్టర్ ప్లాన్ ఇదే.
ఎందుకింత చుట్టుతిరుగుడు
మస్క్ మార్స్‌పై మనుషులు నివసించే భవిష్యత్తును ఊహిస్తున్నాడు. అది సాధించాలంటే స్టార్‌షిప్ అనే భారీ రాకెట్ పూర్తిగా పనిచేయాలి. కానీ స్టార్‌షిప్ అభివృద్ధి ఇప్పటికే చౌకైన వ్యవహారం కాదు. స్పేస్ఎక్స్ ఇప్పటివరకు స్టార్‌షిప్‌పై 15 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇంకా పరీక్షలు కావాలి. ఇంకా ప్రయోగాలు కావాలి. ఇంకా సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి. అంటే మార్స్ కలను నెరవేర్చడానికి ముందు మస్క్‌కు భూమి మీద ఒక బలమైన క్యాష్ మెషీన్ కావాలి. ఆ మెషీన్ స్టార్‌లింక్.
ఇక్కడే మస్క్‌కు అసలు సమస్య
స్టార్‌షిప్ ఒకేసారి అన్నీ చేయలేదు. ఒక ప్రయోగం అంటే ఒక ఛాన్స్. దాన్ని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపడానికి ఉపయోగిస్తే.. డబ్బు వస్తుంది. అదే ప్రయోగాన్ని డీప్ స్పేస్ టెక్నాలజీని పరీక్షించడానికి ఉపయోగిస్తే.. మార్స్ కలకు ఒక అడుగు దగ్గరవుతారు. అందుకే రాబోయే రోజుల్లో స్టార్‌షిప్ ప్రయోగాలు కేవలం టెక్నాలజీ పరీక్షలు కావు. అవి బిజినెస్ నిర్ణయాలుగా మారబోతున్నాయి.
స్పేస్ఎక్స్ CFO బ్రెట్ జాన్సెన్ కూడా స్టార్‌షిప్ తదుపరి ప్రయోగం గురించి మాట్లాడుతూ.. అది “రెవెన్యూ తెచ్చే ప్రయోగం” అవుతుందని చెప్పారు. అంటే ఇక స్టార్‌షిప్ కేవలం భవిష్యత్తు కోసం చేసే ప్రయోగం కాదు. అది డబ్బు సంపాదించడం కూడా మొదలుపెట్టాలి. రోజూ ఎగరాలి.. అప్పుడే మార్స్ కల సాధ్యం.








