బీజేపీ మార్గంలోనే కేజ్రీవాల్… ముందే బీజేపీకి ముకుతాడు?
బీజేపీ మార్గంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నడుస్తున్నారు. ఎక్కడైనా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, బీజేపీ అక్కడి చిన్న పార్టీలను సమీకరించి, ఓ కూటమిగా ముందుకు సాగుతుంది. దీని ద్వారా ఓటు శాతం బాగా పెరిగి, బీజేపీకి కలిసొస్తుంది. ఇది బీజేపీ అనుసరించే రాజకీయ వ్యూహం.
సరిగ్గా ఇదే ఫార్ములాను ఆప్ గోవాలో ఇప్పుడు అమలు చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోవా రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్, విజయ్ సర్దేశాయ్ కి చెందిన గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP) తో అధికారికంగా జత కట్టింది. దీనికి ‘‘గోవా ఫస్ట్ కూటమి’’ అని పేరు పెట్టింది.
అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని గద్దె దించే లక్ష్యంతో ఈ కూటమిని ఒక బలమైన ప్రత్యామ్నాయంగా అభివర్ణిస్తూ, గోవాలో సంప్రదాయ రాజకీయాన్ని మార్చాలన్న ప్లాన్ లో ఆప్ వుంది. ప్రతిపక్షాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆప్, GFP మధ్య వ్యూహాత్మకంగా పొత్తు ఏర్పడింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సర్దేశాయి పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినప్పటికీ, ప్రతిపక్ష కూటమిని అధికారికంగా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జాప్యం మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు గతంలో బీజేపీలో చేరిన చరిత్రకు సంబంధించిన ఆందోళనల కారణంగా నిలిచిపోయాయి.
ఆప్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా, సర్దేశాయ్ బీజేపీయేతర ఓట్లను ఏకీకృతం చేయాలని, అలాగే దక్షిణ, ఉత్తర గోవా అంతటా ఓట్లు చీలిపోకుండా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త భాగస్వామ్యం స్థానిక సమస్యల ఆధారిత పాలన, ప్రాంతీయ పరిరక్షణ, పరిపాలనా జవాబుదారీతనంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని హామీ ఇస్తోంది.బీజేపీ వరుసగా నాలుగోసారి అధికారాన్ని ఆశిస్తున్న తరుణంలో, సర్దేశాయ్ ప్రాంతీయ ప్రాబల్యం, ఆప్ ఎన్నికల యంత్రాంగంతో కలిసి గోవాలోని సాంప్రదాయ ద్విముఖ పోటీతో బరిలోకి దిగనున్నాయి.








