మీ పిల్లాడు వ్యోమగామి కావాలంటే? NASA కొత్త కాలేజీ.. 2028లోనే ఫస్ట్ బ్యాచ్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఇన్నాళ్లూ మన పిల్లలని పిలిచి “ఏం అవుతావు?” అంటే.. డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పించాం. మరికొన్ని ఏళ్ల తర్వాత అదే ప్రశ్నకు “స్పేస్‌లో పనిచేస్తా” అని సమాధానం వచ్చేలా కనపడుతోంది. అవును..ఇదేమీ ఊహ కాదు. అమెరికా ఇప్పటికే ఆ భవిష్యత్తు కల కోసం సన్నాహాలు మొదలుపెట్టింది.
అమెరికా అంతరిక్ష సంస్థ NASA ఒక కొత్త Space Academyని ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తోంది. రేపటి తరం స్పేస్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వ్యోమగాములు, పైలట్లు, స్పేస్ ఆపరేటర్లు, అంతరిక్ష రంగ వ్యాపారవేత్తలను తయారు చేయడమే దీని లక్ష్యం. ఇదేదో ఎప్పుడో జరిగే వ్యవహారం కాదు. తొలి బ్యాచ్‌ను 2028లోనే ప్రారంభించాలని NASA టార్గెట్ పెట్టుకుంది.
ఈ లెక్క ప్రకారం ఇప్పుడు స్కూల్లో చదువుతున్న మీ పిల్లలు కాలేజీకి వెళ్లే సమయానికి.. అమెరికాలో అంతరిక్షం కోసం ప్రత్యేకంగా తయారైన ఒక కొత్త విద్యా వ్యవస్థ సిద్ధంగా ఉంటుందన్నమాట.
మామూలు కాలేజీ కాదు.. ఏకంగా 300 ఎకరాల్లో …!
NASA ఇప్పటికే దీనికి సంబందించి పనులు మొదలెట్టేసింది. ఇందుకోసం ప్రతిపాదించిన క్యాంపస్ గురించి వింటేనే ఇది ఏ స్థాయిలో రూపొందబోతోందో అర్థమవుతుంది. Space Academy కోసం కనీసం 300 ఎకరాల భూమి కావాలని NASA కోరుతోంది.
మొదటి దశలోనే 1,200 మంది అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను 4,000 మంది వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏయే కోర్స్ లు
క్యాంపస్‌లో అంతరిక్షానికి సంబంధించిన చదువులు, పరిశోధనలు, శిక్షణ, ఆపరేషన్లకు అవసరమైన వసతులు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. NASA కేంద్రాలు లేదా ప్రముఖ యూనివర్సిటీలకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు అదనపు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.
ఎక్కడ ఈ అకాడిమీ
NASA ఇప్పటికే ప్రభుత్వాలను…“మీ రాష్ట్రంలో మాకు స్థలం ఇవ్వగలరా? మౌలిక వసతులు కల్పించగలరా? ఎంత నిధులు పెడతారు? యూనివర్సిటీలతో ఎలాంటి భాగస్వామ్యం చేస్తారు?” అని అడుగుతోంది. అంటే ఒకరకంగా చెప్పాలంటే.. “NASA Space Academy మీ రాష్ట్రంలో పెట్టాలా? అయితే మీ ఆఫర్ ఏంటి?” అని ఓపెన్ ఆఫర్ ఇస్తోంది.
తమ ప్రాతంలో అకాడెమీ కావాలనుకునే రాష్ట్రాలు భూమి, మౌలిక వసతులు, నిధులు, యూనివర్సిటీ భాగస్వామ్యాలు వంటి ప్యాకేజీలతో ముందుకు రావాలి. తమ ప్రతిపాదనలను NASAకు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 26. టెక్సాస్, ఫ్లోరిడా, అలబామా వంటి అంతరిక్ష పరిశ్రమకు ఇప్పటికే బలమైన అనుబంధం ఉన్న రాష్ట్రాలు ఈ పోటీలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
మరి మీ పిల్లాడు అక్కడ చదివితే ఏం అవుతాడు?
NASA ప్లానింగ్ ప్రకారం.. ఈ అకాడమీ నుంచి బయటకు వచ్చే విద్యార్థులు కేవలం వ్యోమగాములు మాత్రమే కాదు.
శాస్త్రవేత్తలు కావచ్చు.
ఇంజినీర్లు కావచ్చు.
పైలట్లు కావచ్చు.
స్పేస్ ఆపరేటర్లు కావచ్చు.
వ్యాపారవేత్తలు కావచ్చు.
ప్రభుత్వ అధికారులు కావచ్చు.
అంతరిక్ష భద్రతకు పనిచేసే నిపుణులు కావచ్చు.
అంటే భవిష్యత్తులో “స్పేస్ జాబ్” అంటే కేవలం రాకెట్లో కూర్చొని అంతరిక్షంలోకి వెళ్లడం కాదన్నమాట.
రాకెట్ తయారు చేసేవాళ్ల నుంచి.. దాన్ని ఆపరేట్ చేసేవాళ్ల వరకు.. అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలను కాపాడేవాళ్ల నుంచి.. కొత్త స్పేస్ కంపెనీలు నిర్మించేవాళ్ల వరకు ఒక భారీ ఉద్యోగ ప్రపంచాన్ని తయారు చేయాలన్నది ఈ ఆలోచన వెనుక ఉంది.
మన దగ్గర పిల్లలు JEE, NEET కోసం పరుగులు పెడుతుంటే.. అమెరికా మాత్రం రాబోయే దశాబ్దాల్లో ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం వెతుకుతోంది. “అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో పనిచేసే మనుషులను ఎలా తయారు చేయాలి?”
ఎందుకంటే స్పేస్ ఇక కేవలం NASA లేదా ప్రభుత్వాల విషయం కాదు.ప్రైవేట్ కంపెనీలు కూడా రాకెట్లు తయారు చేస్తున్నాయి. ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నాయి. అంతరిక్ష కమ్యూనికేషన్, పరిశోధనలు, రవాణా, రక్షణ వంటి రంగాల్లోకి దిగుతున్నాయి.
అందుకే రేపటి అంతరిక్ష ప్రపంచానికి ఒకే సమయంలో సైన్స్ తెలిసినవాళ్లు, టెక్నాలజీ తెలిసినవాళ్లు, బిజినెస్ అర్థం చేసుకున్నవాళ్లు, ప్రభుత్వ వ్యవస్థ తెలిసినవాళ్లు కావాలని NASA భావిస్తోంది.
ఫీజ్ ఎంత ఉంటుంది !
Space Academyలో ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది అనే విషయం NASA ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అయితే ఈ అకాడమీలో ఉచిత విద్య అందించినట్లయితే.. దానికి బదులుగా విద్యార్థులు కొన్ని సంవత్సరాలు అమెరికా ప్రభుత్వ సేవలో పనిచేయాల్సి ఉండొచ్చని సమాచారం. ఇది ఇంకా పూర్తిగా ఖరారైన నియమం కాదు. కానీ అకాడమీని సాధారణ యూనివర్సిటీకి భిన్నంగా చూడడానికి ఇదొక ముఖ్యమైన సంకేతం.
“Space Force” కూడా?
NASA ప్రతిపాదనలో “warfighters” అనే పదం కూడా కనిపిస్తోంది. అంటే అక్కడ చదివిన కొంతమంది గ్రాడ్యుయేట్లు NASAలో పనిచేయవచ్చు. మరికొందరు అమెరికా Space Force వైపు వెళ్లవచ్చు. అంటే ఒకవైపు శాస్త్రవేత్తలు, మరోవైపు అంతరిక్ష భద్రత నిపుణులు.. రెండింటినీ తయారు చేసే వ్యవస్థగా ఈ అకాడమీ ఎదగవచ్చన్నమాట.
సినిమాల్లో చూసిన “Starfleet Academy” నిజ జీవితంలోకి?
సైన్స్ ఫిక్షన్ సినిమాలు, సిరీస్‌లు చూసే వారికి Starfleet Academy అనే పేరు కొత్తది కాదు. అంతరిక్షంలో పనిచేసే భవిష్యత్తు తరాన్ని తయారు చేసే ఒక ప్రత్యేక అకాడమీ అనే ఆలోచన అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా ప్రతిపాదించిన Space Academy కూడా కొంతవరకు అలాంటి భవిష్యత్తు ఆలోచనను గుర్తుకు తెస్తోంది.
మరో అకాడమీ ఎందుకు?
అమెరికాలో ఇప్పటికే MIT, Stanford, Caltech వంటి ప్రపంచస్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. NASAతో కలిసి పనిచేసే ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే NASA భావనలో సమస్య విద్యార్థులకు “సైన్స్” నేర్పించడంలో కాదు. భవిష్యత్తు అంతరిక్ష రంగం కోసం అన్ని విభాగాలను కలిపి నాయకులను తయారు చేస్తానంటోంది.








