‘సెక్స్ వర్కర్ల’ కోసం స్పెషల్ మ్యాగజైన్, అందులో ఏముంటుంది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సెక్స్ వర్కర్ల కోసం మ్యాగజైన్ అనే ఊహే ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే వాళ్లు బయిటకు తాము ఫలానా అని చెప్పుకోవటానికి ఇష్టపడరు. అలాగే తమ ఐడెంటిటీని సాధ్యమైనంత మేరకు దాస్తూంటారు. అలాంటి వారు ధైర్యంగా ప్రపంచం ముందుకు వచ్చి తమ థాట్స్ ని మనతో షేర్ చేసుకుంటామని, అందుకోసం ఓ మ్యాగజైన్ తెస్తున్నామని చెప్పటం నిజంగా గొప్ప విషయం. వారి వృత్తిపై మనకు అనుమానాలు ఉండచ్చు . కానీ వారి జీవితంపై మనకు అభ్యంతరాలు ఉండకూడదనేదే ఇక్కడ వారి ఐడియా కావచ్చు. ఇంతకీ ఈ మ్యాగజైన్ పేరు ఏమిటి అంటారా.. ‘డాక్సీ’.
సాధారణంగా సెక్స్ వర్కర్ల కోసం స్పెషల్ మ్యాగజైన్ అనగానే మనందరి ఊహలో ముందుగా ఏం వస్తుంది? అదే ఈ ‘డాక్సీ’ మ్యాగజైన్ లోనూ ఉంటుందని అనుకుంటే.. మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఈ మ్యాగజైన్ వెనుక ఉన్న కథ, దాని పేజీల్లో కనిపించేదానికంటే ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఇందులో ఏం ఉంది?
న్యూయార్క్‌లోని ‘ది స్లిప్పర్ రూమ్’లో జరిగిన ఓ కార్యక్రమంతో ఈ కథ మొదలైంది. అక్కడికి ఒక్కరిద్దరు కాదు.. ఈ రంగానికి చెందిన ఎంతోమంది మహిళలు వచ్చారు. పోర్న్‌స్టార్లు, స్ట్రిప్పర్లు, ఎస్కార్ట్‌లు, డామినాట్రిక్సులు, ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్లు.. ఇలా వేర్వేరు ప్రపంచాలకు చెందిన వాళ్లంతా ఒకే చోట కనిపించారు.
అసలు వాళ్లందరినీ అక్కడికి తీసుకొచ్చింది ఏంటి?
అదే ‘డాక్సీ’. ఇటీవల ఈ మ్యాగజైన్ మూడో సంచిక విడుదలైంది. కానీ ఇది మరో అడల్ట్ మ్యాగజైన్ అనుకుంటే.. కథ అక్కడితో ఆగిపోతుంది. ఈ మ్యాగజైన్ మొదటి పేజీ దగ్గరే మన ఊహ మొత్తం మారుతుంది
డాక్సీ పేజీల్లోకి వెళ్లగానే సాధారణంగా ప్లే బోయ్ తరహా పత్రికల్లో కనిపించే నగ్న పిన్-అప్ ఫొటోలు కనిపించవు. ఆకర్షణీయమైన ఫొటోగ్రఫీ ఉంటుంది. ఎరోటికా కూడా ఉంటుంది. కానీ మ్యాగజైన్ దృష్టి అంతా శరీరంపైనే ఉండదు.
మరి దేని గురించి ఉంటుంది?
ఇందులో కేవలం వాళ్ల పర్శనల్ లైఫ్ గురించి, దాని గురించి చెప్పే వారి మాటలపై.ఇంటర్వ్యూలు, వ్యక్తిగత వ్యాసాలు, పెయింటింగ్స్, జ్యోతిష్యం, ఎరోటికా.. ఇలా రకరకాల కంటెంట్‌తో డాక్సీని ఒక లిటరరీ మ్యాగజైన్‌లా రూపొందించారు.
ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది.
సెక్స్ వర్కర్ల గురించి బయటివాళ్లు రాసిన కథలు కాదు ఇవి. ఈ రంగంలో ఉన్నవాళ్లే తమ గురించి తాము మాట్లాడుతున్నారు.
ఎందుకింత అవసరం వచ్చింది?
సెక్స్ వర్క్ అనేది ఇప్పుడు పాప్ కల్చర్‌లో కొత్త విషయం కాదు. సినిమాలు, సిరీస్‌లు, సోషల్ మీడియా.. ఎక్కడ చూసినా ఈ అంశంపై చర్చ కనిపిస్తోంది. అయితే డాక్సీ ఎడిటర్ సెలీనా రెబోయిరాస్కు ఈ పాయింట్ దగ్గరే సందేహం వచ్చింది.
ఈ కథలు చెబుతున్నది ఎవరు?
సెక్స్ వర్క్ గురించి మాట్లాడేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఆ అనుభవం లేని వాళ్లు ఆ ప్రపంచాన్ని తమకు ఊహించినట్టుగా చెప్పడం వేరు. అందులోనే అసలు సమస్య ఉందని ఆమె భావిస్తున్నారు.
అందుకే డాక్సీ వాళ్లకే మైక్ ఇచ్చింది.
‘వాళ్లు’ కాదు.. ‘మనలో వాళ్లు’ సమాజంలో సెక్స్ వర్కర్లను చూసే విధానం కూడా ఈ మ్యాగజైన్ టార్గెట్ చేస్తున్న అంశాల్లో ఒకటి. ఒక వైపు వారిని బాధితులుగా చూస్తారు. మరోవైపు వారి వృత్తినే వారి పూర్తి గుర్తింపుగా మార్చేస్తారు.
ఈ రెండు మధ్యలో ఉన్న అసలు మనిషి ఎక్కడ?
డాక్సీ ఆ ఖాళీని చూపించాలనుకుంటోంది. వాళ్లకు కూడా వ్యక్తిగత కథలు ఉన్నాయి. అభిప్రాయాలు ఉన్నాయి. కలలు ఉన్నాయి. ఇష్టాలు, అయిష్టాలు ఉన్నాయి. తమ వృత్తికి అతీతంగా కూడా ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని చూపించడమే మ్యాగజైన్ అసలు ప్రయత్నం.
ఇంతకీ ‘డాక్సీ’ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది?
18వ శతాబ్దంలో సెక్స్ వర్కర్‌ను సూచించేందుకు ఉపయోగించిన ఒక స్లాంగ్ నుంచి ఈ పేరు వచ్చింది. అంతే కాదు.. ఈ పేరు మరో విషయాన్ని కూడా గుర్తుకు తెస్తుంది. Doxycycline అనే యాంటీబయాటిక్‌కు ‘Doxy’ అనే సంక్షిప్త రూపం వాడతారు. కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధుల చికిత్సలో ఈ మందును ఉపయోగిస్తారు.
అసలు వాళ్లను ఆపేది ఎవరు?
సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్‌కు సంబంధించిన నిబంధనలు కఠినంగానే ఉంటాయి. అయితే డాక్సీతో మాట్లాడిన కొందరి అనుభవం ప్రకారం.. సమస్య స్పష్టమైన కంటెంట్‌తో మాత్రమే ఆగిపోదు. సెక్స్ వర్క్ పరిశ్రమ గురించి సమాచారాన్ని పంచుకున్నా, ఆ రంగంలోని ప్రయోజనాలు–నష్టాల గురించి మాట్లాడినా కంటెంట్ సెన్సార్ అవుతుందని ఆరి కిట్స్యా చెబుతున్నారు. ఇదే కారణంగా సెన్సార్షిప్ డాక్సీలో పదేపదే కనిపించే అంశంగా మారింది.
‘స్ట్రిప్పర్ న్యూస్’ అనే న్యూస్‌లెటర్ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి బ్యాన్ కావడం తమ పని, గుర్తింపు, విజిబిలిటీపై ఎలా ప్రభావం చూపిందో మ్యాగజైన్లో చర్చించింది. అంటే సమస్య కేవలం “ఏం పోస్ట్ చేయొచ్చు?” అన్నదే కాదు. “మా గురించి మేము మాట్లాడుకోవచ్చా?” అన్న విషయం గురించి కూడా.
ఆన్లైన్లో ఒక సమస్య.. బయట మరోటి
సోషల్ మీడియా ఒక రకం సమస్యలు అయితే.. నిజ జీవితంలో మరో రకమైన అడ్డంకులు ఉన్నాయని ఈ రంగంలోని మహిళలు చెబుతున్నారు. బ్యాంకులు, ఇళ్లు అద్దెకు తీసుకోవడం వంటి సాధారణ విషయాల్లో కూడా వివక్షను ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు.
మ్యాగజైన్ ఐడియా ఎలా వచ్చింది
వివక్ష ఎదుర్కొంటున్న సమయంలోనే ఒక ఆలోచన వచ్చింది. ఇతరుల ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం ఎందుకు? మనకంటూ మనమే ప్లాట్‌ఫామ్‌లు నిర్మించుకుంటే? అదే ఆలోచనతో కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి.
‘Hidden’.. మరో ప్రయోగం
డాక్సీ కవర్‌పై కనిపించే ఆరి కిట్స్యా కూడా ఈ మార్పులో భాగమే. ఆమె అడల్ట్ కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు. లానా రోడ్స్, స్టెల్లా బేరీతో కలిసి ‘Hidden’ అనే 18+ ప్లాట్‌ఫామ్‌ను నడుపుతున్నారు. దీని వెనుక ఉన్న ఆలోచన కూడా సింపుల్‌గానే మొదలైంది. క్రియేటర్ల కోసం ఉన్న ప్లాట్‌ఫామ్‌లలో చాలాసార్లు యూజర్ అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కంటెంట్ సృష్టించే వాళ్లు మాత్రం తర్వాతి స్థానంలో మిగిలిపోతారు. ఆ అసంతృప్తి నుంచే Hidden వచ్చింది. వాళ్లు దీన్ని సెక్స్ వర్కర్లకు మరింత అనుకూలంగా ఉండే ప్లాట్‌ఫామ్‌గా చూస్తున్నారు.
డాక్సీ మూడో సంచిక విడుదలైన రాత్రి మరో ఆసక్తికరమైన విషయం జరిగింది.
వేర్వేరు రకాల సెక్స్ వర్కర్లు ఒకే వేదికపైకి వచ్చారు. సాధారణంగా వేర్వేరు విభాగాలుగా కనిపించే ఈ ప్రపంచాలు ఆ రాత్రి మాత్రం ఒకే చోట కలిశాయి. స్ట్రిప్పర్లు, పోర్న్‌స్టార్లు, పోల్ డ్యాన్సర్లు, షుగర్ బేబీలు, ఆన్లైన్ క్రియేటర్లు, డామినాట్రిక్సులు, ఎస్కార్ట్‌లు.. అందరూ అక్కడే. అంతేకాదు.. బ్రూక్లిన్‌లోని ప్రముఖ స్ట్రిప్ క్లబ్ ‘పంప్స్’ ఆ రాత్రి దాదాపు ఖాళీగా ఉందని రెబోయిరాస్ సరదాగా చెప్పారు. కారణం.. అక్కడి అమ్మాయిలంతా డాక్సీ లాంచ్‌కు రావడమే.
స్టెల్లా బేరీ అక్కడ 90ల నాటి ‘Defending Pornography’ పుస్తకం నుంచి కొన్ని వాక్యాలు చదివి వినిపించారు. ఆ తర్వాత ‘ది జీ-స్ట్రింగ్స్’ బర్లెస్క్ బృందం ప్రదర్శన ఇచ్చింది. ఒక మ్యాగజైన్ లాంచ్ కంటే.. ఒక కమ్యూనిటీ కలిసిన రాత్రిలా అది కనిపించింది.
మరి అసలు డాక్సీ ఏం మార్చాలనుకుంటోంది?
బయటి ప్రపంచం తమ గురించి ఏం అనుకుంటుందో మార్చడం ఒక్కటే లక్ష్యం కాదు. తమ కథను తామే చెప్పుకోవాలి. తమకు నచ్చిన వేదికను తామే నిర్మించుకోవాలి.
సినిమా, మ్యూజిక్ వంటి రంగాలు ఇప్పటికే భారీ కార్పొరేట్ వ్యవస్థల్లో భాగమయ్యాయి. కానీ సెక్స్ వర్క్ రంగం ఇంకా పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లలేదు. ఆ ఖాళీని తమకు అనుకూలంగా మార్చుకోవాలని డాక్సీ వెనుక ఉన్నవాళ్లు భావిస్తున్నారు.
స్టెల్లా బేరీ మాటల్లో చెప్పాలంటే.. ఇది ఇంకా ఒక రకమైన ‘వైల్డ్ వెస్ట్’. కానీ ఈసారి ఆ వైల్డ్ వెస్ట్‌లోకి అడుగుపెడుతున్నది.. తమ గురించి తామే మాట్లాడుకోవాలనుకునే, తమ సొంత మీడియాను నిర్మించుకోవాలనుకునే మరింత ఆర్థికంగా శక్తిమంతమైన మహిళలు.
అందుకే డాక్సీని కేవలం ‘సెక్స్ వర్కర్ల కోసం వచ్చిన మ్యాగజైన్’ గా చూస్తే.. దాని అసలు కథలో సగం మాత్రమే కనిపిస్తుంది. మరి మిగిలిన సగం? తమ గురించి ఎవరు మాట్లాడాలి అనే నిర్ణయం.. ఇక తామే తీసుకోవాలనుకుంటున్న ఒక సమూహం కథ.








