హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ నగరాన్ని బ్లూ సిటీ (Blue City), గ్రీన్ సిటీ (Green City)గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లును తెలంగాణ శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లో రవాణా కోసం కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ చేశామని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) విస్తరణ పెద్దఎత్తున జరుగుతోందని, రాబోయే 30 ఏళ్ల అవసరాల దృష్ట్యా మరింత సమర్థంగా పాలన కోసం క్యూర్ చట్టం రూపొందించామని చెప్పారు.
మూసీ పునరుజ్జీవం తొలిదశకు రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇచ్చాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం. జీహెచ్ఎంసీ (GHMC)ని ట్రై కార్పొరేషన్లుగా విభజించుకున్నాం. అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేసేలా చట్టబద్ధ వ్యవస్థను రూపొందించాం. సీఎం అధ్యక్షతన క్యూర్ అత్యున్నత పాలకమండలిని ఏర్పాటుచేస్తున్నాం. మహానగరపాలిక చట్టంలో సెక్షన్లు తగ్గించే ప్రణాళిక. మురుగునీటిని శుద్ధి చేసి చెట్ల పెంపకం, కాలుష్య నివారణకు వాడాలని ప్రభుత్వ యోచన. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ రూపొందించుకుని ముందుకెళ్తున్నాం. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచ నగరాలతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ ఎదగాలి. పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించే స్థాయికి మనం చేరుకోవాలి. హైదరాబాద్ గత వైభవాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయాలి అని మంత్రి తెలిపారు.








