ఆంధ్రా లో చదువుకుని.. AIకి రూ.190 కోట్ల విరాళం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
చదువుకుని ఎదగటం , గొప్పగా తాము స్దిరపడటం వేరు, తమ తర్వాత తరం వారి బాగుని సైతం కోరుతూ సాయం చేయటం వేరు.తమకు విద్యతో దొరికిన అవకాశాలను తమ దగ్గరే ఆపేయకుండా.. అవే అవకాశాలు మరెందరికో దక్కేలా చేయడం నిజమైన గొప్పతనం. అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులు వికాస్, అనురాధ సిన్హా ఇప్పుడు అదే చేశారు.
తాము చదువుకుని జీవితాన్ని మార్చుకున్న అమెరికా యూనివర్సిటీకే ఏకంగా 20 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.190 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బుతో భవిష్యత్తును ప్రభావితం చేయబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్డ్ అనలిటిక్స్ రంగాల్లో విద్య, పరిశోధనకు ప్రత్యేక కాలేజీని ఏర్పాటు చేయిస్తున్నారు. రాబోయే రోజుల్లో AI ప్రపంచాన్ని నడిపించే నిపుణులను తయారు చేయాలనే వారి ఆలోచనగా చెప్తున్నారు.
ఎవరు వీళ్లు
అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న వికాస్, అనురాధ సిన్హాల కథను తెలుసుకుంటే.. ఈ రూ.167 కోట్ల విరాళం వెనుక ఉన్న అసలు విలువ అర్థమవుతుంది.
వీళ్ల ప్రయాణం అమెరికాలో మొదలైంది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్న ఈ దంపతులు.. ఆ తర్వాత కర్నూలులోని G. Pulla Reddy Engineering Collegeలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మంచి భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో అమెరికా వెళ్లారు.
అక్కడ Florida Atlantic Universityలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు పూర్తి చేశారు. వికాస్ తన విద్యా ప్రయాణాన్ని అక్కడితో ఆపలేదు. Northwestern Universityలో చదువును కొనసాగించారు. చివరకు తనకు ఇప్పుడు కోట్ల రూపాయల విరాళం అందించిన University of North Texas నుంచే 2023లో PhD పూర్తి చేశారు.
అంటే.. ఒకప్పుడు ఈ యూనివర్సిటీకి విద్యార్థిగా వెళ్లిన వ్యక్తే.. ఇప్పుడు అదే యూనివర్సిటీ భవిష్యత్తును మార్చే స్థాయిలో దాతగా నిలిచారు.
ప్రస్తుతం వికాస్ సిన్హా Broadcomలో Mainframe Software Division Vice Presidentగా పనిచేస్తున్నారు. 2023 నుంచి UNT College of Information Leadership Boardలో కూడా సభ్యుడిగా ఉన్నారు.
మరో ఇంట్రస్టింగ్ విషయం
రూ.167 కోట్ల విరాళం ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. UNTతో వారి అనుబంధం ఇప్పటికే ఎన్నో దశల్లో పెరిగింది. 2024లోనే సిన్హా దంపతులు Data Science Department ఏర్పాటుకు విరాళం ఇచ్చారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, అధ్యాపకుల సహాయం, పరిశోధన కార్యక్రమాల కోసం నిధులు అందించారు.
అంతటితో ఆగలేదు. 2025లో Sinha Innovation Lab for Data Scienceను ఏర్పాటు చేసేందుకు మరో భారీ సహకారం అందించారు. ఇప్పుడు 2026లో AI, Advanced Analytics కోసం ఏకంగా 20 మిలియన్ డాలర్లు ఇచ్చారు.
ఇక్కడే వారి ఆలోచనలోని మరో కోణం కనిపిస్తుంది.
వికాస్ సిన్హా చెప్పినట్లుగా.. విద్య తమ జీవితాల్లో ఎన్నో తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆ తలుపులు మరెందరికో తెరిచి ఉంచాలనుకుంటున్నారు. అమెరికాకు చదువుకోవడానికి మరో దేశం నుంచి వచ్చినప్పుడు తమలో ఉన్న ఆశ, లక్ష్యం, నమ్మకం.. ఇప్పుడు అదే కలతో అమెరికాకు వస్తున్న మరో విద్యార్థిలోనూ కనిపిస్తుందని వారు చెబుతున్నారు.
అందుకే ఈ విరాళం కేవలం తమకు చదువు చెప్పిన సంస్థకు ఇచ్చిన కృతజ్ఞత కాదు. తమకు దక్కిన అవకాశాన్ని.. తమ తర్వాతి తరానికి అందించే ప్రయత్నం అని వివరిస్తున్నారు. వికాస్ సిన్హా మాటల్లోనే చెప్పాలంటే.. వలసదారులు అమెరికన్ డ్రీమ్‌లో కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. ఆ కలను నిర్మించడంలో కూడా భాగస్వాములే.
ఇక ఈ రూ.167 కోట్లతో ఏర్పడే కొత్త కాలేజీ కూడా వారి ఆలోచనకు తగ్గట్టుగానే ఉండబోతోంది. AIని కేవలం ఉపయోగించే ఉద్యోగులను తయారు చేయడం కాదు.. AIని నిర్మించే వాళ్లు, దాని ప్రభావాన్ని అర్థం చేసుకునే వాళ్లు, దాన్ని ప్రశ్నించే వాళ్లు, నియంత్రించే వాళ్లు, బాధ్యతాయుతంగా ఉపయోగించే వాళ్లను తయారు చేయడం ఈ కాలేజీ లక్ష్యం.
అందుకే కర్నూలులో మొదలైన ఒక విద్యా ప్రయాణం.. ఇప్పుడు అమెరికాలోని AI భవిష్యత్తుపై ప్రభావం చూపించే స్థాయికి చేరుకుంది.
తాము చదువుకుని ఎదిగారు. స్థిరపడ్డారు. కానీ తమ ప్రయాణాన్ని అక్కడితో ముగించలేదు తమకు తెరిచిన విద్యా తలుపులను.. మరొక తరం కోసం తెరిచి ఉంచారు.








