నిజం: మన సినిమా.. పాకిస్థాన్ దేశభక్తి! చివరికి బ్యాన్
ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేస్తూంటారు. కొన్ని సార్లు పాయింట్ ఎత్తేసి కాపీ కొడుతూంటారు. అలాగే హాలీవుడ్ సినిమాలను మన వాళ్ళు ఇక్కడ నేటివిటికి పూర్తిగా మార్చి కొత్త కథలా ప్రెజెంట్ చేస్తూంటారు. చూసిన వాళ్లు అరే..ఇది ఫలానా సినిమా కాపీ కదరా అనుకుంటూంటారు. ఇదంతా రొటీన్ గా జరిగే వ్యవహారం.
అయితే మన దేశభక్తి సినిమాను, అందులోని సూపర్ హిట్ దేశభక్తి పూరిత పాటలను యథాతథంగా ఎత్తేసి… తమ సొంత దేశభక్తి సినిమాగా మార్చుకుని ఒక దేశం ప్రదర్శించుకోవడం ఎప్పుడైనా విన్నారా? సరిగ్గా ఇలాంటి విచిత్రమైన ఉదంతమే 1950ల కాలంలో పాకిస్థాన్‌లో జరిగింది.
1956లో అక్కడ ‘బెదారీ’ అనే ఒక కొత్త సినిమా విడుదలైంది. థియేటర్లలో బొమ్మ పడగానే జనాలు గుంపులు గుంపులుగా ఎగబడ్డారు.పెద్ద హిట్ చేసారు. ముఖ్యంగా అందులో సలీమ్ రజా పాడిన “ఆవో బచ్చో సేర్ కరాయేన్ తుమ్కో పాకిస్థాన్ కీ” అనే పాట వింటూ ప్రతి పాకిస్థానీ ఒళ్లు పులకరించిపోయి, దేశభక్తితో మురిసిపోయారు. వసూళ్ల వర్షం కురుస్తుండటంతో నిర్మాతలు కూడా సంబరపడిపోయారు.
బయటపడ్డ బండారం
అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. సినిమా చూసి బయటకొచ్చిన కొందరు ప్రేక్షకులకు మెల్లగా అనుమానం రావడం మొదలైంది. ఏంటబ్బా… ఈ సీన్లు, ఈ డ్రామా, ఈ పాటల ట్యూన్లు ఎక్కడో చూసినట్టు, ఇంతకు ముందు విన్నట్లు ఉన్నాయే అని ఆలోచనలో పడ్డారు. కొద్దిరోజుల్లోనే అసలు నిజం బయటపడటంతో పాకిస్థాన్ సినీ పరిశ్రమ దిమ్మతిరిగిపోయే నిజం బయిటపడింది. ఆ సినిమా మరేదో కాదు… 1954లో భారత్‌లో వచ్చి సూపర్‌హిట్ అయిన మన హిందీ చిత్రం ‘జాగృతి’కి అచ్చమైన సీన్-టు-సీన్ కార్బన్ కాపీ!
ఇంతకీ జాగృతి కథేంటి?
ఇంతలా కాపీ కొట్టడానికి అసలు మన ‘జాగృతి’లో ఏముంది? అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇందులో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ ఉండరు. అభయ్ అనే ఒక తుంటరి కుర్రాడు చదువు సంధ్యలు పక్కనబెట్టి తిరుగుతుంటే, కంటికి రెప్పలా చూసుకునే ఇంట్లో వాళ్లు విసిగిపోయి క్రమశిక్షణ వస్తుందని ఒక బోర్డింగ్ స్కూళ్లో పడేస్తారు. అక్కడ శేఖర్ అనే మాస్టారు పాతకాలపు దెబ్బల భయం చూపించకుండా, ప్రేమతో పిల్లలను దారిలోకి తెస్తుంటారు.
అదే స్కూళ్లో శక్తి అనే ఒక దివ్యాంగ కుర్రాడు అభయ్‌తో స్నేహం చేసి, అతనిలోని మంచిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో శక్తి చనిపోతాడు. ప్రాణస్నేహితుడి మరణం, మాస్టారి ఆత్మీయమైన బోధనలు అభయ్ మనసును పూర్తిగా మార్చేస్తాయి. ఈ గుండెలను పిండేసే కథే అప్పట్లో భారతీయ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
రెండు దేశాలు.. ఒకే నటుడు
ఈ మొత్తం సినిమా చోరీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. దానికి సూత్రధారి రతన్ కుమార్ అనే బాలనటుడు. మన బొంబాయి సినీ పరిశ్రమలో ‘బూట్ పాలిష్’, ‘బైజూ బావ్రా’ వంటి చిత్రాలతో అప్పట్లో అతను తిరుగులేని చైల్డ్ ఆర్టిస్ట్. ‘జాగృతి’లో దివ్యాంగుడైన శక్తి పాత్రలో నటించింది కూడా అతనే.
అయితే దేశ విభజన తర్వాత ఆయన బంధువులంతా పాకిస్థాన్ వెళ్లడంతో, రతన్ కుమార్ కుటుంబం కూడా భారత్ వదిలి అక్కడికి వెళ్ళిపోయింది. పాకిస్థాన్ వెళ్లాక ఈ బాల నటుడి అన్నయ్య ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టి, తమ్ముడికి గుర్తింపు తీసుకురావడానికి ‘బెదారీ’ సినిమాను మొదలుపెట్టారు.
దానికి కథ వేరేది కాకుండా, తమ్ముడు ఇండియాలో నటించి సూపర్ హిట్ కొట్టిన ‘జాగృతి’నే ఎంచుకుని, అచ్చు గుద్దినట్టు ఏదీ వదలకుండా ఉన్నది ఉన్నట్లు దింపేశారు. విశేషమేమిటంటే… రతన్ కుమార్ ‘జాగృతి’లో ఏ పాత్రలైతే చేసారో, పాకిస్థాన్ ‘బెదారీ’లో కూడా అవే పాత్రలు వేసి ఆశ్చర్యపరిచారు.
గాంధీ స్థానంలో జిన్నా.. వందేమాతరం బదులు పాకిస్థాన్ జిందాబాద్
కథను కాపీ కొడితే ఒకెత్తు, కానీ పాటలను దొంగిలించిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వు రాక మానదు. మన సినిమాలో శచిన్ దేవ్ బర్మన్ స్వరపరిచిన అద్భుతమైన ట్యూన్లను అలాగే ఉంచేసి, లిరిక్స్ మాత్రం మార్చేశారు. మన దేశభక్తిని సూచించే పదాలను తీసేసి, పాకిస్థాన్ దేశభక్తి పదాలతో మార్పులు చేసారు.
ఉదాహరణకు, జాగృతిలోని ఐకానిక్ సాంగ్ “ఆవో బచ్చో తుమ్హే దిఖాయేన్ ఝాంకీ హిందుస్తాన్ కీ” అనే పంక్తిని “ఆవో బచ్చో సేర్ కరాయేన్ తుమ్కో పాకిస్థాన్ కీ”గా మార్చారు. మన పాటలో వచ్చే “వందే మాతరం” స్థానంలో ఏకంగా “పాకిస్థాన్ జిందాబాద్” అని రాసుకున్నారు.
ఇంకో పాటలోనైతే మరీ ఆశ్చర్యం! మన పాటలోని – “దే దీ హుమే ఆజాదీ బినా ఖడ్గ్ బినా ఢాల్, సాబర్మతీ కే సంత్ తూనే కర్ దియా కమాల్” అనే పంక్తుల్లోని సాబర్మతీ సంత్ (మహాత్మా గాంధీ) ప్రస్తావనను తీసేసి… “దే దీ హుమే ఆజాదీ కీ దునియా హుయీ హైరాన్, ఏ క్వాయిద్-ఎ-ఆజమ్ తేరా ఎహ్సాన్ హై ఎహ్సాన్” అని మహమ్మద్ అలీ జిన్నా పేరును తీసుకొచ్చిపెట్టారు. మ్యూజిక్ అంతా మనదే, కేవలం సాహిత్యం మాత్రమే వాళ్లది అన్నమాట!
ధైర్యంగా ఎలా విడుదల చేయగలిగారు?
అంతలా యాజటీజ్ ఇండియన్ సినిమాను దించేసినా మొదట్లో ఎవరూ గుర్తుపట్టకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ రోజుల్లో పాకిస్థాన్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై కఠినమైన నిషేధం ఉండేది. మన సినిమాలు అక్కడ థియేటర్లలో వచ్చేవి కావు కాబట్టి జనాలు గుర్తుపట్టలేరులే అని లాహోర్ నిర్మాతలు భావించారు. ఆ విషయాన్నే పాకిస్థాన్ సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు ఒకరు ‘డాన్’ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒప్పుకున్నారు. భారతీయ సినిమాల నిషేధాన్ని ఆసరాగా చేసుకుని అక్కడి నిర్మాతలు ఈ ‘జాగృతి’ సినిమాను, పాటలను కార్బన్ కాపీ కొట్టి విడుదల చేశారని ఆయన చెప్పారు. ఇదే దారిలో మరికొన్ని సినిమాలు కూడా వెళ్లాయట అప్పట్లో.
థియేటర్ల ముందు గొడవలు.. ఆపై ఘోరమైన బ్యాన్
మొదట్లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా రంగు త్వరలోనే బయటపడింది. తాము చూసి మురిసిపోతున్నది సొంత దేశపు సినిమా కాదని, ఇండియా నుంచి దొంగిలించిన కాపీ సినిమా అని తెలిసేసరికి పాకిస్థాన్ ప్రేక్షకులకు పీక్స్ లో కోపం వచ్చింది. థియేటర్ల ముందు భారీ ఎత్తున నిరసనలు జరిపి గొడవలకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే ఆ సినిమాను, దాని పాటలను దేశమంతటా నిషేధించింది.
విచిత్రమేమిటంటే… దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ జాతీయ టెలివిజన్ (PTV) ఈ సినిమాలోని ఒక పాటను తమ ఛానెల్ గీతంగా వాడటం ప్రారంభించింది. తీరా అది కూడా ఇండియా నుంచి కొట్టేసిన ట్యూనే అని మళ్లీ వివాదం రేగడంతో, పిటీవీ ఆ పాటను ప్రసారం చేయడం నిలిపివేయాల్సి వచ్చింది.
చరిత్రలో నిలిచిన ఒరిజినల్ క్లాసిక్
కాపీ కొట్టిన పాకిస్థాన్ సినిమా అవమానకరంగా నిషేధానికి గురై మూలనపడితే, ఒరిజినల్ హిందీ చిత్రం ‘జాగృతి’ మాత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక అమరకావ్యంగా నిలిచింది. ఫిల్మిస్తాన్ నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయంతో పాటు ‘ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్’గా జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది.
2016లో జరిగిన 70వ స్వాతంత్ర్య దినోత్సవ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించి సత్కరించారు. ఈనాటికీ అందులోని “ఆవో బచ్చో తుమ్హే దిఖాయేన్”, “హమ్ లాయే హైం తూఫాన్ సే” వంటి పాటలు ప్రతి ఆగస్టు 15, జనవరి 26న మన దేశంలో సగర్వంగా మారుమోగుతూనే ఉన్నాయి.








