అక్రమాలుంటే ఆధారాలు చూపండి .. వైసీపీ నేతలకు ఎంపీ శివనాథ్ సవాల్
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు(YCP leaders), అందుకు తగ్గ ఆధారాలు బయటపెట్టాలని ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) సవాల్ చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన వేముల రామకృష్ణ (Vemula Ramakrishna) డీఎస్సీలో అక్రమంగా ఉద్యోగం సాధించారంటూ వైసీపీ అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు ప్రచారం చేశారని, అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. రామకృష్ణ ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న విషయమే అందుకు నిదర్శమని తెలిపారు.
ఇటీవల ఓ మహిళా టీవీ చర్చా కార్యక్రమంలో తాను ఉపాధ్యాయ పోస్టును రూ.15 లక్షలకు కొనుగోలు చేసి, ఉద్యోగం చేస్తున్నట్లు ఆరోపణలు చేయడం బాధాకరమని వేముల రామకృష్ణ తెలిపారు. డీఎస్సీ(DSC)లో తాను క్యాలిఫై కాలేదని, తనకు ప్రభుత్వ ఉద్యోగం (Government job) కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెబుతున్న మీరు, అందుకు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, ప్రస్తుతం తాను ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.








