చర్చి 50 ఏళ్ల పాటు దాచేసిన సినిమా… ఇప్పుడు రిలీజ్, ప్రశంసలు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఓ సినిమా షూటింగ్ పూర్తయ్యాక బిజినెస్ కోసం ఎదురుచూస్తుంది. ఈరోజుల్లో అయితే ఓటిటి బిజినెస్ కోసం వెయిట్ చేయచ్చు. ఏదైమైనా కొద్ది నెలలు, మహా అయితే ఏదైనా ఫైనాన్సియల్ సమస్యలు ఉంటే మరికొద్ది కాలం రిలీజ్ ఆగచ్చు. అలా కాకుండా నిర్మాత ఈ సినిమా రిలీజ్ చేస్తే వేస్ట్ అనుకుంటే ఆగిపోవచ్చు. సెన్సార్ సమస్యలతో కొన్ని సినిమాలు ల్యాబ్ లలో మగ్గినవి ఉన్నాయి. అలాకాకుండా ఇప్పుడు చెప్పిన ఏ కారణం లేకుండా ఓ సినిమాని దాన్ని నిర్మించిన చర్చి..యాభై ఏళ్లపాటు రిలీజ్ ఆపేసిందంటే..కారణం ఏమై ఉండచ్చు. అసలేం జరిగింది.. ఆ సినిమా ఏమిటి. దాని కథేంటి..
సినిమా మొదలైంది ఇలా..
1973లో అమెరికాలోని పిట్స్బర్గ్కు చెందిన చర్చికి అనుబంధమైన సంస్ద Lutheran Service Society of Western Pennsylvania. ఈ సంస్ద వృద్ధుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ. దాంతో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక విద్యా చిత్రాన్ని రూపొందించాలని భావించింది.
అందుకోసం అప్పటికే Night of the Living Deadతో పేరు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు జార్జ్ రొమెరోను సంప్రదించింది. వృద్ధులపై చూపుతున్న నిర్లక్ష్యం, దుర్వినియోగం, వయో వివక్ష గురించి అవగాహన కల్పించే సినిమా తీయమని క్లియర్ గా కోరింది. తామే పెట్టుబడి పెడతాను అంది. అలా సుమారు 37 వేల డాలర్ల బడ్జెట్తో, కేవలం మూడు రోజుల్లో షూటింగ్ పూర్తయింది. పిట్స్బర్గ్లోని అప్పటి West View Parkలో చిత్రీకరణ జరిగింది.
సినిమా పూర్తయ్యాక ఆ సంస్ద వారు ఆ సినిమాని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే రొమెరో వాళ్లు కోరినట్లుగా సాధారణ అవగాహనా చిత్రాన్ని తీయలేదు. వృద్ధాప్యం, ఒంటరితనం, నిర్లక్ష్యం, సామాజిక వివక్షను ఒక భయానక అనుభవంలా చూపిస్తూ సినిమా తీసాడు.
సినిమా కథ ఏంటి?
ఆ సినిమా పేరు The Amusement Park. లింకన్ మాజెల్ పోషించిన ఓ వృద్ధుడు వినోద పార్కులోకి అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. బయటికి చూస్తే అక్కడ రైడ్లు, సంగీతం, సందడి అన్నీ కనిపిస్తాయి. కానీ క్రమంగా ఆ పార్క్ వృద్ధులకు వ్యతిరేకంగా పనిచేసే సమాజానికి ప్రతీకగా మారుతుంది. వృద్ధుల వయసు, ఆరోగ్యం, ఆదాయం ఆధారంగా వారికి ఎదురయ్యే అవమానాలు, నిర్లక్ష్యం, దోపిడీని రొమెరో చూపిస్తాడు.
ఒక వృద్ధుడు బంపర్ కార్లకు వెళ్లే ముందు కంటి పరీక్షలో విఫలమవుతాడు. మరో సందర్భంలో టికెట్ల కోసం కుటుంబ వారసత్వ వస్తువులను వదులుకోవాల్సి వస్తుంది.
అంటే ఇక్కడ భయపెట్టేది దెయ్యాలు కాదు. మనుషులే. అందుకే The Amusement Park సాధారణ హారర్ సినిమా కాకుండా ఒక సామాజిక హారర్ గా నిలిచింది.
చర్చి ఎందుకు వెనక్కి తగ్గింది?
సంస్థ కోరుకున్నది వృద్ధుల సమస్యలను వివరించే అవగాహనా చిత్రం. రొమెరో మాత్రం ప్రేక్షకుడు ఆ సమస్యను స్వయంగా అనుభవించేలా సినిమా తీశాడు.
సినిమాలో వృద్ధుడిని సమాజం ఎలా పక్కకు నెడుతుందో, అతని గౌరవం ఎలా కోల్పోతుందో, చివరకు అతను ఎలా ఒంటరిగా మిగిలిపోతాడో చాలా తీవ్రంగా చూపించారు.
రొమెరో భార్య సుజాన్ డెష్రోషెర్-రొమెరో తర్వాత చెప్పిన ప్రకారం, Lutheran Societyకి సినిమా తాము ఊహించిన దానికంటే చాలా ఎడ్జీగా, అసౌకర్యం కలిగించేలా అనిపించింది. దాంతో సినిమా విడుదల కాలేదు.
50 ఏళ్ల తర్వాత సినిమా ఎలా బయటపడింది?
కాలక్రమంలో The Amusement Park దాదాపు “మిస్సైన ఫిల్మ్” గా మారిపోయింది. అయితే ఊహించని విధంగా 2017లో ఒక 16mm ప్రింట్ బయటపడింది. అది కూడా దెబ్బతిన్న స్థితిలోనే ఉంది. జార్జ్ రొమెరో ఫౌండేషన్, సుజాన్ డెష్రోషెర్-రొమెరో, IndieCollect కలిసి దాన్ని పునరుద్ధరించారు. చివరకు సినిమా 4Kలో రీస్టోర్ అయింది.
ఇప్పుడు రిలీజ్ చేద్దామని…సుజాన్ Lutheran Societyని సంప్రదించినప్పుడు, ఆ సంస్థ దగ్గర సినిమాకు పెట్టుబడి పెట్టినట్టు సరైన రికార్డు కూడా లేదని తేలింది.
చివరకు ఎవరు రిలీజ్ చేశారు?
దాంతో చర్చికు సంభందం లేని సినిమాగా మారింది. ఇప్పుడా డైరెక్టర్ లేరు. ఆ సినిమా ప్రపోజల్ పెట్టి, డబ్బులు ఇచ్చినవారూ లేరు. దాంతో రీస్టోర్ పూర్తయిన తర్వాత హారర్ స్ట్రీమింగ్ సంస్థ Shudder కు ఈ సినిమా హక్కులను ఇచ్చేసారు. అలా 2021 జూన్ 8న The Amusement Park ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అంటే 1973లో ఒక చర్చి సంస్థ కోసం తీసిన సినిమా… దాదాపు ఐదు దశాబ్దాల పాటు కనుమరుగై… చివరకు రొమెరో ఫౌండేషన్, పునరుద్ధరణ టీమ్, Shudder ప్రయత్నాలతో ప్రపంచానికి చేరింది.
అప్పట్లో తిరస్కరించిన సినిమా… ఇప్పుడు ఎందుకు ప్రశంసలు?
ఈ సినిమాకు ప్రత్యేకత దాని వయసులో కాదు. 1973లో రొమెరో తీసిన విధంగా, అందులో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికీ సమాజంలో అలాగే ఉన్నాయి. మార్పు లేదు. ఈ సినిమాలో ప్రధానాంశం. వృద్ధుల వయసు పెరిగిన తర్వాత వారి విలువ తగ్గిపోతుందా? ఆర్థికంగా, శారీరకంగా బలహీనపడిన వారిని సమాజం పక్కకు నెట్టేస్తుందా? ఈ ప్రశ్నలను రొమెరో ఉపన్యాసంలా చెప్పలేదు. ఒక వినోద పార్కును భయంకరమైన ప్రపంచంగా మార్చి ప్రేక్షకుడికే ఆ అనుభవాన్ని ఇచ్చాడు.
అందుకే అప్పట్లో అసౌకర్యం కలిగించిన సినిమా… ఇప్పుడు విమర్శకులను ఆకట్టుకుంటోంది. Rotten Tomatoesలో ఈ సినిమాకు 97 శాతం విమర్శకుల స్కోర్ వచ్చింది.
50 ఏళ్ల క్రితం వృద్ధుల సమస్యలపై అవగాహన కోసం తీసిన సినిమా… ఇప్పుడు సమాజం తన వృద్ధులను ఎలా చూస్తుందో ప్రశ్నించే ఒక ప్రత్యేకమైన హారర్ చిత్రంగా గుర్తింపు పొందుతోంది.
అంటే రొమెరో 1973లో తీసిన సినిమా ప్రపంచానికి చేరడానికి 2021 వరకు పట్టింది. సినిమా దాదాపు ఐదు దశాబ్దాలు దాక్కుంది. కానీ అది చెప్పాలనుకున్న సమస్య మాత్రం ఎక్కడికీ పోలేదు.








