బొత్సాకు బాధా..? భయమా..? కన్నీళ్ళ వెనుక స్టోరీ ఇదే..!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎప్పుడూ గంభీరంగా, కొండలా కనిపించే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కంటతడి పెట్టడం ఇప్పుడు విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా నిర్వహించిన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశంలో ఈ భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా బొత్స కుటుంబానికి కుడి భుజంలా ఉంటూ, జిల్లాలో పార్టీ వ్యవహారాలన్నీ చక్రం తిప్పిన సొంత మేనల్లుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంపై ఈ సమావేశంలో కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
సమావేశంలో పాల్గొన్న స్థానిక నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా మైక్ పట్టుకుని చిన్న శ్రీనుతో తమకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఆయన చేసిన కష్టాన్ని, కలిసి నడిచిన రోజులను కార్యకర్తలు చెప్తుండగా.. పక్కనే కూర్చున్న మేనమామ బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సొంత మేనల్లుడే పార్టీ వీడటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. జిల్లాలో ఇంతకాలం తామంతా ఒకే కుటుంబంగా ఉన్న రోజులను తలుచుకుంటూ అందరి ముందూ కంటతడి పెట్టారు.
బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకోవడంతో గరివిడి వైసీపీ కార్యాలయంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. మేనమామ ఏడుస్తుండటం చూసి సభకు విచ్చేసిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న శ్రీను పార్టీ మారడం వల్ల జిల్లాలో పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతోందని, అయినప్పటికీ బొత్స నాయకత్వంలోనే ముందుకు సాగుతామని కొందరు నేతలు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఏదేమైనా ఎప్పుడూ ఒత్తిడిని తట్టుకునే బొత్స సత్యనారాయణ ఇలా బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై ఉన్న ఆందోళనే కారణమని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.








