ట్రంప్ కొత్త షాక్! అమెరికాలో ఉంటారు… కానీ అమెరికా లెక్కలో ఉండకపోవచ్చు!
మీరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు… పన్నులు కడుతున్నారు… ఇల్లు తీసుకున్నారు… పిల్లలు అక్కడే చదువుతున్నారు. కానీ అమెరికా ప్రభుత్వం చేసే జనగణనలో మాత్రం మీ కుటుంబంలోని కొందరు కనిపించకపోవచ్చు! నమ్మకలేకపోతున్నారా..అయితే ఇది చదవండి.
ట్రంప్ ప్రభుత్వం అమెరికా జనగణన నిబంధనలను సమూలంగా మార్చే ప్రతిపాదన చేసింది. 2030లో జరిగే జనగణనలో అమెరికా పౌరులు, శాశ్వత నివాసితులు అంటే గ్రీన్కార్డ్దారులను మాత్రమే లెక్కించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అక్రమ వలసదారులతో పాటు, అమెరికాలో చట్టబద్ధంగా ఉన్నప్పటికీ తాత్కాలిక హోదాలో ఉన్నవారిని కూడా జనగణన నుంచి మినహాయించే అవకాశం ఉంది.
అంటే H-1B, F-1 వంటి తాత్కాలిక వీసాలపై ఉన్న భారతీయులు కూడా ఈ ప్రతిపాదన పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పటికీ ఫైనల్ రూల్ కాదు. ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరించనుంది. తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
మరి జనగణనలో పేరు లేకపోతే ఏమవుతుంది?
అమెరికాలో జనగణన అంటే ఇంటింటికీ వెళ్లి “ఎంతమంది ఉన్నారు?” అని లెక్కపెట్టడం మాత్రమే కాదు. ఆ సంఖ్య ఆధారంగానే దేశంలోని రాజకీయ, ఆర్థిక శక్తి ని షేర్ చేస్తారు. అంటే వాటాలు వేస్తారు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణన ఆధారంగా అమెరికా ప్రతినిధుల సభలోని 435 స్థానాలను రాష్ట్రాల మధ్య ఎలా పంచాలో నిర్ణయిస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల రూపకల్పనలో కూడా ఈ జనాభా లెక్కలు కీలకంగా ఉంటాయి. అంతేకాదు, ఫెడరల్ ప్రభుత్వ నిధులను వివిధ రాష్ట్రాలు, నగరాలు, ప్రజా సేవలకు కేటాయించడంలోనూ జనాభా గణాంకాలు ఉపయోగపడతాయి.
అందుకే జనాభా లెక్కలో ఒక వ్యక్తిని తీసేయడం అంటే ఒక సంఖ్యను తీసేయడం మాత్రమే కాదు. ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రాంతం రాజకీయంగా, ఆర్థికంగా ఎంత బలంగా కనిపించాలన్న లెక్కను కూడా మార్చడం.
భారతీయులకు ఇక్కడే అసలు సమస్య
ఉదాహరణకి ఒక అమెరికన్ నగరంలో 10 లక్షల మంది నివసిస్తున్నారని అనుకుందాం. అందులో లక్ష మంది తాత్కాలిక వీసాలపై ఉన్నవారు. వారిని జనగణనలో లెక్కించకపోతే, ప్రభుత్వ రికార్డుల్లో ఆ ప్రాంత జనాభా 9 లక్షలుగా కనిపించే అవకాశం ఉంటుంది.
ఆ అంకెను బట్టే ఆ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి? ఎన్ని ప్రభుత్వ నిధులు రావాలి? ఎన్ని పాఠశాలలు అవసరం?, ఎన్ని ఆసుపత్రులు అవసరం?, ప్రజా రవాణా, హౌసింగ్, ఇతర ప్రజా సేవలను ఎంత స్థాయిలో ఏర్పాటు చేయాలి? ఈ నిర్ణయాలు అన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ జనగణనలో చేసే మార్పులు వల్ల ఆ ప్రాంతంలో వాస్తవంగా నివసిస్తున్న వారి సంఖ్యకూ, అధికారిక లెక్కల్లో కనిపించే సంఖ్యకూ తేడా రావచ్చు.
ఇదే కారణంగా జనాభా నిపుణులు, పౌరహక్కుల సంస్థలు ఈ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిక వలస జనాభా ఉన్న రాష్ట్రాలు, నగరాలు రాజకీయ ప్రాతినిధ్యం, ఫెడరల్ నిధుల విషయంలో నష్టపోవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
“అమెరికాలో ఉన్నాం… పన్నులు కూడా కడుతున్నాం కదా?”
అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్న భారతీయులకు సహజంగా వచ్చే ప్రశ్న ఇదే. అవును వారు అమెరికాలో నివసిస్తున్నారు, పనిచేస్తున్నారు, ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. కానీ ప్రభుత్వం జనగణనలో ఎవరిని “అమెరికా జనాభాలో భాగం”గా పరిగణించాలి? అన్నదానిపై ఇప్పుడు కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదిస్తోంది.
ప్రస్తుతం Census Bureau విదేశాల్లో జన్మించిన వారిని వారి ఇమ్మిగ్రేషన్ హోదా ఆధారంగా జనగణన నుంచి తొలగించదు. తాత్కాలిక వలసదారులు, శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, అక్రమ వలసదారులు—అందరూ ప్రస్తుత జనాభా లెక్కల పరిధిలోకి వస్తారు.
ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానాన్నే మార్చాలని చూస్తోంది.
పిల్లల విషయంలో పరిస్థితి వేరుగా ఉండొచ్చు. భారతీయ కుటుంబాలకు ఇది మరో ముఖ్యమైన అంశం. ఉదాహరణకు తల్లిదండ్రులు H-1B లేదా ఇతర తాత్కాలిక వీసాలపై ఉన్నా, వారి పిల్లలు అమెరికాలో జన్మించి అమెరికా పౌరులైతే వారి పరిస్థితి వేరు. ప్రతిపాదనలో అమెరికా పౌరులు జనాభా లెక్కలో ఉంటారు. ఈ లెక్కన ఒకే కుటుంబంలో తల్లిదండ్రుల హోదా, పిల్లల హోదా వేర్వేరుగా ఉండవచ్చు.
అందుకే “భారతీయులను జనగణన నుంచి తొలగిస్తారు” అని మొత్తంగా చెప్పలేము. కానీ ఎవరు పౌరులు, ఎవరు గ్రీన్కార్డ్దారులు, ఎవరు తాత్కాలిక హోదాలో ఉన్నారు అన్నదే కీలకం.
ఇది కేవలం ఇమ్మిగ్రేషన్ విషయం కాదు, అంతకు మించే అని చెప్పాలి. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కానీ తాజా ప్రతిపాదన చట్టబద్ధంగా అమెరికాలో ఉన్న కొంతమంది వలసదారులపైనా జనగణన పరంగా ప్రభావం చూపే దిశగా వెళ్తోంది. ఇదే దీనిని సాధారణ ఇమ్మిగ్రేషన్ విషయం కంటే పెద్ద విషయంగా మారుస్తోంది.
అంతేకాదు, జనగణనలో జాతి, వంశానికి సంబంధించిన ప్రశ్నలను కూడా తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇలాంటి సమాచారం పౌరహక్కుల చట్టాల అమలు, వివక్షను గుర్తించడం, ప్రభుత్వ సేవల ప్రణాళికలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
ఈ ప్రతిపాదనకు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ రాష్ట్రాల్లో రాజకీయ ప్రాతినిధ్యాన్ని కేటాయించేటప్పుడు “ప్రతి రాష్ట్రంలోని మొత్తం వ్యక్తుల సంఖ్య” ను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతుంది. అందులో పౌరులు మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పలేదు. అందుకే ఈ మార్పులు అమల్లోకి వస్తే కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో 2020 జనగణనలో పౌరసత్వ ప్రశ్నను చేర్చే ప్రయత్నం కూడా సుప్రీంకోర్టు అడ్డుకుంది. అప్పటి ప్రభుత్వ వివరణకు తగిన ఆధారం లేదని కోర్టు అభిప్రాయపడింది.
భారతీయులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే
ఇది మీ H-1B రద్దు వార్తకు సంభందించినది కాదు. అలాగే మీ గ్రీన్‌కార్డ్ దరఖాస్తు రద్దు వార్త కాదు. అమెరికాలో మీ ఉద్యోగం వెంటనే పోతుందనే వార్త అసలు కాదు. అమెరికాలో నివసిస్తున్న తాత్కాలిక వీసాదారులను భవిష్యత్తులో అమెరికా జనాభా లెక్కలో ఎలా పరిగణించాలి? అన్న విషయంలో భారీ మార్పు రావచ్చన్న వార్త.
ఆ మార్పు ఒక వ్యక్తి జీవితంలో వెంటనే కనిపించకపోవచ్చు. కానీ లక్షలాది మందిని కలిపి చూస్తే, అది ఏ రాష్ట్రానికి ఎంత రాజకీయ బలం? ఏ ప్రాంతానికి ఎంత ఫెడరల్ డబ్బు? ఏ నగరానికి ఎన్ని ప్రజా సేవలు? అనే ప్రశ్నలపై ప్రభావం చూపవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








