రేసులో బీజేపీ వెనుకబడిందా?
తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. నాలుగు రోజులుగా అసెంబ్లీ లోపల, బయట చోటుచేసుకుంటున్న హైవోల్టేజ్ పరిణామాలు, రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు, బీఆర్ఎస్ ప్రతిఘటన చూస్తుంటే తెలంగాణ రాజకీయం మళ్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయిందని అర్థమవుతోంది. మరి లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుని జోరుమీదున్న బీజేపీ ఇప్పుడు తెరపైన కనిపించడం లేదు. ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్న కమలనాథులు రేసులో వెనకబడ్డారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్య విజయాలను నమోదు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో సమానంగా 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ గట్టిగా భావించింది. కానీ, జాతీయ స్థాయి విజయాలను క్షేత్రస్థాయి రాజకీయాలకు ఆపాదించుకోవడంలో బీజేపీ విఫలమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కేవలం జాతీయ రాజకీయాలు, ప్రధాని మోదీ ఇమేజ్ ప్రాతిపదికన వచ్చినవే తప్ప, క్షేత్రస్థాయిలో పార్టీకి తిరుగులేని సంస్థాగత బలం పెరిగిందనడానికి ఆ ఫలితాలు నిదర్శనం కాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ప్రస్తుత పొలిటికల్ సినారియోలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అటు బీఆర్ఎస్ ను, ఇటు బీజేపీని కార్నర్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వాన్నే టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు, ఫామ్‌హౌస్ వివాదాలు, పాలనా పరమైన విమర్శలన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే నడిచేలా అధికార పార్టీ నెరేటివ్‌ను విజయవంతంగా సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ మొత్తంలో మూడో పక్షంగా ఉన్న బీజేపీకి ఎలాంటి పొలిటికల్ స్పేస్ దక్కడం లేదు. ప్రజల చర్చల్లోనూ, మీడియా ఫ్రేమ్‌లోనూ బీజేపీ పూర్తిగా సైడ్ అయిపోయింది.
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య చాలా పరిమితం.అదే సమయంలో, వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే బలమైన ఆందోళన కార్యక్రమాలను రూపొందించడంలో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. కేవలం ఢిల్లీ పెద్దల మీద ఆధారపడటం, మీడియాలో ప్రకటనలు గుప్పించడమే తప్ప, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో బీజేపీ యంత్రాంగం విఫలమవుతోంది. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడంలో బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తుంటే, బీజేపీ మాత్రం ఇంకా అలర్ట్ కాలేదు.
రాబోయే ఎన్నికల సమయానికి ఇదే వైఖరి కొనసాగితే, బీజేపీ సాధించిన లోక్‌సభ విజయాలు కేవలం ఒక బబుల్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఢీకొట్టగల సమర్థమైన శక్తి బీఆర్ఎస్ మాత్రమే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతే, బీజేపీ రేసులో నిలవడం కష్టం. బీజేపీ తన పాత వైఖరిని మార్చుకుని, క్షేత్రస్థాయిలో దూకుడు పెంచకపోతే రాష్ట్రంలో ద్విముఖ పోరు మళ్లీ బలపడి కమలనాథులు మూడో స్థానానికి పరిమితం కాక తప్పదు.








