ప్రజా సమస్యలు గాలికి.. రాజకీయ రణరంగంగా చట్టసభ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రజా సమస్యలపై చర్చ జరగకపోగా, రాజకీయ రణరంగంగా మారుతున్నాయి. సభలో అర్థవంతమైన చర్చలు కొరవడి.. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిరసనలు, అరెస్టుల పర్వమే ప్రధాన అజెండాగా సాగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించేలా ఉన్నాయనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్గిమీద గుగ్గిలమైంది. దీనిని ప్రధాన అజెండాగా మలుచుకున్న అధికార పక్షం, బీఆర్ఎస్కు దళితులపై చులకన భావం ఉందని మండిపడుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం వంటి 20 కీలక అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. బ్లాక్ డ్రెస్‌లతో సభకు హాజరవడం, గన్ పార్క్ వద్ద నిరసనలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉద్రిక్తతలు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్టులు వంటి పరిణామాలు సభ వెలుపల ఉద్రిక్తతను తారాస్థాయికి చేర్చాయి.
ఇవి కూడా చదవండి
గత బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య అసెంబ్లీ వేదికగా స్పష్టమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయగా, నేడు అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అమలు చేస్తోంది. అయితే, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు అతి తక్కువ రోజులు మాత్రమే జరిగాయని, కేవలం తమకు అనుకూలమైన బిల్లుల పాసింగ్కే పరిమితం చేశారనే విమర్శ ఉండేది. నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా సభలో ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చలు జరగకుండా, కేవలం రాజకీయ కక్ష సాధింపులు, వ్యక్తిగత విమర్శలు, సస్పెన్షన్లకే సమయం వృథా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం తమ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ వివాదాలను ఆయుధంగా మలుచుకుంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. ప్రతిపక్షం సజావుగా సభను నడవనీయకుండా అడ్డు తగులుతుందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. కేవలం నాలుగు రోజులుగా ఒక్క ప్రశ్నోత్తరాల సమయం కూడా సక్రమంగా జరగకపోవడం, సభ నిరవధిక వాయిదాల బాట పట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు శుభపరిణామం కాదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. శాసనసభ అంటే కేవలం రాజకీయ యుద్ధ భూమి కాదనీ, ప్రజా సమస్యలపై మేధోమథనం జరిగే పవిత్ర దేవాలయమనే సత్యాన్ని ఇరుపక్షాలు విస్మరిస్తున్నాయి. చట్టసభలను రాజకీయ లబ్ధికి వదిలేసి, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలకు అధికార, ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.








