అసెంబ్లీ రగడ వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య రాజకీయం మరింత వేడెక్కింది. అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు, సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు, సభకు ఆటంకాలు కలిగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అధికార కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 6 తర్వాత జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.
అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఒక బృహత్తర కుట్రకు తెరలేపారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. విద్యారంగంలోని సమస్యలు, ధరణి పోర్టల్ అవకతవకలు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని అప్పులు, వైఫల్యాలపై అసెంబ్లీలో ప్రభుత్వం నుంచి గట్టి చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే ప్రతిపక్షం ఈ నాటకాలకు తెరలేపిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభను అడ్డుకోవడం వెనుక ప్రతిపక్షం ముందస్తు వ్యూహం ఉందని అధికార పార్టీ అనుమానిస్తోంది.
మరోవైపు.. దళితులను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాళ్లు చేసిన ఆందోళనలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా జరిగిన పరిణామాలు, సభా అధ్యక్షుడి పట్ల వ్యవహరించిన తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 6 నుంచి జరిగిన ప్రతి ఒక్క సంఘటనను, దాని వెనుక ఉన్న తెరవెనుక కుట్రలను ఈ విచారణలో నిగ్గుతేలుస్తామన్నారు. ఐపీఎస్ అధికారి జయకుమార్ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరగనుంది.
ఈ విచారణ ద్వారా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా జరిగిన రాజకీయ వ్యూహాలు, సభను అడ్డుకోవడానికి జరిగిన కుట్రల బండారం బయటపడుతుందని కాంగ్రెస్ అంటోంది. రానున్న రోజుల్లో ఈ విచారణ నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనాత్మక పరిణామాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి.








