కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మహేష్ బిగాల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం, కేసులు బనాయించడం, అసెంబ్లీలో ప్రజా గొంతుకను నొక్కేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగిన పోలీసు చర్యలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు, ఎమ్మెల్యేల సస్పెన్షన్ వంటి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
ఉద్రిక్తతలపై ఆందోళన..
తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో వెళ్లి ఉద్రిక్తతలకు కారణమవడం అత్యంత గర్హనీయమని మహేష్ బిగాల ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు ఉండటం సహజమే అయినప్పటికీ, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇల్లు వరకూ రాజకీయ నిరసనలను తీసుకెళ్లడం రాష్ట్ర రాజకీయ సంస్కృతికి తగదని హితవు పలికారు. తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన నేత పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానిది..
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల బాధ్యతని, అయితే ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం కేసులు, అరెస్టులు, పోలీసుల దౌర్జన్యాలు, సస్పెన్షన్లతో గొంతు నొక్కాలని చూడటం సరికాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు ధోరణిని పక్కనపెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నివాసం వద్ద జరిగిన ఘటనతో పాటు తాజా పరిణామాలపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
అధికారాలు శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారినా ప్రజాస్వామ్య విలువలు, తెలంగాణ ఉద్యమ చరిత్రను కాపాడుకోవాలని మహేష్ బిగాల హెచ్చరించారు. ఎన్ని కేసులు, అరెస్టులు, బెదిరింపులు చేసినా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకను ఎప్పటికీ అణచివేయలేరని ఆయన స్పష్టం చేశారు.








