మందులు లేకుండానే… కిడ్నీలకు సహజంగా మేలు చేసే అలవాట్లు ఇవే!
మన మన శరీరాలు ఆరోగ్యంగా, సజీవంగా వుండడానికి కిడ్నీలు అత్యంత ఆవశ్యకమైన అవయవాలు. ఇవి కేవలం మూత్రాన్ని తయారు చేసే భాగాలు మాత్రమే కావు. మన శరీరంలోని రసాయన సమతుల్యతను కాపాడే అద్భుతమైన ఫిల్టరింగ్ వ్యవస్థ. శరీరంలోని రక్తంలో వుండే వ్యర్థాలను, విష పదార్థాలను నిరంతరం వడబోసి, బయటకు పంపే అత్యంత కీలకమైన అవయవాలు.
కిడ్నీల కీలక పాత్ర

కిడ్నీలు ప్రతి రోజూ దాదాపు 180 లీటర్ల రక్తాన్ని నిరంతరం వడబోస్తూ వుంటాయి. ఇలా వ్యర్థాలను శుద్ధి చేస్తాయి. మెటబాలిజం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరియా, క్రియాటినిన్ వంటి హానికరమైన వ్యర్థాలను, టాక్సిన్స్‌ను వేరు చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి.మనం తాగే నీటి పరిమాణాన్ని బట్టి శరీరంలో ఎంత నీరు ఉండాలి, ఎంత బయటకు వెళ్లాలి అనేది కిడ్నీలు నిర్ణయిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో అదనపు ద్రవాలు పేరుకుపోయి కాళ్లు, చేతులు, ముఖం వాపునకు గురవుతాయి. రక్తపోటును నియంత్రించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రనిన్ (Renin) అనే హార్మోన్‌ను విడుదల చేయడం ద్వారా రక్తనాళాల ఒత్తిడిని మరియు రక్త పరిమాణాన్ని నియంత్రిస్తాయి.
కిడ్నీలకు మేలు చేసే పానీయాలు

ఇవి కూడా చదవండి
ప్రతి రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగడం చాలా ముఖ్యం. సరిపడా నీరు తాగడం వల్ల సోడియం మరియు విష వ్యర్థాలు మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్తాయి.నీరు తక్కువగా తాగితే కిడ్నీలలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
నిమ్మరసం ద్వారా కూడా కిడ్నీలను క్లీన్ చేస్తాయి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాలలో క్యాల్షియం రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కిడ్నీల శుభ్రతకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే అసిటిక్ యాసిడ్ కిడ్నీలలోని టాక్సిన్లను కరిగించడంలో సాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో 1-2 చెంచాల వినెగర్ కలిపి తీసుకోవచ్చు.
కిడ్నీలకు మేలు చేసే ఆహారం

అలాగే పుచ్చకాయ కూడా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో నీటి శాతం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరిచి మూత్ర విసర్జన పెరిగేలా చేస్తాయి. దోస కాయ, బార్లీ నీటితో కూడా కిడ్నీలను శుభ్రం చేసుకునే పద్ధతి ఒకటి వుంది. శరీరాన్ని చల్లబరిచి, కిడ్నీల మార్గంలో ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.శరీరంలో సోడియం (ఉప్పు) ఎక్కువైతే కిడ్నీలు దాన్ని బయటకు పంపడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి కిడ్నీలు దెబ్బతింటాయి.ప్యాక్ చేసిన తినుబండారాలు, ఫాస్ట్ ఫుడ్స్, అధిక ఉప్పు ఉన్న ఊరగాయలకు దూరంగా ఉండాలి.








