టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. భక్తులు, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పలు వెసులుబాట్లు
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. భక్తులు, ఉద్యోగుల సంక్షేమం, తిరుమల పరిశుభ్రత, సేవల మెరుగుదల , ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎల్ఐసీ (LIC) ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. తిరుమలలో సహజ మరణం సంభవించే భక్తుల కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ పథకానికి ఆమోదం తెలిపారు. ఇందుకోసం ఎల్ఐసీకి టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించనున్నారు.
ప్రభుత్వ అనుమతి కోరుతూ..
తిరుమల అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్లలోని ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేసి తిరిగి అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేయనున్నారు. ఐవోసీఎల్ (IOCL) సహకారంతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్వహణను M/s GPS Renewables సంస్థకు రూ.2.80 కోట్లతో అప్పగించేందుకు ఆమోదించారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అదనంగా 400 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం , బలిపీఠానికి బంగారు తాపడం చేసేందుకు రూ.17.05 కోట్లకు ఆమోదం లభించింది. నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి కూడా బంగారు తాపడం ఏర్పాటు చేయనున్నారు. దాతల సౌకర్యార్థం నామినీల మార్పు ప్రక్రియలో మరింత వెసులుబాటు కల్పిస్తూ విధానపరమైన సవరణకు ఆమోదం తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.49 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా రెండో విడత కింద రూ.7.56 కోట్లు విడుదల చేయనున్నారు. పనుల పురోగతి , యూటిలైజేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా మిగిలిన మొత్తం విడతల వారీగా విడుదల కానుంది. అదనంగా సరఫరా చేసే 10 MLD నీటికి మాత్రమే 50% రాయితీ వర్తింపజేస్తూ అవసరమైన ఒప్పందం (MoU) కుదుర్చుకోనున్నారు.

పారిశుధ్యం కోసం తీసుకున్న నిర్ణయాలు..
సీపీఎస్/ఎన్పీఎస్ (CPS/NPS) పెన్షనర్లు , వారి కుటుంబాలకు ఈహెచ్ఎఫ్ (EHF) సౌకర్యం కల్పిస్తూ రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు ఆమోదం తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించారు. తిరుమలలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా అదనపు సిబ్బందికి రవాణా ఛార్జీల నిమిత్తం మూడేళ్లకు గాను రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. గతేడాది బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఎఫ్ఎంఎస్ (FMS) విభాగంలో విధులు నిర్వర్తించిన కార్మికులకు లడ్డూ, వడ ప్రసాదం అందించాలని నిర్ణయించారు. టీటీడీ ఈహెచ్ఎఫ్ పథకం కింద 2026 మే–జూలై మధ్యకాలంలో రూ.5 లక్షలకు పైగా వైద్య ఖర్చులు భరించిన 15 మంది ఉద్యోగులు/పెన్షనర్లకు మొత్తం రూ.54.66 లక్షల రీయింబర్స్మెంట్ మంజూరు చేశారు. తిరుపతిలోని తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్స్ గడువును 2026 నవంబర్ 2 నుంచి 2029 నవంబర్ 1 వరకు మరో మూడేళ్ల పాటు పొడిగించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడి భద్రత, సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన బాధ్యతని, ఉద్యోగుల సంక్షేమం , తిరుమల పవిత్రతను కాపాడుతూ పారదర్శకంగా ముందుకు వెళ్తామని పాలకమండలి స్పష్టం చేసింది.








