వారిని వదిలే ప్రసక్తి లేదు : సీఎం రేవంత్ రెడ్డి
శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో కోట్లాది ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా
కాంగ్రెస్ ఏం చేసిందని అడిగేవారు… పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను ఒకసారి పరిశీలించాలి
కాంగ్రెస్ దూరదృష్టితో ఏ రకంగా ఈ దేశం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుందో అర్థమవుతుంది
ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లను కల్పించింది కాంగ్రెస్ పార్టీ
ఇది కాంగ్రెస్ పార్టీ విధానం
కర్ణాటకలో ఒక చిన్న గ్రామంలో పుట్టి…
రజాకార్ల దాడులలో తండ్రిని కోల్పోయి కార్మిక నాయకుడిగా రాణించి.. జాతీయ స్థాయికి ఎదిగిన నేత మల్లికార్జున ఖర్గే
60 ఏళ్లుగా ఒకరోజు కూడా విరామం లేకుండా ఆయన ప్రజలకోసం పనిచేస్తున్నారు
ఉత్తరాఖండ్ లో ఒక మైదానంలో జరిగిన సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొంటే..
ఆగస్టు 10 న బీజేపీ అనుబంధ సంస్థ ఆ మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం హేయమైన చర్య
దీన్ని ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది
ఈ ఘటనపై ఖర్గే రాజ్యసభలో భావోద్వేగంతో ప్రధానిని అడిగి కడిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు
పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతిని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు
ఇదిలా ఉండగానే మరో దురదృష్టకర సంఘటన జరిగింది
విద్యా రంగంలో అక్రమాలు, ధరణి అక్రమాలు, 22 ఏ రాద్ధాంతంపై సభలో చర్చించాలని అనుకున్నాం
కానీ ఫామ్ హౌస్ లో కుట్ర చేసి తమ సభ్యులను సభను అడ్డుకునేందుకు ఉసిగొల్పారు
సమస్యలపై చర్చ జరిగితే వారి పదేళ్ల దురాగతాలు, అప్పులపై ప్రజలకు అవగాహన కలుగుతుందని భయపడ్డారు
అదే జరిగితే తెలంగాణ ప్రజలు ఇక శాశ్వతంగా వారి పార్టీని బొందపెడతారని చర్చ జరగకుండా కుట్ర చేశారు
పార్లమెంట్ పై దాడి చేసిన వాళ్లకు, ముంబై దాడులకు పాల్పడిన కసబ్ కు, పుల్వామాలో సైనికులపై దాడిచేసిన తీవ్రవాదులకు, ఉన్మాదంతో సభాపతిని అవమానించిన వారికి పెద్ద తేడా లేదు
ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి కుర్చీని అవమానించేలా వ్యవహరించారు
వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించారు
మహిళలను శక్తిగా కొలిచే సమాజం మనది
భారత దేశాన్ని భారత మాత అని, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తున్నాం
సభాపతిగా ఉన్న మీ మనసుకు గాయం చేయాలని ఉన్మాదంతో మాట్లాడారు
ప్రతిపక్ష నాయకుడు కెసీఆర్ సభాపతికి క్షమాపణ చెప్పి వారి సభ్యులతో క్షమాపణ చెప్పించి సభ సజావుగా జరిగేలా చూస్తారని అంతా భావించారు
కానీ అలా జరగకపోగా మరింత ఉన్మాదంతో వ్యవహరించారు
అందుకే… ఏ ఫామ్ హౌస్ లో కుట్ర జరిగిందో ఆ ఫామ్ హౌస్ ముందు దండోరా వేయాలని ప్రజాస్వామ్యవాదులు నిరసనకు దిగారు
వాళ్లలా ఉన్మాదానికి తెగబడలేదు.. కేవలం డప్పు దరువులతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపారు
దళిత సోదరులు తమ మనసులో భావాన్ని వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు
మిమ్మల్ని అవమానించినట్లుగా కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద వారిని అవమానించలేదు.. దూషించలేదు
మమ్మల్ని బానిసలుగా భావించవద్దని.. సహనాన్ని కోల్పోయేలా వ్యవహరించవద్దని మేల్కొలిపేందుకు అక్కడికి వెళ్లారు
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?
ప్రతిపక్ష నాయకుడిగా బాధలో ఉన్నవారి సమస్యను పరిష్కరించే బాధ్యత వారిపై ఉంది
ఆ ప్రతినిధులను లోపలికి పిలిచి మాట్లాడి జరిగిన సంఘటనపై కెసీఆర్ బాధ్యతతో వ్యవహరించాల్సి ఉండే
కానీ అలా వ్యవహరించకుండా మళ్లీ ఉన్మాదంతో వ్యవహరించారు
దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించి తీవ్రంగా అవమానించారు
అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. రాతి యుగంలో ఉన్న రాక్షసుల్లా వ్యవహరిస్తారా?
సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు జాతుల మధ్య వైరంగా మార్చాలని అనుకుంటున్నారు
పదేళ్లు అధికారంలో ఉండి, ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలనుకుంటున్నారు
వాళ్లు దళితులు నడిచిన నేలను శుద్ధిచేస్తే.. వారి మనసుల్లో పేరుకున్న అంటరాని తనాన్ని ఎలా శుద్ధి చేయాలి
నీళ్లతో కడగాలా? యాసిడ్ తో కడగాలా?
దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తే కడుపులు నిండుతున్నాయి
శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదు… మీ అహంకారం, అంటరానితనం ఆలోచనలను
కెసీఆర్ మనసులో పేరుకుపోయిన దొర అహంకారాన్ని
ఈ బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుంది
సభాపతిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది
జరిగిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెబితే మీ కిరీటం ఊడి కింద పడుతుందా?
ఒకవైపు మల్లికార్జున ఖర్గే కు జరిగిన అవమానమైనా, గడ్డం ప్రసాద్ కుమార్ కు జరిగిన అవమానమైనా ఈ సమాజానికి జరిగినట్లే
ఇంకా కొంతమంది మనసుల్లో పేరుకున్న మనువాద భావాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారినైనా ప్రభుత్వం విచారణ చేపట్టి శిక్షించాలని నిర్ణయించింది
కుట్రలు పన్నినవారితో పాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షించాలని నిర్ణయించాం
సెప్టెంబర్ 6 న జరిగిన కుట్ర నుంచి జరిగిన అన్ని సంఘటనలను క్రోడీకరించి అందరిపై సంపూర్ణ విచారణ చేసి, క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది
సభాపతిగా తమరు మానసిక ధైర్యం కోల్పోవద్దు
మీ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదు
చట్టాలు, సెక్షన్లు అడ్డు పెట్టుకుని కొంతమందికి బెయిల్ పొందొచ్చు .. కానీ తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు
రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది
ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది.








