ఏపీ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలి : మంత్రి లోకేష్
ఎన్నారైల అండతో తెలుగుదేశం జెండా రెపరెపలు
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ సమయంలో ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు
ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎన్ఆర్ఐల కృషి మరువలేనిది
తెలుగుజాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్
తెలుగు జాతిని నెం.1గా చేసే బాధ్యత తీసుకుందాం
2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది
ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి లోకేష్
మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తెలుగుజాతిని నెం.1గా చేసే బాధ్యత సమిష్టిగా తీసుకుందామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులతో ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ అండ్ రిలేషన్స్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా డా.పి.గురురాజా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. ఏ దేశానికి వెళ్లినా తెలుగులో మాట్లాడితే కనీసం 20మందైనా స్పందిస్తారు. తెలుగువారి ఆత్మగౌరవం స్వర్గీయ ఎన్టీఆర్. రాజకీయాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. రాజకీయాల్లో చదువుకున్న వారికి, మేధావులకు అవకాశం కల్పించారు. సమాజంలో మార్పు కోసం కృషిచేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఆశయాలను చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో తొలిసారిగా 50శాతం స్థానాల్లో యువకులు గెలుపొందారు. ఏడుగురు ఎన్ఆర్ఐలకు కూడా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు.
చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు
2019-24 మధ్య రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. ఆనాడు అమరావతి ఉద్యమానికి ఎన్ఆర్ఐలు మద్దతుగా నిలిచారు. కేసులు పెట్టినా భయపడలేదు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు 50 దేశాల్లో 200 పట్టణాల్లో ఎన్ఆర్ఐలు కార్యక్రమాలు నిర్వహించారు. నారా బ్రాహ్మణి మనకు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. అలాంటి సమయంలో నిర్వహించిన ‘ఐయామ్ విత్ సీబీఎన్’ కార్యక్రమం మా కుటుంబానికి కొండంత బలంగా నిలిచింది. మళ్లీ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. ఐదు వేల డాలర్లు ఖర్చుపెట్టి ఓటు వేయడానికి రాష్ట్రానికి వచ్చారు. కొన్ని నెలల పాటు ఉద్యోగాలకు సెలవు పెట్టి గ్రామాల్లో తిరిగారు. ప్రజలను చైతన్య పరిచారు. ప్రజాప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములయ్యారు.
ఎన్ఆర్ఐలు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్
ఎన్ఆర్ఐలు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. నమ్ముకున్న పార్టీ కోసం, తెలుగుజాతి కోసం నిలబడ్డారు. మీ పిల్లలకు అద్భుతమైన తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగుతనం ఏనాడూ మర్చిపోలేదు. సొంత గ్రామాలపై మమకారం, సేవాభావం ఎక్కువ. మీరు చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించారు. అదీ మీ కమిట్ మెంట్. ఇందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.
తెలుగుజాతిని నెం.1గా చేసే బాధ్యత తీసుకుందాం
తెలుగుజాతి గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రత్యేక విమానం పెట్టి తెలుగువారిని రక్షించాం. ఉక్రెయిన్ పై దాడుల సమయంలో తెలుగువారికి అండగా సీబీఎన్ నిలిచారు. గతేడాది సంక్షోభం కారణంగా నేపాల్ లో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి వారిని సురక్షితంగా ఇళ్లకు తరలించాం. ఎన్ఆర్ఐలు తెలుగుజాతికి బ్రాండ్ అంబాసిడర్లు. తెలుగుజాతిని నెం.1గా చేసే బాధ్యత తీసుకుందాం. ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీరు పనిచేసే కంపెనీలు ఏపీకి వచ్చేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయి. ఏపీ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలి.
ఎన్ఆర్ఐ సభ్యత్వం తీసుకురావాలి
ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీరు చేసిన కృషి మరువలేనిది. ఎన్ఆర్ఐ సభ్యత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరంతా ‘మై టీడీపీ యాప్’ తో అనుసంధానం కావాలి. 2019-24 మధ్య అనేక మంది న్యూట్రల్స్ కు ఫోన్ చేసి ఎన్నికల్లో గెలుపునకు కృషిచేశారు. తిరిగి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. డాక్టర్ గురురాజా గారిపై బాధ్యత పెరిగింది. ఏ దేశంలో పది మంది ఉన్నా ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ ఉండాలని కోరుతున్నా. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం జయప్రదం చేయాలి. రాబోయే 30 రోజుల్లో ఇప్పుడున్న కమిటీలను పూర్తిచేద్దాం. కష్టపడిన వారికి కమిటీల్లో స్థానం కల్పించాలి.
2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి మూడేళ్లు. దొంగ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. రూ.3వేల కోట్ల అవినీతి అన్నారు. తర్వాత మూడొందల కోట్లు, తర్వాత 3 కోట్లు అన్నారు. చివరకు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించలేకపోయారు. ఐటీ, ఈడీ, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు గారు ఏ తప్పూ చేయలేదు. ఆయన అభివృద్ధి చేసిన జైల్లోనే నిర్బంధించారు. మనమంతా 24 గంటలు పోరాడాం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో తెలుగువారు రోడ్లపైకి వచ్చారు. అదే మా కుటుంబానికి కొండంత బలం. ఈ రోజు రాత్రి ఇళ్లలో, కలిసికట్టుగా 53 రోజుల అక్రమ నిర్బంధానికి గుర్తుగా 53 క్యాండిల్స్ వెలిగిద్దాం. అక్రమ అరెస్ట్ ను జ్ఞాపకం చేసుకుందాం. చంద్రబాబు గారు ఎప్పుడూ తెలుగుజాతి నెం.1గా ఉండాలని ఆలోచించే వ్యక్తి. అలాంటి నాయకుడికి అందరం అండగా నిలవాలి. 2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.








