ఇంట్లో చేసే వినాయక చవితికి.. ఈ సింపుల్ అట్రాక్టివ్ డెకరేషన్ ఐడియాలు ట్రై చేయండి.. అదిరిపోతుంది!
వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇంట్లో ప్రతిష్టించే స్వామివారి రూపం, పూజా మండప అలంకరణ. భారీగా ఖర్చు చేయకుండా, ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతోనే చవుకగా, పర్యావరణహితంగా, అత్యంత ఆకర్షణీయమైన మండపాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చో చూద్దాం.
పట్టు చీరలు, ఆకులతో మండపానికి సహజమైన రాయల్ లుక్

గోడకు ఎటువంటి మేకులు కొట్టకుండా, ఇంట్లో ఉండే అందమైన పట్టు చీరలు లేదా రంగురంగుల దుపట్టాలను బ్యాక్‌డ్రాప్‌గా వాడవచ్చు. పసుపు, ఎరుపు, కాషాయం లేదా ఆకుపచ్చ రంగుల కాంబినేషన్లో వస్త్రాలను పరదాగా కడితే మండపానికి రాయల్ లుక్ వస్తుంది.
పూజా స్థలంలో పచ్చదనం ఉంటే ఆ ప్రశాంతతే వేరు. మండపం ఇరువైపులా రెండు అరటి మొక్కల ఆకులను లేదా కొబ్బరి మట్టలను అమర్చవచ్చు. మామిడి ఆకులతో చేసిన తోరణాలు, కొబ్బరి ఆకుల అల్లికలు చౌకగా లభించడమే కాకుండా పూజా మండపానికి పూర్ణ శోభను ఇస్తాయి.
పూలు, పేపర్ క్రాఫ్ట్స్‌తో సింపుల్‌గా ఆకర్షణీయమైన అలంకరణ

బంతి, చామంతి, గులాబీ పూలతో మండపం పీఠం చుట్టూ చిన్న దండలను అమర్చాలి. పీఠం ముందు భాగంలో రంగురంగుల పూల రేకలతో ‘ఓం’, ‘స్వస్తిక్’ లేదా చిన్న రంగవల్లి డిజైన్‌ను వేస్తే స్వామివారి రూపం మరింత ప్రశాంతంగా, సుందరంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంటూ రంగుల చార్ట్ పేపర్లు, కార్డ్బోర్డ్, గోనె సంచులతో చిన్న చిన్న ఫ్లవర్స్, తోరణాలు తయారు చేయవచ్చు. పిల్లలతో కలిసి పేపర్ ఫ్యాన్స్, పేపర్ ల్యాంప్స్ చేసి పీఠం పైన వేలాడదీస్తే చాలా వినూత్నంగా ఉంటుంది.
వార్మ్ లైటింగ్‌తో మండపానికి భక్తి వాతావరణం

రాత్రి వేళల్లో మండపం ప్రత్యేకంగా మెరిసిపోయేందుకు ఫెయిరీ లైట్లు (Fairy lights) లేదా పసుపు రంగు సీరియల్ లైట్లను ఉపయోగించవచ్చు. విగ్రహం ఇరువైపులా ప్రమిదల్లో నేతి దీపాలు లేదా మట్టి ప్రమిదలు వెలిగిస్తే భక్తి వాతావరణం ఉట్టిపడుతుంది.
ఈ విధంగా ప్రతిఒక్కరూ తమ సృజనాత్మకతను ఉపయోగించి, అతి తక్కువ బడ్జెట్లోనే స్వామివారి మండపాన్ని అత్యంత దివ్యంగా అలంకరించుకోవచ్చు.








