జిడ్డు,నల్లబడిన టీ జాలిని శుభ్రపరిచేందుకు.. ఈ 4 ఈజీ చిట్కాలు
రోజూ ఉదయం, సాయంత్రం టీ తయారు చేసుకునే ఇళ్లలో టీ జాలి కూడా తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే టీ పొడి, రంగు మరకలు పేరుకుపోవడంతో కొద్దిరోజులకే జాలి నల్లగా మారి, చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో టీ సరిగ్గా వడకపోవడంతో పాటు, జాలి నుంచి దుర్వాసన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జాలిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సింపుల్ పదార్థాలతో ఈ మరకలను సులభంగా తొలగించవచ్చు.
వేడి నీరు, డిష్వాషర్ లిక్విడ్‌తో శుభ్రం

టీ వడకట్టిన వెంటనే జాలిలో మిగిలిన టీ పొడిని తొలగించి, గోరువెచ్చని నీటితో కడగండి. సాధారణ మరకలు ఉంటే వేడి నీటిలో కొద్దిగా డిష్వాషర్ లిక్విడ్ వేసి జాలిని 10–15 నిమిషాలు నానబెట్టాలి.
ఆ తర్వాత మెత్తని బ్రష్‌తో జాలిని మెల్లగా రుద్ది శుభ్రం చేయండి. రంధ్రాల్లో ఇరుక్కున్న టీ పొడిని తొలగించడానికి పాత, మెత్తని టూత్‌బ్రష్ కూడా ఉపయోగించవచ్చు.
బేకింగ్ సోడాతో మొండి మరకలకు చెక్

టీ జాలిపై మరకలు గట్టిగా పేరుకుపోతే గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలపండి. జాలిని ఇందులో కొంతసేపు నానబెట్టి, మెత్తని బ్రష్‌తో మెల్లగా రుద్దితే మరకలు తొలగిపోతాయి.
చాలా కాలంగా ఉన్న గోధుమ రంగు టీ మరకలకు తెల్ల వెనిగర్‌ను నీటితో సమాన మోతాదులో కలిపి ఉపయోగించవచ్చు. కొద్దిసేపు నానబెట్టిన తర్వాత శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
స్టీల్ జాలికి మాత్రమే గ్యాస్‌పై కాల్చే పద్ధతి

స్టీల్ టీ జాలిపై గట్టిగా పేరుకున్న టీ మరకలను తొలగించడానికి జాలిని గ్యాస్ మంటపై కొద్దిసేపు వేడి చేయవచ్చు. మరకలు కాలిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి, డిష్వాషర్ లిక్విడ్ మరియు బ్రష్‌తో శుభ్రం చేయాలి.
అయితే ఈ పద్ధతిని స్టీల్ జాలికి మాత్రమే ఉపయోగించాలి.ప్లాస్టిక్ హ్యాండిల్ లేదా ఇతర ప్లాస్టిక్ భాగాలు ఉన్న జాలిని గ్యాస్ మంటపై అస్సలు పెట్టకండి.
నిమ్మరసంతోనూ మరకలను తొలగించవచ్చు

వెనిగర్ అందుబాటులో లేకపోతే నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు. మరకలున్న ప్రాంతంలో నిమ్మరసం రాసి కొద్దిసేపటి తర్వాత మెత్తని స్పాంజ్‌తో మెల్లగా రుద్ది శుభ్రం చేయండి.
శుభ్రం చేసిన తర్వాత జాలిని శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తేమ మిగలకుండా పొడి వస్త్రంతో తుడిచి పూర్తిగా ఆరబెట్టడం మంచిది.
జాలి ఎక్కువకాలం శుభ్రంగా ఉండాలంటే..

టీ వడకట్టిన వెంటనే జాలిలోని టీ పొడిని తొలగించి కడగడం అలవాటు చేసుకోండి. వారానికి ఒకసారి గోరువెచ్చని నీటిలో నానబెట్టి శుభ్రం చేస్తే టీ అవశేషాలు గట్టిగా పేరుకుపోకుండా ఉంటాయి.
మరకలు తొలగించడానికి స్టీల్ వూల్ లేదా చాలా గరుకైన స్క్రబ్బర్లను ఉపయోగించకండి. ఇవి స్టీల్ ఉపరితలంపై గీతలు పడేలా చేయడంతో పాటు, బలంగా రుద్దితే జాలి రంధ్రాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.








