స్పీడ్ పెంచిన తెలంగాణ బీజేపీ! ఒక్కసారిగా ఎంత మార్పు..!?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు దాటిన తరుణంలో, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే అస్త్రాలుగా బీజేపీ దూకుడు పెంచింది. న్యూఢిల్లీలో బీజేపీ అధినేత నితిన్ నబీన్‌తో రాష్ట్ర నాయకత్వం జరిపిన కీలక భేటీ అనంతరం రాష్ట్రంలో ఉద్యమాల వేగం రెట్టింపైంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని అధిష్ఠానం ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలతో కమలనాథులు సమరశంఖం పూరించారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపుతున్న విపక్ష గొంతును నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగుల సమస్యలపై బీజేపీ నిరసనల జోరును మరింత పెంచింది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు రాసిన వినతిపత్రాలను సచివాలయంలో ప్రభుత్వానికి సమర్పించేందుకు వెళ్లిన రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం వారం వ్యవధిలోనే ఆయనను నిర్బంధించడం లేదా గృహనిర్బంధంలో ఉంచడం ఇది మూడోసారి. పదే పదే ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు తమ పోరాటాలను ఆపలేవని, పైగా కార్యకర్తల్లో మరింత కసిని, పోరాట స్ఫూర్తిని నింపుతున్నాయని కమల నాయకత్వం స్పష్టం చేస్తోంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు చేస్తూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు కారణమవుతున్న సెక్షన్ 22ఏ భూ సమస్యలపై పార్టీ క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించింది. ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరిట రామచందర్ రావు ఇప్పటికే 48 గంటల నిరాహార దీక్ష చేపట్టడమే కాకుండా, జీవో 97కు వ్యతిరేకంగా రామాంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతు పలికారు. 22ఏ భూముల వివాదంపై బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రెండు రోజుల నిరాహార దీక్షకు పార్టీ పిలుపునిచ్చింది. అలాగే విద్యార్థి సమస్యలపై భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎన్.వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి జరిగిన నేపథ్యంలో నాయకులు జిల్లా పర్యటనలు చేపడుతూ క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను హైలైట్ చేస్తున్నారు. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. దీనికితోడు సింగరేణి భరోసా యాత్ర, సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు వంటి అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఈ వ్యూహాత్మక వేగం కేవలం నిరసనలకే పరిమితం కాలేదు.. రాబోయే కీలక ఎన్నికలే లక్ష్యంగా సాగుతోంది. త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలతో పాటు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ లోని క్యూర్ పరిధిలో ఉన్న మూడు మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే బీజేపీ తక్షణ లక్ష్యంగా కనిపిస్తోంది. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై నిలదీసి ప్రభుత్వాన్ని జవాబుదారీ చేస్తామని బీజేపీ చెప్తోంది. క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఉత్సాహంతో పనిచేస్తోందని, మూడు కార్పొరేషన్లలో పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమాగా ఉంది. ప్రభుత్వ అణచివేతను రాజకీయ పెట్టుబడిగా మార్చుకుంటూ, అటు ప్రజల ఆందోళనలను ఇటు అభివృద్ధి మంత్రాన్ని సమపాళ్లలో మేళవిస్తూ తెలంగాణ గడ్డపై అధికారమే పరమావధిగా కమలదళం తన ప్రస్థానాన్ని వేగవంతం చేసింది.








