రియల్ ఎస్టేట్ పెద్ద సమస్య: కొనుక్కునేవాళ్లు ఉన్నారు.. అమ్మేవాళ్లు ఏరీ?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కొందరికి ఇళ్లు కావాలి.
మరికొందరికి ఫ్లాట్లు కావాలి. ఆఫీసులు కావాలి.గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ ఉంది.
రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకీ పెరుగుతోంది. కొనేవాళ్లు ఉన్నారు. పెట్టుబడి పెట్టే వాళ్లు ఉన్నారు. భూములు ఉన్నాయి. కానీ కొనుక్కునేవాళ్లు దగ్గరకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడి అమ్మిపెట్టేవారు ఏరి ?
ఇక్కడ “అమ్మేవాళ్లు” అంటే బ్రోకర్లు కాదు. బిల్డర్లు కాదు. ఆస్తులు అమ్ముకునే కస్టమర్లు కాదు. ఈ భారీ రియల్ ఎస్టేట్ పరిశ్రమను నడిపించే ఉద్యోగులు.
భారత రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి సుమారు 1 ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా మారుతుందని అంచనాలు చెబుతున్నాయి. ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి. నియామకాల అవసరం పెరుగుతోంది. కానీ ఒక సమస్య మాత్రం ఈ బూమ్‌ను వెనక నుంచి వెంటాడుతోంది.
ఈ రంగానికి అవసరమైన మనుషులు ఎక్కడ?
రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎక్కడెక్కడి డబ్బు రావడం కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ రంగానికి మరో రకమైన పెట్టుబడి అవసరం. అదే టాలెంట్. 2025 డిసెంబర్లో రియల్ ఎస్టేట్ రంగంలో నియామకాలు ఏడాది ప్రాతిపదికన 21 శాతం పెరిగాయి. అంటే కంపెనీలకు మరింత మంది ఉద్యోగులు అవసరం అవుతున్నారు. అదే సమయంలో 2026లో భారతదేశంలో ఈ రంగంలోకి వచ్చే టాలెంట్ కొరత 82 శాతంగా ఉంది. ప్రపంచ సగటు చూస్తే 72 శాతం ఉంది.
అంటే ఒక వైపు ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలు ఉన్నవాళ్లు సరిపోవడం లేదు. ఇదే రియల్ ఎస్టేట్ బూమ్‌లో దాగి ఉన్న విచిత్రమైన సమస్య.
మార్కెట్లో డిమాండ్ ఉంది. ఉద్యోగాలు ఉన్నాయి. జీతాలు పెరుగుతున్నాయి. అయినా యువతలో ఈ రంగంకెరీర్ ఎంపికగా కనిపించడం లేదు.
ఎందుకు యువత రియల్ ఎస్టేట్ ఉద్యోగాలను ఎంచుకోవడం లేదు?
చాలామంది యువతకు రియల్ ఎస్టేట్ అంటే వెంటనే గుర్తొచ్చేది సేల్స్ ఉద్యోగం.రోజంతా కస్టమర్లకు ఫోన్లు చేయడం, సైట్ విజిట్లు చేయించడం, టార్గెట్లు పూర్తి చేయడం. అందుకే టెక్నాలజీ, ఫైనాన్స్, కన్సల్టింగ్, IT వంటి రంగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ వారికి ఆకర్షణీయంగా కనిపించటం లేదు.
అలాగే సమాజంలో రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నారంటే..ఏదో ప్లాట్ అంటగట్టేసే ఏజెంట్ అనే భావన ఉండటం కూడా దీనికి కారణం.
2. టార్గెట్ల ఒత్తిడి
ప్రత్యేకంగా సేల్స్ ఉద్యోగాల్లో పనితీరు డైరెక్ట్ గా అమ్మకాలతో ముడిపడి ఉంటుంది. నెలవారీ లేదా త్రైమాసిక టార్గెట్లు, కస్టమర్ ఫాలో-అప్స్, డీల్ క్లోజింగ్ వంటి ఒత్తిళ్లు ఉంటాయి. యువతలో చాలామంది ఇప్పుడు కేవలం “ఎంత సంపాదిస్తాను?” అని కాకుండా “ఎలాంటి ఒత్తిడి లేని పని చేయాలి?” అని కూడా చూస్తున్నారు.
3. పని–వ్యక్తిగత జీవితం విషయంలో సందేహాలు
సైట్ విజిట్లు, వీకెండ్ పనులు, కస్టమర్ అవసరాలకు అనుగుణంగా మారే టైమింగ్స్ వంటి అంశాలు కొన్ని రియల్ ఎస్టేట్ ఉద్యోగాలను ఇతర corporate jobs కంటే demandingగా మార్చవచ్చు. ఫ్లెక్సిబిలిటీ కోరుకునే కొత్త తరం దీనిని పెద్ద మైనస్‌గా చూడవచ్చు.
4. టెక్ కంపెనీలంత ‘కూల్’ ఇమేజ్ లేదు
ఇది చాలా కీలకమైన విషయం.
AI, software, fintech, startups—ఇలాంటి రంగాలు యువతకు innovation, technology, high-growth careers అనే ఇమేజ్ ఇస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మాత్రం చాలాసార్లు “పాత తరాల business” లా కనిపిస్తుంది.
5. కెరీర్ గ్రోత్ స్పష్టంగా కనిపించకపోవడం
“ఈరోజు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరితే ఐదేళ్ల తర్వాత ఎక్కడ ఉంటాను?” అనే ప్రశ్నకు కంపెనీలు స్పష్టమైన career path చూపించకపోతే యువత వెనక్కి తగ్గుతున్నారు.
6. నైపుణ్యాల mismatch
కాలేజీలో చదువుతున్న యువతలో చాలామంది data, AI, coding, digital marketing, analytics వంటి skills నేర్చుకుంటున్నారు. కానీ రియల్ ఎస్టేట్ ఉద్యోగాల గురించి వారికి సరైన career education లేదు. అంటే రియల్ ఎస్టేట్‌కు టాలెంట్ అవసరం ఉంది. టాలెంట్‌కు రియల్ ఎస్టేట్‌లో అవకాశాల గురించి అవగాహన లేదు.
7. రియల్ ఎస్టేట్‌లో కూడా AI వస్తోందనే విషయం యువతకు తెలియదు
రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్, సేల్స్ కాదు. AIతో property valuation, customer analytics, lead scoring, demand forecasting, virtual property tours, smart buildings, construction planning, project monitoring వంటి ఎన్నో పనులు మారుతున్నాయి. కానీ ఈ మార్పు గురించి యువతకు పెద్దగా కనిపించే narrative లేదు.
అందుకే వారు ఈ రంగాన్ని future-tech careerగా చూడటం లేదు. రియల్ ఎస్టేట్ అంటే ఇంకా చాలామందికి ‘సేల్స్ జాబ్’గానే కనిపిస్తోంది. ఇదే మొదటి సమస్య. కాలేజీ నుంచి బయటకు వచ్చిన యువకుడిని “రియల్ ఎస్టేట్‌లో ఉద్యోగం” గురించి అడిగితే చాలాసార్లు అతని మదిలో వచ్చే చిత్రం—ఫోన్ కాల్స్, కస్టమర్ ఫాలోఅప్స్, సైట్ విజిట్లు, టార్గెట్లు, డీల్స్. అంటే సేల్స్.
రియల్ ఎస్టేట్ మారుతోంది
ఒక ఆధునిక రియల్ ఎస్టేట్ కంపెనీలో టెక్నాలజీ, డేటా, ఫైనాన్స్, ప్రాజెక్ట్ డిజైన్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణం, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ అనలిటిక్స్, ఫండ్ రైజింగ్, ఆపరేషన్స్, సస్టైనబిలిటీ వంటి ఎన్నో విభాగాలు ఉన్నాయి. అయినా యువతకు ఈ మొత్తం career map స్పష్టంగా కనిపించడం లేదు. ఇది రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పెద్ద perception problem.
రియల్ ఎస్టేట్‌లో కూడా AI పాత్ర ఏమిటి
కస్టమర్ ఎవరు కొనొచ్చు? ఏ ప్రాంతంలో డిమాండ్ పెరగబోతోంది? ఏ ధర వద్ద ప్రాజెక్ట్‌కు స్పందన ఎక్కువగా ఉంటుంది? ఏ లీడ్ నిజంగా కొనుగోలుదారుగా మారే అవకాశం ఉంది? ప్రాజెక్ట్‌లో ఎక్కడ ఆలస్యం జరగొచ్చు? నిర్మాణ ఖర్చులు ఎలా మారొచ్చు? ఇలాంటి ప్రశ్నలకు డేటా, analytics, AI ఆధారంగా సమాధానాలు వెతికే దశ మొదలైంది.
రేపటి రియల్ ఎస్టేట్ ఉద్యోగి చేతిలో కేవలం బ్రోషర్ ఉండదు. డ్యాష్‌బోర్డ్ కూడా ఉంటుంది. కస్టమర్ డేటా ఉంటుంది. AI టూల్స్ ఉంటాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్ ఉద్యోగం కూడా మారుతోంది.








