పాలిటెక్నిక్ ప్రైవేటీకరణ దుమారానికి తెర
తెలంగాణలో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశమైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటీకరణ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటుపరం చేయబోతున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరించే ఆలోచనే ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అప్పగిస్తున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ గత కొంతకాలంగా పెద్దఎత్తున ఉద్యమించాయి. విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీనివల్ల పేద విద్యార్థులకు సాంకేతిక విద్య దూరం అవుతుందని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పడుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్న ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ప్రతిపక్షాల ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారనేది కేవలం కొందరు పనిగట్టుకుని సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేశారు. సాంకేతిక విద్యను ఆధునీకరించడానికి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను తీర్చిదిద్దడానికి మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ల అభివృద్ధికి టాటా గ్రూప్‌తో ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ఈ గ్రూప్ ఏకంగా 4వేల కోట్లు కేటాయించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.
ఇప్పటికే ఇదే విధానం ద్వారా ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి మంచి ఫలితాలు సాధించామని సీఎం గుర్తుచేశారు. ఈ ఏటీసీల ద్వారా మారుమూల, అటవీ ప్రాంతాల విద్యార్థులు సైతం పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం అంటే వాటిని ప్రైవేటుపరం చేయడం కాదని, కేవలం ఇండస్ట్రీ లింకేజ్లను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమేనని తేల్చిచెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి అత్యాధునిక రంగాల అవసరాలకు తగినట్లుగా కోర్సులను అప్డేట్ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీల నియంత్రణ ఎప్పుడూ ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే జీవో 97ని సవరిస్తామని హామీ ఇచ్చారు. ఫీజులు పెంచే ప్రసక్తే లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం యథావిధిగా కొనసాగుతుందని భరోసానిచ్చారు.
కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు సంస్కరణలను అడ్డుకోవాలని చూస్తున్నాయని సీఎం మండిపడ్డారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలను నమ్మి విద్యార్థులు ఆందోళన చెందవద్దని, చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని కోరారు. ఏది ఏమైనప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఈ ప్రకటనతో పాలిటెక్నిక్ ప్రైవేటీకరణ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.








