7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై… సంబంధాలు బాగుడపడతాయా?
న్యూఢిల్లీ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు సంవత్సరాల తర్వాత చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ భారత్ లో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా అధినేత భారత్కు రావడమిదే తొలిసారి. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ, జిన్పింగ్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడనుందని, వాణిజ్య సంబంధాలు మళ్లీ మెరుగవుతాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2019 లో చెన్నైలో జరిగిన సదస్సు తర్వాత జిన్ పింగ్ భారత్ కి రావడం ఇదే ప్రథమం. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాని తర్వాత 2024 లో జరిగిన ఒప్పందం నాటి నుంచి మళ్లీ మెళ్లిమెళ్లిగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మళ్లీ పుంజుకోవడం ప్రారంభించాయి.
అయితే జిన్ పింగ్ పర్యటనకు ముందు చైనా ఓ సందేశాన్ని పంపింది. పొరుగున వున్న వారితో స్నేహంగా వుండటం, దీర్ఘకాల మైత్రిపై దృష్టి సారించడం వంటి అంశాలను కూడా అందులో ప్రస్తావించింది. భారత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వున్నామని, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు విభేదాలను పరిష్కరించుకోవడానికి తాము కృషి చేస్తున్నామని అందులో పేర్కొంది.
ఇటీవలి కాలంలో భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏడాది క్రితమే ఇరు దేశాలకు విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే చైనా వ్యాపారుల కోసం వీసా ప్రక్రియను భారత్ సులభతరం చేసింది. సుమారు ఆరేళ్ల తరువాత రెండు దేశాల మధ్య సరిహద్దు ట్రేడింగ్ కూడా ప్రారంభమైంది. ఇలా కొంత కాలంగా పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దీనికి ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి.








