జాబ్‌లో చేరిన గంటకే 4,500 విమానాల ల్యాండింగ్ ఆర్డర్, అసలేం జరిగింది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఆ ఉదయం ఆకాశం మామూలుగానే ఉంది.
ఎప్పటిలాగే అమెరికా గగనతలంలో వేలాది విమానాలు తమ తమ మార్గాల్లో ఎగురుతున్నాయి. ప్రయాణికులు తమ సీట్లలో కూర్చున్నారు. పైలట్లు గమ్యస్థానాల వైపు వెళ్తున్నారు. కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లలో కూడా అంతా యథావిధిగానే సాగుతోంది.
అంతలో న్యూయార్క్ నుంచి ఒక సమాచారం వచ్చింది.
ఒక విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొట్టింది. మొదట అది ప్రమాదమే అనుకున్నారు. కొద్దిసేపటికే రెండో విమానం అదే టవర్ల వైపు దూసుకెళ్లింది. అప్పుడిక అక్కడున్నవాళ్లందరికీ విషయం అర్థమైంది. ఇది ప్రమాదం కాదు. అమెరికాపై ఎవరో కావాలని చేస్తున్న దాడి. ఆ క్షణమే అసలు భయం మొదలైంది. ఎందుకంటే ఆకాశంలో ఇంకా దాదాపు 4,500 విమానాలు ఉన్నాయి. వాటిలో ఏది సురక్షితం? ఏది ప్రమాదం? మరో విమానం ఎక్కడికి వెళ్తోంది? ఎవరికీ తెలియదు.
వర్జీనియాలోని FAA కమాండ్ సెంటర్లో ఆ విమానాలన్నీ స్క్రీన్లపై కదులుతున్నాయి. ఆ స్క్రీన్లను చూస్తున్న అధికారులకు ఇప్పుడు ఒక్కో విమానం ఒక కొత్త భయంలా కనిపిస్తోంది.
ఇంతలో పెంటగాన్‌పై కూడా విమానం ఢీకొట్టింది. ఇప్పుడు ఆ గదిలో ఉన్నవాళ్లకు ఒక్క విషయం మాత్రమే తెలుసు. ఇక ఆలస్యం చేయడానికి సమయం లేదు.కానీ ఏం చేయాలి, ఎవరు ఆదేశం ఇవ్వాలి.
ఆ సమయంలో బెన్ స్లైనీ అక్కడే ఉన్నారు. ఆయన ముందున్నది దేశం మొత్తం గగనతలాన్ని ప్రభావితం చేసే నిర్ణయం. అయితే బెన్ స్లైనీ గురించి ఒక విషయం తెలిస్తే ఈ కథ మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది ఆయన ఉద్యోగంలో మొదటి రోజు. కొత్త బాధ్యతలోకి వచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు. అయినా ఇప్పుడు ఆయన ముందున్న సమస్యకు సమాధానం చెప్పాల్సిందే. ఆదేశం ఇస్తే భారీ రిస్క్.
ఇవ్వకపోతే.. ఏ విమానం ఏం చేస్తుందో తెలియదు. స్లైనీ క్షణం ఆలోచించాడు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన ఆదేశంతో.. అమెరికా ఆకాశంలో ఉన్న దాదాపు 4,500 విమానాలు నేలపైకి దిగడం మొదలుపెట్టాయి.
తాను తప్పు చేస్తే ఏమవుతుంది?
ఏళ్ల తర్వాత ఆ రోజును గుర్తుచేసుకున్న స్లైనీ, తన నిర్ణయం తప్పయితే ఊహించిన దానికంటే ముందే తన కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని అనుకున్నానని చెప్పారు.
అంటే ఒకవైపు వేలాది మంది ప్రయాణికుల భద్రత. మరోవైపు తన కెరీర్. మధ్యలో మాత్రం సమయం లేదు. అలాంటి పరిస్ధితుల్లో స్లైనీ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా గగనతలంలో ఉన్న పౌర విమానాలను సమీప విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. దాదాపు 4,500 విమానాలు ఒక్కసారిగా కొత్త ఆదేశాల ప్రకారం కదలాల్సి వచ్చింది.
కేవలం “విమానాలు ల్యాండ్ చేయటం” మాట అనేస్తే సరిపోదు. పైలట్లకు సమాచారం చేరాలి. విమానాలను వేర్వేరు విమానాశ్రయాలకు మళ్లించాలి. కంట్రోలర్లు కొత్త ట్రాఫిక్‌ను నిర్వహించాలి. దేశవ్యాప్తంగా ఉన్న విమాన వ్యవస్థ మొత్తం ఒకేసారి కొత్త పరిస్థితికి తగ్గట్టుగా పనిచేయాలి.ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. కానీ ఆ రోజు అది చేయాల్సిందే.
బయట నుంచి చూస్తే నిర్ణయం చాలా ఈజీ టాస్క్ గా కనిపిస్తుంది. “దాడులు జరుగుతున్నప్పుడు విమానాలను దించేయాలి కదా” అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో స్లైనీకి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇంకో విమానం ప్రమాదంగా మారుతుందో లేదో తెలియదు. ఎక్కడి నుంచి ముప్పు వస్తుందో తెలియదు.
ఆయనకు భవిష్యత్తు కనిపించలేదు. ఉన్నది కొద్ది సమాచారం మాత్రమే. ఈ నిర్ణయంలో అసలు గొప్పతనం ప్రమాదాన్ని ముందే తెలుసుకోవడంలో లేదు. ప్రమాదం పూర్తిగా అర్థం కాకపోయినా చర్య తీసుకోవడంలో ఉంది.
ఫైనల్ గా..
ఇదే విషయం మన జీవితాల్లోనూ జరుగుతుంది. మన ముందెప్పుడూ 4,500 విమానాలు ఉండకపోవచ్చు. కానీ నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి మాత్రం కొత్తది కాదు. ఆఫీసులో ఒక సమస్య వస్తుంది. కీలకమైన ఉద్యోగి వెళ్లిపోతాడు. కస్టమర్ చివరి నిమిషంలో మాట మార్చేస్తాడు. వ్యాపారంలో ఒక అవకాశం చేతిలోంచి జారిపోతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు అందరివైపూ చూస్తూ కూర్చొంటే సరిపోదు. ఎందుకంటే మీరు వేచి ఉన్నంతసేపూ పరిస్థితి మాత్రం వేచి ఉండదు. కస్టమర్ వెళ్లిపోవచ్చు. పోటీదారు ముందుకు వెళ్లొచ్చు. చిన్న సమస్య పెద్దదవ్వొచ్చు.








