బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునాతీరే..!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో అంతర్గత కుమ్ములాటలు, సమన్వయ లోపం తీవ్రంగా వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి రాజకీయంగా ఎంతో సానుకూల వాతావరణం, ప్రజల్లో ఆదరణ కనిపిస్తున్నప్పటికీ.. పార్టీలోని నేతల వైఖరి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడం, అంతర్గతంగా గోతులు తవ్వుకోవడం వంటి పరిణామాలు పార్టీ ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చింది.
అసెంబ్లీలో ప్రభుత్వంపై సమష్టిగా పోరాడి, ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో ఉమ్మడి వ్యూహం పూర్తిగా కొరవడింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న తరుణంలో, కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. మరికొందరు సభ్యులు సభ సాక్షిగానే మంత్రులపై బహిరంగంగా పొగడ్తల వర్షం కురిపించడం సొంత పార్టీ శ్రేణులకే విస్మయం కలిగించింది.
ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాలపై కూడా బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కనిపించలేదు. కీలకమైన డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో ఒక ఎమ్మెల్యే వ్యతిరేక గళం వినిపిస్తే, మరో ఎమ్మెల్యే అదే వేదికపై స్వాగతిస్తూ మాట్లాడటం తీవ్ర సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది. ప్రజా సమస్యలపై పోరాటాల్లోనూ ఇదే ఒంటెద్దు పోకడ కనిపించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంటల బీమా పథకం అమలు కోరుతూ అసెంబ్లీకి వినూత్నంగా ట్రాక్టర్‌పై ర్యాలీగా రాగా, ఆ నిరసనలో తోటి ఎమ్మెల్యేలెవరూ పాలుపంచుకోకపోవడం పార్టీలోని విభేదాలను స్పష్టం చేసింది.
సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం బీజేపీ పట్ల వ్యవహరించిన తీరుపై పార్టీ నాయకత్వంలో అసంతృప్తి వ్యక్తమైంది. మొదటి మూడు రోజుల పాటు బీజేపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడం, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోగా ఎదురుదాడి జరగడంతో ఆఖరి రోజు సభను బహిష్కరించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయంపై ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి రాలేకపోయారు. పార్టీ వ్యూహాన్ని లెక్కచేయకుండా నాలుగో రోజు కొందరు ఎమ్మెల్యేలు యథావిధిగా సభకు హాజరయ్యారు. ఒక ప్రజాస్వామ్య వేదికపై పార్టీగా నిలబడాల్సిన కీలక సమయంలో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యం బహిర్గతం కావడం రాజకీయంగా బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు దీటైన ప్రతిపక్షంగా అవతరించేందుకు బీజేపీకి విస్తృతమైన అవకాశాలున్నాయి. అయితే, సమర్థవంతమైన నాయకత్వ నిర్మాణం లేకపోవడం, ఉన్న నేతలు కలిసికట్టుగా అడుగులు వేయకపోవడం పార్టీకి శాపంగా మారుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రజల పక్షాన నిలబడాల్సిన వేళ.. తమ స్వప్రయోజనాలు, భిన్నాభిప్రాయాలకే ప్రాధాన్యం ఇస్తున్న తీరు క్షేత్రస్థాయి కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన ఈ అంతర్గత విభేదాలు, వ్యక్తిగత ఎజెండాలు ఇలాగే కొనసాగితే.. ప్రజల్లో పార్టీపై విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.








