భారత విద్యార్థులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినవైఖరి..!
అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా కూడా వలసదేశాల నుంచి వస్తున్న విద్యార్థులపై కఠిన వైఖరి అవలంభిస్తోంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించాలని కలలు కంటున్న విద్యార్థులకు.. గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.ఆ దేశ ప్రభుత్వం విద్యార్థి వీసాల జారీలో కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో వీసా తిరస్కరణల సంఖ్య గత పదేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి ఆస్ట్రేలియా విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24.2 శాతంగా నమోదైంది. సరిగ్గా పదేళ్ల క్రితం, అంటే 2016 జూన్లో ఈ రేటు కేవలం 7.9 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
ఈ కఠిన నిబంధనల ప్రభావం భారత్, నేపాల్ దేశాల విద్యార్థులపై తీవ్రంగా పడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నేపాల్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 51శాతానికి పైగా తిరస్కరణకు గురికాగా, భారతీయ విద్యార్థుల విషయంలో ఈ రేటు 40 శాతానికి పైగా ఉంది. ఇదే సమయంలో చైనా విద్యార్థుల వీసా తిరస్కరణ రేటు కేవలం 5.8 శాతంగానే ఉండటం ఇక్కడి పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో ఆస్ట్రేలియాలో చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది.
‘జెన్యూన్ స్టూడెంట్’ నిబంధనే కీలకం
వీసాల తిరస్కరణకు ప్రధాన కారణంగా ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ ‘జెన్యూన్ స్టూడెంట్’ (Genuine Student) నిబంధనను చూపిస్తోంది. దీని ప్రకారం, దరఖాస్తు చేసుకున్న విద్యార్థి నిజంగా చదువుకోవడానికే వస్తున్నాడా లేదా అని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆస్ట్రేలియా విద్యా వ్యవస్థ బాగుంటుందని సాధారణ కారణాలు చెబితే సరిపోదు. దరఖాస్తుదారుడు ఎంచుకున్న కోర్సుకు, అతని గత విద్యా నేపథ్యం, ఉద్యోగానుభవం, వ్యక్తిగత పరిస్థితులు, భవిష్యత్ కెరీర్ ప్రణాళికలకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని నిరూపించుకోవాలి. ఈ విషయాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో విఫలమైన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. జాతీయత ఆధారంగా కాకుండా, ప్రతి దరఖాస్తును వ్యక్తిగతంగా, మైగ్రేషన్ నిబంధనల ప్రకారమే పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
తిరస్కరణకు గురైతే ఏం చేయాలి?
ఒకవేళ వీసా తిరస్కరణకు గురైతే, ఆందోళన చెందకుండా కొన్ని కీలక విషయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా హోం శాఖ పంపిన తిరస్కరణ లేఖను జాగ్రత్తగా చదవాలి. ఏయే కారణాలతో వీసాను నిరాకరించారో, ఏయే పత్రాలను పరిగణనలోకి తీసుకున్నారో అందులో స్పష్టంగా ఉంటుంది. కొందరు అభ్యర్థులకు అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ ట్రిబ్యునల్ (ఏఆర్టీ) ద్వారా సమీక్షకు వెళ్లే అవకాశం ఉంటుంది.








