కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. బీజేపీకి కొత్త అస్త్రం
18 వ బ్రిక్స్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అతిథులు, నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే.. బ్రిక్స్ సదస్సు కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. అది కూడా ఇద్దరు సీనియర్ల మధ్య చిచ్చు రేపడం గమనార్హం. బ్రిక్స్ సమావేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే మరో సీనియర్ శశి థరూర్ పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం బీజేపీకి ఆయుధమై కూర్చొంది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ఇలా అన్నారు: “ఎంతమంది అధ్యక్షులు, ప్రధానమంత్రులు వస్తున్నారో నాకు తెలియదు. గత రెండు లేదా మూడు BRICS శిఖరాగ్ర సమావేశాల నుండి ఎటువంటి స్పష్టమైన ప్రయోజనం లేదా నిర్దిష్ట ఫలితం లభించిందని నేను భావించడం లేదు.”అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మరో సీనియర్ నేత శశి థరూర్ పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.
11 దేశాల ఈ సమూహం ప్రపంచ జనాభాలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. “గ్లోబల్ సౌత్‌లో 100కు పైగా దేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గ్లోబల్ సౌత్‌కు చెందిన 11 కీలక దేశాలు ఉన్నాయి. ఇవి ఆ దేశాల విభిన్న అభిప్రాయాలకు సమష్టిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి” అని థరూర్ తెలిపారు.
ఈ కూటమి ప్రపంచ జనాభాలో మెజారిటీ వాటాను, గ్లోబల్ జీడీపీలో 41 శాతం వాటాను కలిగి ఉందని, కాబట్టి ప్రపంచ దేశాలు దీనిని చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆయన అన్నారు.
సభ్య దేశాల అధినేతలు, పరిశీలకులు ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ప్రపంచంలోని కీలక దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల భారత్ సామర్థ్యం ప్రదర్శితమవుతుందని థరూర్ చెప్పారు. ఇది దేశానికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై భారత్‌కు ఉన్న ‘దౌత్యపరమైన సమావేశ శక్తి’కి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.








