ఆప్ అధ్యక్ష బాధ్యతలు మళ్లీ కేజ్రీవాల్ కే…
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ను మరోసారి తమ పార్టీ జాతీయ కన్వీనర్ గా ఎన్నుకుంది. బుధవారం జరిగిన జాతీయ మండలి వర్చువల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆప్ కన్వీనర్ గా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ కీలక సమావేశంలో 330 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా 23 మందితో కూడిన నూతన జాతీయ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు.
పార్టీ పంకజ్ గుప్తాను కొత్త జాతీయ కార్యదర్శిగా నియమించగా, ఎన్.డి. గుప్తా జాతీయ కోశాధికారిగా కొనసాగుతారు. ఈ కొత్త జాతీయ కార్యవర్గంలో మొత్తం 23 మంది సభ్యులు ఉంటారు. పార్టీ దీనిని సంస్థను బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగుగా అభివర్ణించింది.ఆప్ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ ధండా, జాతీయ కన్వీనర్‌గా తిరిగి ఎన్నికైన కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. కేజ్రీవాల్ నాయకత్వంలో పార్టీ ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఆప్ కష్టకాలంలో వుంది. లిక్కర్ కేసుతో సహా రకరకాల కేసులు ఆ పార్టీని, ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతల్ని వేధిస్తున్నాయి. అలాగే ఒకే ఒక్క రాష్ట్రం పంజాబ్ లో మాత్రమే అధికారంలో వుంది. అక్కడ కూడా ఇబ్బందులు వున్నాయి. అయినా సరే.. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సారథ్యం వహిస్తూ వస్తున్నారు.
ఆయన పారదర్శకత, సమాచార హక్కు మరియు అవినీతి వ్యతిరేక పోరాటాలకు సంబంధించిన కార్యక్రమాల్లో గతంలో పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు, ఆయన ‘పరివర్తన్’ అనే సంస్థను కూడా స్థాపించారు. రేషన్ వ్యవస్థ, ప్రభుత్వ కార్యకలాపాలు, సామాజిక సంక్షేమ పథకాలు, ఆదాయపు పన్ను మరియు విద్యుత్ వంటి అంశాలకు సంబంధించిన ప్రజల సమస్యలను లేవనెత్తే దిశగా ఈ సంస్థ కృషి చేసింది.








