13 నిమిషాల్లోనే టార్గెట్ ఛేంజ్.. ఛార్జిషీట్ లో NIA
న్యూఢిల్లీ : ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద గత యేడాది కారు బాంబు పేలుడు ఘటన విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయ స్థానంలో ఛార్జిషీట్ ను సమర్పించింది. అందులో చాలా కీలకమైన విషయాలను వెల్లడించింది. అతను ఈ కుట్రను ఎలా పన్నాడు, ఎక్కడెక్కడ బస చేశాడు మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనే వివరాలు ఈ ఛార్జ్ షీట్లో ఉన్నాయి.
బాంబర్ ఉమర్ ఉన్ నబీ.. పేలుడు పదార్థాలున్న ఐ20 కారును తొలుత చాందినీ చౌక్ లోని లాల్ మందిర్ వద్ద పార్క్ చేయాలని అనుకున్నట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్ లో పేర్కొంది. అతడి తొలి టార్గెట్ లాల్ మందిరే కావొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేసింది. భారీ ట్రాఫిక్, పోలీసులు వుండటంతో ఉమర్ తన ఐడియాను మార్చేసి వుంటాడని కూడా ఎన్ఐఏ అందులో పేర్కొంది. లాల్ మందిర్ ను దాటి, అతడు యూటర్న్ తీసుకొని ఎర్రకోట గేట్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నాడని అందులో పేర్కొంది. అయితే.. దీనికి సంబంధించి, కారు పార్క్ చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలన్నీ స్పష్టంగా సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తూనే వున్నాయి.
ఛార్జ్ షీట్ ప్రకారం, ఉమర్ రిమోట్ కమాండ్ సిస్టమ్‌ను ఉపయోగించి IEDని పేల్చాడు; ఈ వ్యవస్థ అతని ఒక బూటులో అమర్చబడి ఉంది.‘‘కారుకు సమీపంలో లభించిన నిందితుడి షూ భాగానికి లోహపు ముక్క అతుక్కొని వుంది. దానిని పరీక్షించగా ట్రై అసిటోన్ ట్రైపెరాక్సైడ్, పొటాషియం, అమ్మోనియం నైట్రైట్ వున్నట్లు తేలింది’’ అని ఛార్జిషీట్ లో పేర్కొంది. అలాగే కారులో లభించిన నమూనాలు ఉమర్ తలిదండ్రుల డీఎన్ఏతో సరిపోయాయి అని కూడా తెలిపింది.
పేలుడు పదార్థాలను భద్రంగా నిల్వ చేయడానికి ఉమర్ తన గదిని చాలా చల్లగా ఉంచాడని దర్యాప్తులో వెల్లడైంది. ఆ గది నుండి దుర్వాసన కూడా వచ్చేది. అతను సిద్ధం చేసిన TATPని భద్రంగా నిల్వ చేయడానికి నీటితో నింపిన సంచులను కొనుగోలు చేశాడు. పేలుడు పదార్థాల మిశ్రమాన్ని స్థిరంగా ఉంచడానికి దానికి క్రమం తప్పకుండా నీటిని కలిపేవారని సాక్షులు తెలిపారు.








