బెజవాడ మేయర్ రేసులోకి దేవినేని ఫ్యామిలీ..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉంటూ, రాష్ట్రానికే గుండెకాయ లాంటి విజయవాడ(Vijayawada) కార్పొరేషన్ కాబోయే మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచే కార్పొరేషన్లలో విజయవాడ ఒకటి కావడంతో, ఇక్కడి మేయర్ అభ్యర్థిత్వం కోసం కూటమిలోని సీనియర్ నేతలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ రేసులోకి తాజాగా విజయవాడ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన దేవినేని కుటుంబం కూడా చేరిపోయింది.
విజయవాడ మేయర్ స్థానానికి పోటీ చేసేందుకు దేవినేని కుటుంబం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దేవినేని చందు(Devineni Chandhu) తన సతీమణి దేవినేని మహిత, తల్లి అపర్ణ దేవితో కలిసి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి లోకేష్‌తో భేటీ అయిన ఫోటోలను దేవినేని చందు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. “ఒక మర్యాదపూర్వక కలయిక… ఒక కొత్త ఆశ” అంటూ ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి రాబోయే ఎన్నికల్లో విజయవాడ మేయర్ అభ్యర్థిగా తమ పేరును పరిశీలనలోకి తీసుకోవాలని వారు అధిష్టానాన్ని కోరినట్లు స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి
బెజవాడ కార్పొరేషన్ పీఠంపై ఇప్పటికే పలువురు సీనియర్ నేతల వారసులు కన్నేసిన తరుణంలో, దేవినేని ఫ్యామిలీ కూడా ఎంట్రీ ఇవ్వడం స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే విజయవాడ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాల సమాచారం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి సామాజిక సమీకరణాలు, మరియు పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన నాయకుల ట్రాక్ రికార్డును బట్టి మాత్రమే అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం అందుతోంది.








