ఇళ్ల పట్టాలు, క్రమబద్ధీకరణ జాబితాను సిద్ధం చేయండి : సీఎం చంద్రబాబు
10 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రండి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 10 :- రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి పట్టాలు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై పరిమిత సమయం పెట్టుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి 10 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రావాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చించారు. ప్రస్తుతం 1.43 లక్షల మందిని ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో 1.26 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వచ్చే నెల 15వ తేదీ నాటికి వాటి పరిశీలన పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 1,692 గ్రామాల్లో 18 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎంతమందికి కొత్తగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి.. ఎంతమందికి పట్టాలను క్రమబద్ధీకరించాలనే అంశాలపై స్పష్టమైన జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇప్పటివరకు 5.92 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. మరో 5.32 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇళ్ల పట్టా అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అర్హుల గుర్తింపు నుంచి పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల పూర్తి వరకు ప్రతి దశను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.








